లేటెస్ట్

ముగ్గురిలో ఒకరేనా పోటీ చేసేది....!?

గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పొందినా..ముగ్గురు పార్లమెంట్‌ సభ్యులు మాత్రం రెండోసారి విజయం సాధించగలిగారు. అప్పటి టిడిపి ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తి టిడిపిని ఘోరపరాజయం పాలు చేసినా, వాటిని తట్టుకుని గుంటూరు నుంచి ‘గల్లా జయదేవ్‌, విజయవాడ నుంచి ‘కేశినేని నాని’ శ్రీకాకుళం నుంచి ‘ఎర్రనాయుడు’ తనయుడు ‘రామ్మోహన్‌నాయుడు’లు రెండోసారి విజయం సాధించగలిగారు. సీనియర్లుగా పేరు పడ్డ ఎంతోమంది టిడిపి నాయకులు ఓటమి చెందినా ఈ ముగ్గురు మాత్రం అప్పట్లో విజయం సాధించారు. అయితే..గత నాలుగున్నరేళ్లలో వచ్చిన రాజకీయ పెనుమార్పులతో ఇప్పుడు వీరు మళ్లీ పోటీచేస్తారా...? టిడిపి అధినేత వీరికి టిక్కెట్లు ఇస్తారా..అంటే..ఇక్క ‘రామ్మోహన్‌నాయుడు’ తప్ప మిగతా ఇద్దరికీ టిక్కెట్లు లేవనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. అయితే..వాస్తవానికి ‘గల్లా జయదేవ్‌, పోటీ చేస్తామంటే..టిడిపి అధినేత వారికి టిక్కెట్‌ ఇస్తారు. అయితే వ్యాపార కారణాలతో తాను మళ్లీ పోటీ చేయనని ‘గల్లా’ చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘బిజెపి’ నుంచి టిడిపి విడిపోవడం, అప్పట్లో టిడిపి నేతలు ‘బిజెపి’పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం..దానిలో ‘గల్లా’ ప్రముఖ పాత్ర పోషించడంతో ఆయనకు తరువాత వ్యాపార పరంగా తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టింది. ‘ఆంధ్రా’కు ప్రత్యేకహోదా ఇవ్వలేదని ఆయన పార్లమెంట్‌లో ప్రధాని ‘మోడీ’ని నిలదీశారు. ‘మిస్టర్‌ ప్రధాని’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ‘గల్లా’కు ఈ విషయంలో మంచిపేరు వచ్చినా..తరువాత కాలంలో ఆయనకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఆయన సంస్థ అయిన ‘అమర్‌రాజా’పై ప్రత్యేకంగా కక్షకట్టి రాష్ట్రం నుంచి తరిమేసింది. ఎటువంటి  కారాణాలు లేకుండానే..ఆ సంస్థను వైకాపా ప్రభుత్వం వేధించి, నానా ఇబ్బందులకు గురి చేసింది. దీంతో రాజకీయంగా తాను చేసిన వ్యాఖ్యలు, టిడిపిలో క్రియాశీలకంగా పనిచేయడమే దీనికి కారణమని గుర్తించిన ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత నాలుగున్నరేళ్లలో ఆయన ‘అమరావతి’ రాజధాని విషయంలో తప్ప మిగతా ఏ సందర్భాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహిరంచలేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరని, ఇప్పటికే ఈ విషయాన్ని అధినేతకు చెప్పారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక ‘విజయవాడ’ పార్లమెంట్‌ సభ్యుడు ‘కేశినేని నాని’ది మరో కథ. ఆయన తమ్ముడితో ఆయనకు ఉన్న విభేదాలు, పార్టీ అధినేతపై ఆయనకు ఉన్న అసంతృప్తితో ఆయన పార్టీలో ఉన్నారో లేదో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తన తమ్ముడిని పార్టీ అధినేత ప్రోత్సహిస్తున్నారని, కృష్ణా జిల్లా టిడిపి పెత్తనం మొత్తం తనకు అప్పగించలేదన్న భావనతో ఆయన తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే..పనిచేసే వ్యక్తిగా, అభివృద్ది చేసిన నేతగా ఆయనకు ప్రజల్లో మంచిపేరే ఉంది. అయితే..ఆయన పార్టీ పట్ల, పార్టీ అధినేత పట్ల ఆయన చేసే వ్యాఖ్యలు వల్ల ఆయనకు టిక్కెట్‌ దక్కదేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలు మరో మూడు నెలలు మాత్రమే ఉన్న సమయంలో..ఆయనకు మళ్లీ టిక్కెట్‌ ఇస్తారా..లేక ఆయన తమ్ముడికి ఇస్తారా..అనే దానిపై కృష్ణా జిల్లా టిడిపిలో చర్చ జరుగుతోంది. మొత్తం మీద..కృష్ణా జిల్లా టిడిపిలో నెలకొన్న గందరగోళం ఇప్పట్లో తేలేలా లేదు. దీంతో..ఆయన మళ్లీ పోటీ చేస్తారా..అన్నది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దానా దీనా..గత ఎన్నికల్లో టిడిపి తరుపున గెలిచిన ముగ్గురు ఎంపిల్లో ఒక్క ‘రామ్మోహన్‌నాయుడు’ తప్ప మిగతా ఇద్దరి పోటీ మాత్రం సందేహమే. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..ఈ ఇద్దరు కూడా అధినేత సమాజికవర్గానికి చెందిన వారు కావడమే. మరో విశేషం ఏమిటంటే..ఖచ్చితంగా పోటీ చేసే..అభ్యర్థి బీసీ..కావడం.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ