57శాతం ఓట్లతో...160సీట్లు...!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన కూటమి 57శాతం ఓట్లతో 160సీట్లు సాధిస్తుందని వైకాపా రెబెల్ ఎమ్మెల్యే ‘కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి’ చెప్పారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా..టిడిపి, జనసేన కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌ను నిరసిస్తూ టిడిపి సీనియర్ నేత ‘సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి’ చేస్తోన్న దీక్షకు ఆయన మద్దతు పలికారు. అధికారం ఉందని ‘సోమిరెడ్డి’ని అరెస్టు చేశారని, రెండు నెలల్లో అధికారం తమ చేతుల్లోకి వస్తుందని, అప్పుడు ఇప్పుడు అక్రమంగా వ్యవహరించిన వారి సంగతి తేలుస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్‌పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు ఆయన మీద తీవ్ర ఏహ్యభావాన్ని వ్యక్తం చేస్తున్నారని, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆయన గమనించడం లేదని, ఎన్నికల్లో ప్రజల తీర్పు చారిత్రాత్మకం అవుతుందని ఆయన చెప్పారు.