లేటెస్ట్

‘ఎన్నాళ్లకెన్నాళ్లకు..ప్రత్యేకహోదా...!

2019 ఎన్నికలకు ముందు ‘ఆంధ్రా’లో ఏ రాజకీయనాయకుడి నోట విన్నా ప్రత్యేక హోదా మాటే వినబడేది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైకాపా అయితే ఈ విషయంపై చించుకునేది. తమకు 25కు 25 ఎంపీ సీట్లు ఇస్తే ‘ఆంధ్రా’కు ప్రత్యేక హోదా రాకుండా ఎట్లా ఉంటాదో చూస్తామని భీరాలు పలికేవారు. ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అయితే..25 తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలను గెలిపిస్తే, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా..ఈ చేత్తో..ప్రత్యేక హోదాపై సంతకం పెట్టించుకుని..మద్దతు ఇస్తామని హోరెత్తించేవారు. ఆయన మాటలను అప్పట్లో చాలా మంది నమ్మేవారు. నిజంగా ‘చంద్రబాబు’కు ప్రత్యేక హోదా తేవడం చాతకావడం లేదని, ఈయన అయితే..వెంటనే హోదా తెస్తారని, ఢల్లీికి మించి రాజధానిని నిర్మిస్తారని నమ్మేశారు. ఆయనే కాదు..అప్పట్లో వైకాపాలో ఉన్న ఆయన చెల్లెలు, ఇప్పటి కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ‘షర్మిల’ కూడా అదే రాగం వినిపించారు. ప్రత్యేక హోదా వస్తే..ఇన్‌కమ్‌ టాక్స్‌ కట్టాల్సిన అవసరం లేదని, తమ పార్టీని గెలిపించాలని వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రచారం చేశారు. ప్రత్యేకంగా యువతను లక్ష్యంగా పెట్టుకుని ఆయా విద్యాసంస్థలకు వెళ్లి ప్రత్యేక హోదా విషయంలో ‘చంద్రబాబు’ మోసం చేశారని, ఆయనను ఓడిరచి తనను గెలిపిస్తే తాను ప్రత్యేక హోదాను తెస్తానని ఆయన వారిని నమ్మించారు. ప్రత్యేకంగా ఒక టీమ్‌ను పెట్టించుకుని వారిచేత ప్రత్యేక హోదా గురించి ప్రశ్నలు వేయించి, వాటిని తన మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించుకున్నారు. నాడు ‘చంద్రబాబు’ అమాయకంగా చేసిన తప్పులను ఎత్తిచూపించి బాగానే ఓట్లు దండుకున్నారు. ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తరువాత..ఆయన మొదట్లోనే ప్రత్యేక హోదాపై మడమ తిప్పేశారు. మాట తప్పను..మడమ తిప్పను..అనే ఆయన..ప్రత్యేక హోదా విషయంలోనే కాదు..రాజధాని అమరావతి విషయంలో, తరువాత వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ, రైల్వేజోన్‌ విషయంలో కానీ..దేనీపై కూడా ఆయన కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై ఏనాడు ప్రశ్నించిన పాపాన పోలేదు. దాదాపు ఐదేళ్ల ఆయన పాలనలో ప్రత్యేక హోదా అనే విషయం కానీ, రాజధానికి నిధులు కావాలనే విషయంపై కానీ కేంద్రపెద్దలు ప్రశ్నించిన దాఖాలు లేవు. ఆయనే కాదు..ఎన్నికలకు ముందు ‘ఆంధ్రా’కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ధర్మపోరాటదీక్షలు చేసిన ‘చంద్రబాబు’ బృందం ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత దీనిపై నోరెత్తలేదు. ఎడాపెడా ఆయనపై కేసులు పెడుతూ వేధింపులకు గురిచేయడం ఒక కారణమైతే..తాము గతంలో దీనిపై చిత్తశుద్ధితో పోరాడినా ప్రజలు తమను ఆదరించలేదని, అది ప్రజలకు అవసరం లేని విషయమోమోన్న భావనతో టిడిపి దాన్ని వదిలేసింది. వారే కాదు..అప్పట్లో ప్రత్యేక హోదా కావాలని దీక్షలు చేసిన మరికొందరు కూడా తరువాత నోరెత్తలేదు. అయితే..ఇప్పుడు హఠాత్తుగా ‘ప్రత్యేకహోదా, రాజధాని, రైల్వేజోన్‌’లను ‘షర్మిల’ మళ్లీ వెలుగులోకి తెచ్చింది. చాలా రోజుల తరువాత ఆమె నోటి వెంటనే ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.  గత నాలుగున్నరేళ్ల నుంచి తాను తెలంగాణ ఆడబిడ్డనంటూ..తెలంగాణలో చాలా రోజులు హడావుడి చేసిన ఆమె ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ప్రత్యేక హోదా విషయంలో గత ప్రభుత్వాలు మోసం చేశాయని ఆరోపిస్తున్నారు. గతంలో ఈ విషయంలో టిడిపి విఫలమైనందున దాన్ని ప్రజలు శిక్షించారు. అయితే..తమను గెలిపిస్తే అరచేతిలో వైకుంఠం చూపిస్తామని హామీ ఇచ్చిన తన అన్నను నేరుగా అనకుండా...టిడిపి, వైకాపాను కలిపి ఆమె విమర్శిస్తున్నారు. ఈ విషయంలో ఆమె చిత్తశుద్దితో ఉంటే..గత ఎన్నికల్లో ప్రత్యేకహోదా, రాజధాని, రైల్వేజోన్‌ విషయంలో ఆమె కూడా ప్రచారం చేశారు కనుక..ఆ హామీలను తన అన్న నెరవేర్చలేదు కనుకు ముందుగా దానికి ఆమె క్షమాపణలు చెప్పి..తరువాత..అన్న నిర్వాకం గురించి ఆమె ఎండగట్టాలి. కానీ..ఆమె ఇద్దరినీ ఒకే గాటన గట్టి విమర్శలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా..చాన్నాళ్లు తరువాత..ప్రత్యేకహోదా విషయం ప్రస్తావనకు రావడం రాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సును ఆశించేవారికి నిజంగానే చెవులకు వినసొంపుగానే ఉంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ