ఓటమిని ముందే ఊహించి..‘రుణమాఫీ’ హామీని ‘జగన్’ ఇవ్వలేదా...!?
శనివారం నాడు వైకాపా అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన తరువాత..ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చాలా నిరుత్సాహానికి గురయ్యారు. వారు ఊహించిన అంశాలు దానిలో లేకపోవడమే దానికి ముఖ్యకారణం. ముఖ్యంగా..ఎన్నికల మేనిఫెస్టోలో..‘రుణమాఫీ’ ఉంటుందని ఆ పార్టీ అగ్రనాయకులు, సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ఆశించారు. గత ఐదేళ్ల ‘జగన్’ పాలన ప్రజలతో పాటు, ఆ పార్టీని నాయకులను కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది. గత ఎన్నికలకు ముందు ‘జగన్’ ఇచ్చిన హామీల్లో మెజార్టీ హామీలను నెరవేర్చకపోవడం, నిరాశాజనకమైన ‘జగన్’ పాలన వల్ల ఇక తమకు ఓటమి తప్పదని వారు భావించారు. అయితే..ఎన్నికలకు ముందు ‘జగన్’ ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్నో హామీలు ఇస్తారని, వాటిలో ఖచ్చితంగా రైతులకు ‘రుణమాఫీ’ ఉంటుందని, అది తమకు చాలా ప్రయోజనాన్ని కల్గిస్తుందని, ఈ ఎన్నికల్లో అదే తమను గట్టెక్కిస్తుందని మెజార్టీ అభ్యర్థులు నమ్మారు. దానికి గతంలో ‘వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి’ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని చేయడమే ప్రధాన కారణం.
వాస్తవానికి అప్పటి రుణమాఫీలో ‘రాజశేఖర్‌రెడ్డి’ ప్రమేయం ఏమీ లేకపోయినా..ఆయన ముఖ్యమంత్రిగా ఉండడంతో..ఆయనే రైతులకు ‘రుణమాఫీ’ చేశాడని, ఆయనకు భజనచేసేవారు..ప్రజల్లో ప్రచారం చేశారు. నిజానికి అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రి ‘సోనియాగాంధీ’ ఆ హామీని ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఆ హామీ వారు అధికారంలోకి వచ్చాక అమలు అయింది. అయితే ఎవరు ఏ మంచి చేసినా..అది తమ ఖాతాలో వేసుకోవడంలో ముందుండే ‘వై.ఎస్’ కుటుంబం..రుణమాఫీని ‘వై.ఎస్’ ఖాతాలో వేసి ఆయనకు భుజకీర్తులు తొడిగింది. దానితో అప్పట్లో ఆయనకు రుణమాఫీ చేసిన నాయకుడిగా రైతుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత కాలంలో ఆయన ప్రమాదంలో మరణించిన తరువాత..ఆయన కుమారుడు పార్టీ ఏర్పాటు చేసుకోవడం..2014 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అప్పట్లో ‘జగన్’ ఓటమికి ‘రుణమాఫీ’ హామీ ఇవ్వకపోవడమేనని, అది ఇచ్చుంటే..అధికారంలోకి వచ్చేవారని ‘జగన్’ మందిమాగాధులు ప్రచారం చేశారు. దానిలో ఎంత నిజం ఉందో కానీ...2014 ఎన్నికల్లో ‘జగన్’ ఓటమికి అదే కారణమనే కలర్ ఇచ్చారు. ఇప్పుడు కూడా..అదే పాట పాడడానికి తెరవెనుక రంగం సిద్ధం చేశారనే ప్రచారం సాగుతోంది.
‘జగన్’ ఐదేళ్ల పాలనను చూసిన రాష్ట్ర ప్రజలు ఇక జన్మలో మరోసారి ‘జగన్’కు అధికారంలో కూర్చోబెట్టకూడదనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఆయనెంతో చేస్తారని, తండ్రివలే వ్యవహరిస్తారని, తమ కులం, మతం వాడని, యువకుడని, ఒకసారి చూద్దామని గత ఎన్నికల్లో ఓట్లు వేసిన వారి ఆశలను ఆయన అడియాశలను చేశారు. రాష్ట్రాన్ని బీహార్ సరసన కూర్చండబెట్టారని, అవినీతిలో కూరుకుపోయారని, స్వంత మనుషులనే హత్యలు చేయిస్తారనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారు. ‘జగన్’ నిలువెత్తు బంగారం ఇచ్చినా..ఆయనకు మాత్రం ఓటు వేయకూడదని మెజార్టీ ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ఈ పరిస్థితుల్లో తానేం చేసినా తాను గెలవననే అభిప్రాయానికి వచ్చిన ‘జగన్’ మేనిఫెస్టోలో..రుణమాఫీని పెట్టలేదనే మాట స్వంత పార్టీ నుంచే వ్యక్తం అవుతోంది. వాస్తవానికి ‘రుణమాఫీ’ని ఇచ్చి ఉంటే..వైకాపా గెలుపు అవకాశాలు పెరిగుతాయని కొందరు వాదిస్తున్నారు. కానీ..ఆ హామీ కానీ, ఇంకే హామీలు కాని పనికావని ‘జగన్’ నిర్ణయానికి వచ్చిన తరువాతనే...ఇటువంటి నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. రాబోయే ఓటమికి కారణాలు వెతికే పనిలో భాగంగానే..‘రుణమాఫీ’ హామీ ఇవ్వలేదని స్వంత పార్టీ నాయకులతోపాటు, పరిశీలకులు భావిస్తున్నారు. ఏడాది క్రితమే ఆయన ఓటమి ఖాయమైందని ఆయనకు తెలుసునని, పైకి మాత్రం 175/175 అంటూ హాస్యాస్పదమైన, గంభీరమైన గొంతుతో ఆయన ప్రచారం చేస్తున్నారని, అసలేమిటో..ఆయనకు తెలుసనని వారు అంటున్నారు. వాస్తవానికి ఆయన గెలిచే అవకాశాలు ఉంటే..‘రుణమాఫీ’ ఏమిటి..అంతకన్నా పెద్దవైన హామీలనే ఆయన ఇచ్చేవారని, అయితే..వాటితో అయ్యే పని కాదు కనుక ఓటమికి కారణం చెప్పాలనే భావనతో ఇలా చేశారనే అభిప్రాయాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..ఇప్పుడు కనుక ‘జగన్’ రుణమాఫీ హామీని కనుక ఇచ్చి ఉంటే..ఆయన అధికారికంగా..ఓటమిని అంగీకరించారని ప్రతిపక్షాలు ఎగతాళి చేస్తారనే భయం కూడి ఉండిఉంటుంది. గతంలో తాము ఇచ్చిన హామీల్లో 99శాతం అమలు చేశామని, ఇంక చేయడానికి ఏమీ లేదని, ప్రజలందరూ తమవైపే ఉన్నారని ప్రచారం చేస్తోన్న ‘జగన్’ రుణమాఫీ హామీ ఇవ్వాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న కూడా వస్తుంది. కనుక..ఏమి చేసినా..తనకే ఇబ్బంది కనుక..ఓడిపోతే..రుణమాఫీ హామీ ఇవ్వలేదు కనుకు ఓడిపోయామని ప్రచారం చేసుకోవచ్చు..అదృష్టం కలిసివచ్చి గెలిస్తే..దాదాపు లక్ష కోట్ల అయ్యే రుణమాఫీ సొమ్మును యధేచ్ఛగా వాడేసుకోవచ్చు.