వైకాపా ఆఖరి యత్నాలు...!
టిడిపి,జనసేన పొత్తును విచ్ఛనం చేసేందుకు వైకాపా తన చివరి ప్రయత్నాలను యడతెరిపి లేకుండా చేస్తోంది. వారి పొత్తుతో తమ ఓటమి ఖాయం కనుక ఏదో విధంగా దాన్ని చెడగొట్టేందుకు, జనసేన, కాపు నాయకులను రెచ్చగొట్టేందుకు ఉన్న అవకాశాలన్నింటిని వాడుకుంటోంది. ఇప్పటికే..ఈ పొత్తును విచ్ఛనం చేసేందుకు ఎన్నో ఎత్తులు వేసి..ఎంతో ప్రచారం చేసినా...వారి యత్నాలు ఫలించకపోవడంతో, ఆఖరి అవకాశాన్ని వాడుకుంటోంది. ఆఖరి అవకాశం అంటే..టిడిపి, జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించే తరుణంలో ఆయా పార్టీల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలను బూతద్దంలో చూపించి..ఏదో విధంగా క్యాడర్ మధ్య చిచ్చు రాజేసేందుకు..యత్నిస్తోంది. అలాంటి ప్రయత్నమే..ఈరోజు వైకాపా చేసింది. రిపబ్లిక్‌డే..సందర్భంగా జనసేన అధినేత ‘పవన్ కళ్యాణ్’ చేసిన ప్రకటనను బూతద్దంలో చూపించి..వారి పొత్తు విచ్ఛనమైపోయిందనే ప్రచారాన్ని ఊదరగొడుతోంది. అసలు అక్కడ ‘పవన్’ తాము ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా టిడిపితో పొత్తుతోనే వెళతామని, కేవలం అసెంబ్లీ ఎన్నికలకే కాదు..రాబోయే ఐదేళ్లలో జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ తాము పొత్తులోనే ఉంటామని చెప్పినా..ఆయనేదో..రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కనుక..ఇక వారి పొత్తు విచ్ఛనం అయిపోయిందనే ప్రచారాన్ని తారాస్థాయిలో వైకాపా చేయించింది. ‘పవన్’ నోటి వెంట ‘టిడిపి’ తమను సంప్రదించకుండా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిందని, తాము కూడా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పిన వెంటనే..వైకాపాను సమర్థించే మెయిన్ మీడియా, సోషల్ మీడియా ఆగమేఘాలపై పొత్తు విచ్ఛనం అయిపోయిందనే ప్రచారాన్ని హోరెత్తిచింది. వైకాపాకు చెందిన పెయిడ్ మీడియా, కొంత మంది అమ్ముడిపోయిన జర్నలిస్టులు ఇంకేముంది..పొత్తు లేదూ..ఏమీ లేదు..మేము ముందు నుంచి చెప్పిందే జరుగుతుందని, సోషల్ మీడియా వేదికగా..చర్చోప చర్చలు ప్రారంభించారు. అసలేమీ లేని చోట..ఇటువంటి ప్రచారం చేయడం వెనుక వారి ఉద్దేశమేమిటో ఎవరికైనా అర్థం అవుతోంది. టిడిపి, జనసేన పొత్తును విచ్ఛనం చేసే ప్రయత్నాల్లో భాగంగానే..ఇది జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే..వైకాపా మీడియా, సోషల్ మీడియా రెచ్చగొడితే...రెచ్చిపోయే పరిస్థితుల్లో టిడిపి, జనసేన అగ్రనాయకత్వం లేదు. అయితే..పొత్తు అన్న తరువాత..అదీ భారీ స్థాయిలో జరిగే పొత్తులో ఎంతో కొంత అపార్ధాలు, అనుమానాలు, స్పర్థలు రావడం సహజం. సీట్ల విషయంలో ఇరుపార్టీల అగ్రనాయకులపై ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. అయితే..దీని వల్లే పొత్తు విచ్చనం అవుతుందా..అంటే లేదనే సమాధానం వస్తోంది. అయితే..వైకాపా చేస్తోన్న కుటిల యత్నాలను అడ్డుకోవడానికి, ఎటువంటి అపార్థాలు,అనుమానాలు లేకుండా చేయడానికి టిడిపి,జనసేన అగ్రనాయకత్వం మరింత క్రియాశీలకంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గెలిచే పార్టీలుగా ముద్రవేసుకున్న తరుణంలో..ఏదో విధంగా పొత్తును విచ్ఛనం చేసి..మళ్లీ రేసులోకి రావాలనే కుట్రలను వైకాపా..యధేచ్ఛగా చేస్తూనే ఉంటుంది. అటువంటి తరుణంలో టిడిపి, జనసేన అగ్రనాయకత్వం మరింత జాగ్రత్తగా సీట్ల పంపిణీ చేసుకుని ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా..పొత్తులపై వైకాపా ఉచ్చులో పడితే..2009లో జరిగిన ప్రహసనమే..మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. కనుకు ఇరుపార్టీలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి.