సాక్షిలో సగం నాదిః వై.ఎస్ షర్మిల
సాక్షి దినపత్రికలో తనకు సగం భాగముందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షరాలు వై.ఎస్.షర్మిల అన్నారు. సాక్షి దినపత్రికలో తన గురించి తప్పుడు కథనాలను రాయిస్తున్నారని అటువంటి వాటికి తాను భయపడనని, తాను వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కుమార్తెనని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆమె అన్నారు. సాక్షి దినపత్రికలో సగం వాటా తన తండ్రి ఇచ్చారని, దానిలో జగన్‌కు ఎంత భాగం ఉందో తనకూ అంతే ఉందని ఆమె చెప్పారు. తనపై దిగజారి విమర్శలు చేయిస్తున్నారని, రోజుకో జోకర్ మీడియా ముందుకు వచ్చి తనపై, తన భర్తపై అవాకులు చెవాకులు పేలుతున్నారని, వారి విమర్శలకు తాను భయపడి పారిపోనని ఆమె అన్నారు. తన భర్త సోనియా గాంధీని కలిసి తనను సిఎం చేయాలని కోరారని, దానికి మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్‌ముఖర్జీ సాక్ష్యమని ఒక జోకర్‌తో చెప్పించారని, తన భర్త సోనియా గాంధీని కలిసినప్పుడు ఆయనతో పాటు, తన వదిన భారతీరెడ్డి ఉన్నారని, ఒక వేళ తాము ముఖ్యమంత్రి పదవి అడిగి ఉంటే..భారతికి తెలిసి ఉండేది కదా..అని ఆమె ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తిని అడ్డుపెట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను పదవుల కోసం ప్రాకులాడడం లేదని, పదవే కావాలంటే తన తండ్రి బతికి ఉన్నప్పుడే తనకు పదవులు వచ్చేవని, తాను పదవుల కోసం పోరాడడం లేదని, ఆంధ్రప్రజల కోసం పోరాడుతున్నానని చెప్పారు. తాను పులివెందుల బిడ్డనని, రాజశేఖర్ రెడ్డి తనయనని, తాను ఎవరికీ భయపడనని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని, ఎవరేం చేసుకుంటారో చేసుకోవచ్చని ఆమె సవాల్ విసిరారు.