అమరావతి ఎన్నికల అంశం అవుతుందా...?
విభజిత ఆంధ్రప్రదేశ్ పదేళ్ల నాటి సమస్యలనే..ఎదుర్కొంటోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత..ఆంధ్రా అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటోంది. విభజన జరిగి పదేళ్లు అయినా..అప్పటి సమస్యలే..ఇంకా పట్టి పీడిస్తున్నాయి. విడుగొడుతూ..బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, బిజెపి రాష్ట్రంపై సవతి ప్రేమచూపడం, రాష్ట్రంలోని రాజకీయపార్టీలు రాష్ట్ర అభివృద్ధి కన్నా..ఎన్నికల్లో గెలవడానికి, గెలిచిన నాటి నుంచే ఓట్లు కొనుగోలు చేసే పథకాలను ముందుకు తేవడంతో..రాష్ట్రం ఇంకా విభజన కష్టాలనే ఎదుర్కొంటోంది. రాజధాని లేని రాష్ట్రంగా ప్రపంచం ముందు అపఖ్యాతి పాలవుతోంది. ఎవరిని కదిలించినా..ఆంధ్రా గురించి చులకనగానే మాట్లాడుతున్నారు. విభజన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితేనే రాష్ర్టాన్ని గాడిలో పెడతారని, రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళతారని, బిజెపి మద్దతులో రాష్ట్రం నిలబడుతుందని ఆశించిన ప్రజానీకం ఆయనకు పట్టం కట్టింది. అయితే..ఆయన మొదటి రెండేళ్లు పాలనపై దృష్టి సారించి, రాజధానిని పట్టించుకోకపోవడం, తరువాత శరవేగంగా రాజధాని నిర్మానికి పూనుకున్నా..అనుకున్న స్థాయిలో నిర్మాణాలు కొనసాగించలేకపోయారు. ఇదే అదనుతో..నాటి ప్రతిపక్షం ఆయనపై బురదజల్లేసింది. నాడు వైకాపా జల్లిన బురదనే..ఎక్కువమంది నమ్మారు. అందుకే..తరువాత జరిగిన ఎన్నికల్లో..రాజధాని ప్రాంతంలో కూడా టిడిపి గెలవలేకపోయింది. నాడు..తాను ముఖ్యమంత్రి అయితే...ఢిల్లీకి మించి రాజధానిని కడతానని, ఈ ప్రాంతంలోనే ఇళ్లు కట్టుకున్నానని, తనను నమ్మాలని నాటి ప్రతిపక్షనేత చెప్పడంతో ఆయనను నమ్మి ఆయన వెంట నడిచిన ప్రజలు తరువాత కాలంలో తాము ఘోరంగా మోసపోయామని తెలుసుకున్నారు.
ఈ పరిస్థితుల్లో మళ్లీ ఇప్పుడు ప్రజా తీర్పు కోరాల్సిన సమయం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే మూడు రాజధానులు చేస్తామని, అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తీసుకుపోతామని అధికార వైకాపా, ముఖ్యమంత్రి జగన్ స్పష్టంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధాని ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా,ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు దీనిపై ఎలా స్పందిస్తారో..అన్న సందేహాలను రాజకీయ పరిశీలకుల నుంచి వస్తున్నాయి. రాజధానిని మరుస్తున్నామన్న, రాజధాని రైతులు ఆమరణనిరాహారదీక్షలు చేస్తున్నా, ఇంకా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నా..సామాన్య ప్రజలు పెద్దగా స్పందించలేదు. అప్పట్లో అంటే..అధికారపార్టీ రౌడీయిజానికి భయపడి నోరు విప్పలేని వారు..రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో రాజధాని ఉండాలంటే ఓటుతో సరైన పార్టీలను గెలిపించాల్సి ఉంటుంది. మళ్లీ జగన్ గెలిస్తే..ఈ ప్రాంతంలో రాజధాని అనేది ఇక ఉండదు. రాష్ర్టానికి మూలనున్న విశాఖకు ప్రజలు పరుగులెత్తాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిల్లో రాజధాని ప్రాంత ప్రజలు తమ మధ్య ఉన్న రాజధానిని కాపాడుకోవడానికి ఏకం అవుతారా..? ఈ ప్రాంతంలో అమరావతి రాజకీయ అంశం అవుతుందా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు దీనిపై టిడిపి, జనసేనలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. విశాఖ రాజధాని అవుతుంటే..చంద్రబాబు, పవన్‌లు ఆపుతున్నారని వైకాపా నాయకులు, ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారు. మరి ఉన్న రాజధానిని జగన్ తరలిస్తుంటే..ఈ ప్రాంత ప్రజలు స్పందించరా..? ఉద్యమాలు చేయకపోయినా..ఓటు ద్వారా..అయినా..అమరావతికి పట్టం కట్టాలని, తద్వారా రాష్ట్ర శ్రేయస్సు, విచ్ఛిన్న రాజకీయాలకు చెక్ పెడతారని, రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వారు ఆశిస్తున్నారు.