గుంటూరు గెలుపు గుర్రాలు...!
ఒకేసారి దాదాపు వంద మంది టిడిపి అభ్యర్థులన ప్రకటించడం టిడిపిలో సంచలనం సృష్టిస్తోంది. టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు గతంలో ఇలా ఏ ఎన్నికల్లోనూ ఇంత మందిని ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించలేదు. 1999,2004,2009,2014,2019 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధులను చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే గతంలో ఎప్పుడూ ఆయన ఇంత మందిని నేరుగా ప్రకటించలేదు. నామినేషన్ వేయడానికి ఇంకో గంటమాత్రమే సమయం ఉన్నా..అప్పటికి కూడా అభ్యర్ధులను చంద్రబాబు కొన్నిసార్లు ఫైనల్ చేయలేదు. నానబెట్టి నానబెట్టి ఆఖరి నిమిషం దాకా..నాన్చి చివరికి ఆఖరి నిమిషంలో తేల్చేవారు. గత వ్యవహారశైలికి భిన్నంగా చంద్రబాబు ఈసారి ఒకేసారి ఇంత మంది అభ్యర్ధులను ప్రకటించడం విశేషం. కాగా..ఇప్పుడు టిడిపి, జనసేన ఉమ్మడిగా ప్రకటించిన లిస్టుపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఉన్నవారిలో మేలైన వారిని ప్రకటించారనే భావన అందరిలోనూ వ్యక్తం అవుతోంది. యువత, సీనియార్టీ, పార్టీకి విధేయత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ప్రకటించారు. కాగా..ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి, జనసేన ప్రకటించిన 12 సీట్లలో కూటమి దాదాపుగా 10 సీట్లను గెలుచుకునే పరిస్థితి ఉంది. అభ్యర్ధులను ప్రకటించిన స్థానాల్లో రెండు చోట్ల మాత్రమే..వైకాపాకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ముందుగా ప్రకటించిన వారిలో మంగళగిరి, పత్తిపాడు, తాడికొండ, పొన్నూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ, తెనాలి, రేపల్లె, వేమూరులో టిడిపి, జనసేన కూటమి అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించే పరిస్థితి ఉంది.
మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన నారా లోకేష్ ఈసారి మెజార్టీ రికార్డుతో విజయం సాధించబోతున్నారు. గత ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి మాత్రం ఆయనకు మంచి మెజార్టీ రాబోతోంది. అదే విధంగా తాడికొండ నుంచిపోటీ చేయబోతున్న మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ కూడా గెలవబోతున్నారు. ఆయన కూడా గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అదే విధంగా గత ఎన్నికల్లో అనుకోకుండా ఓడిపోయిన దూళిపాళ్ల నరేంద్రకుమార్ కూడా మంచి మెజార్టీతో గెలబోతున్నారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, వేమూరులో మరో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబులు కూడా గెలవబోతున్నారు. తెనాలిలో జనసేన అభ్యర్థి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా సులభంగా గెలవబోతున్నారు. రేపల్లెలో ప్రస్తుత ఎమ్మెల్యే అనగాని మరోసారి గెలవబోతున్నారు. ఇక వినుకొండ నియోజకవర్గంలో హోరాహోరు పోరు ఉన్నా..మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు ఇక్కడ గెలవబోతున్నారు. గత ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో గెలిచిన బొల్లా బ్రహ్మనాయుడుకు గతంలో వలే పరిస్థితి లేదు. ఆర్థికంగా బలవంతుడైన బొల్లాకు జివి గట్టిపోటీ ఇస్తున్నారు. అయితే..గత ఎన్నికల్లో జివికి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులన్నీ ఇప్పుడు ఆయన వైపుకు వస్తున్నాయి. టిడిపి, జనసేన, బిజెపిలు ఈసారి జివీ వైపు ఉండబోతున్నాయి. అదే సమయంలో వినుకొండ పట్టణంలో బలం ఉన్న సిపీఐ, సిపిఎం వంటి పార్టీలు కూడా పరోక్షంగా జీవీకి సహకరించవచ్చు. దీంతో..గట్టి పోటీ ఉన్నా ఆంజనేయులు ఈస్థానంలో మరోసారి గెలవబోతున్నారు. ఇక వైకాపాకు గట్టి పట్టున్న మాచర్ల, బాపట్లలో..టిడిపి గట్టిగానే పోరాడుతోంది. అయితే పైన చెప్పుకున్న స్థానాలవలే టిడిపి ఇక్కడ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. మాచర్ల ఎమ్మెల్యే కండబలం, ఆర్థిక బలం ముందు టిడిపి అభ్యర్థి దిగదుడుపే. అయితే..టిడిపి అభ్యర్ధి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఎటువంటి అరాచకాలు జరగకపోతే..ఇక్కడ కూడా టిడిపి గెలపు సాధ్యమే. ఇక బాపట్లలో..వైకాపా అభ్యర్థికే అవకాశాలు ఉన్నాయి. అయితే..ఎన్నికలకు మరో రెండు నెలలు సమయం ఉండడం...టిడిపి, జనసేన కూటమికి గాలి వీస్తే..ఇక్కడ కూడా టిడిపి గెలవవచ్చు. మొత్తం మీద..ప్రకటించిన 12చోట్లలో 10 స్థానాల్లో టిడిపి కూటమి గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.