డ్రాపవుట్ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి:కలెక్టర్ కృతిక శుక్లా
పల్నాడు జిల్లా : పల్నాడుజిల్లా వ్యాప్తంగా బడి మానేసిన (డ్రాపవుట్స్) విద్యార్థులను గుర్తించి, వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ కృతిక శుక్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,000 మంది డ్రాపవుట్స్ విద్యార్థులు ఉన్నట్లు గణాంకాలు ఉన్నాయని, వారందరినీ గుర్తించి వారం రోజుల్లో పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో జరుగుతున్న పదవ తరగతి "రెమిడీయల్ శిక్షణ తరగతులను" బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృత్తిక శుక్లా పట్టణంలో
గుర్తించిన 26 మంది డ్రాపవుట్ విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించారు. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తుందని తెలియజేసారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పౌష్టిక ఆహారం సైతం అందిస్తుందన్నారు. 10 వ తరగతి తప్పిన వారంతా సప్లిమెంటరీలో ఉత్తీర్ణులవ్వాలని కోరారు. అదే విధంగా పదవ తరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులందరూ తప్పనిసరిగా సప్లిమెంటరీ శిక్షణ తరగతులకు హాజరవ్వాలని, వారంతా 100%
ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పరీక్షలకు ఉపయోగపడే ప్రత్యేక స్టడీ మెటీరియల్ను కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు. ఫెయిల్ అయిన 238 మంది విద్యార్థులను ఆయా పాఠశాలల్లో ఎన్రోల్ చేయించి, వారికి 20 రోజుల పాటు నాణ్యమైన శిక్షణ అందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, ఎం.ఈ.ఓలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.