ఒకే ఈతలో కవలదూడలకు జన్మనిచ్చిన ఒంగోలు జాతి ఆవు
కారంపూడి, పలనాడు జిల్లా :- కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామానికి చెందిన పాడి రైతు కూరాకుల శివ భాస్కరరావు ఇంట మంగళవారం ఈ అరుదైన సంఘటన జరిగిందని కారంపూడి పశు వైద్యాధికారి దిలీప్ కుమార్ తెలియజేశారు. శివ భాస్కరరావు 10 కి పైగా ఆవులను పెంచుతున్నాడని, ఆవు పాల ద్వారా ఆర్ధికంగా లబ్ది పొందుతున్నాడని చెప్పారు. ముఖ్యంగా కవలదూడలకు జన్మనిచ్చిన ఈ ఆవును కసాయి మండికి తరలిస్తున్న తరుణంలో ఆవును చూసి చలించిపోయిన శివ భాస్కర్ రావు ఆవును కొనుగోలు చేసి, ఆవుకి కారంపూడి పశు వైద్యశాలకు సంబంధించిన అధికారులతో వైద్యం చేయించి, పూర్తి
ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దిన తర్వాత ఆవు మంగళవారం కవలదూడలకు జన్మనిచ్చిందని వైద్యాధికారి దిలీప్ తెలియజేశారు. ఒంగోలు జాతి పశు సంపద అంతరించిపోతున్న ఈ తరుణంలో, కసాయి మండికి పోతున్న ఆవును కాపాడి ఒంగోలు పశుసంపదను పెంపొందించే విధంగా కృషి చేస్తున్న శివ భాస్కరరావును ఒప్పిచర్ల గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశు సంపదను మరియు స్వదేశీయ జాతి పశువు సంపదను పెంపొందించే విధంగా, ప్రభుత్వం రైతులకు అన్ని సహకారాలను అందిస్తుందని డాక్టర్ దిలీప్ చెప్పారు. సహజంగా ఆవులు ఈత సమయంలో ఒక్క దూడకు మాత్రమే జన్మనిస్తాయని, ప్రస్తుతం కోతకు వెళ్లబోయే ఆవుని పరిరక్షించినందుకు
ఆ యజమానికి ఆవు కవలదూడలను బహుమతిగా అందించిందని వైద్యాధికారి తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రైతు శివ భాస్కర్ రావు మాట్లాడుతూ తన ఆవుల సంపదను ఎప్పటికప్పుడు పశు వైద్య సిబ్బంది గ్రామంలో ఉండి పరీక్షలు నిర్వహించి తగిన సమయంలో తగిన విధంగా వైద్యం అందించడం వలన, ఈరోజు నేను పశు సంపదలో ముఖ్యమైన ఒంగోలు జాతి ఆవులను పరిరక్షిస్తూ ఆవు పాల రైతుగా ఉన్నానని అన్నారు. పాడి ఆవులకు వైద్యం అందించే కార్యక్రమంలో గ్రామ పశు వైద్య సిబ్బంది తస్లీమా, కౌసర్, గోపాల్ మిత్ర ప్రసాద్, కారంపూడి పశు వైద్యశాల సిబ్బంది బ్రహ్మం ఉన్నారు.