బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ గోల్డ్ లోన్ మోసం

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

రూ.10 కోట్ల విలువైన 6.449 కిలోల బంగారం మాయం

176 గోల్డ్ లోన్ ఖాతాల్లో భారీ అవకతవకలు

గోల్డ్ అప్రైజర్ అరెస్ట్.. రూ.5.81 కోట్ల సొత్తు స్వాధీనం

కేసును ఛేదించిన ఏలూరు జిల్లా పోలీసులు

జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో భారీ గోల్డ్ లోన్ మోసం వెలుగుచూసింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు రూ.10 కోట్ల విలువైన 6.449 కిలోల బంగారు ఆభరణాలను అక్రమంగా అపహరించి, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు, ఇతర వస్తువులను ఉంచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బ్యాంకు గోల్డ్ అప్రైజర్ చలపాక రాజు (40)ను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ పర్యవేక్షణలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్., ఐపీఎస్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు ఈ భారీ ఆర్థిక మోసం, నమ్మకద్రోహం కేసును ఛేదించారు.

బ్యాంకు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 198/2026 కింద బీఎన్ఎస్ సెక్షన్లు 318(4), 316(5), 336(3), 305(5) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

176 ఖాతాల్లో అవకతవకలు

పోలీసుల విచారణలో బ్యాంకుకు చెందిన 176 గోల్డ్ లోన్ ఖాతాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. జంగారెడ్డిగూడెం వలమపేటకు చెందిన చలపాక రాజు బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. ఖాతాదారులు రుణాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను నిందితుడు అక్రమంగా అపహరించి, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు, ఇతర వస్తువులను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ విధంగా మొత్తం 6.449 కిలోల బంగారం మాయమైనట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. దీని విలువ సుమారు రూ.10 కోట్లుగా అంచనా వేశారు.

జ్యువెలరీ షాపుల్లో విక్రయం

అపహరించిన బంగారాన్ని నిందితుడు జంగారెడ్డిగూడెంలోని వివిధ జ్యువెలరీ దుకాణాల్లో తన పేరుతో పాటు తన తల్లిదండ్రుల పేర్లపై విక్రయించడం, తాకట్టు పెట్టడం చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం నిందితుడి కదలికలు, బంగారం లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరించింది.

రూ.5.81 కోట్ల సొత్తు రికవరీ

దర్యాప్తులో భాగంగా నిందితుడి వద్ద నుంచి రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వివిధ జ్యువెలరీ దుకాణాల నుంచి 4.120 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం మొత్తం విలువ సుమారు రూ.5,81,65,000గా అంచనా వేసినట్లు పోలీసులు తెలిపారు.

మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు నిందితుడిని పోలీసు కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ మోసం వెనుక మరెవరైనా వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలితే వారిపైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ స్పష్టం చేశారు.

పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు

ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్., ఐపీఎస్, దర్యాప్తు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

కేసు దర్యాప్తులో ఏఎస్పీ సుస్మిత ఆర్., సీఐ ఎం.వి. సుభాష్, ఎస్‌ఐలు ఎన్. వీర ప్రసాద్, ఎం. కుటుంబరావు, ఎస్‌కే జబీర్, ఎస్. వల్లీ పద్మతో పాటు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో కూడిన మొత్తం 20 మంది పోలీసు బృందం కీలకంగా వ్యవహరించింది.