సీఎంఓలో మార్పులు- సీఎంఓలోకి చిత్తూరు కలెక్టర్...!?

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయం (సీఎంఓ)లో కీలక మార్పులు జరగబోతున్నట్లు సచివాలయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు అనుకూలమైన అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో ముద్దాడ రవిచంద్రను స్వయంగా ఎంపిక చేసి సీఎంఓ ఇన్‌చార్జిగా నియమించారు. రవిచంద్రతో పాటు రాజమౌళి, కార్తికేయ మిశ్రా, ప్రద్యుమ్న తదితర అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.

అయితే, రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి తన కార్యాలయంలో చేసిన ప్రధాన మార్పు ముద్దాడ రవిచంద్రను సీఎంఓ నుంచి తప్పించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించడం. అధికార వర్గాల్లో రవిచంద్రకు నిజాయితీపరుడు, పనిమంతుడు అనే పేరుంది. అయినప్పటికీ, ఆయనపై ఓ పత్రికలో వచ్చిన ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆయనను టీటీడీకి బదిలీ చేసినట్లు అప్పట్లో చర్చ జరిగింది. అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌ను సీఎంఓ ఇన్‌చార్జిగా నియమించారు.

అయితే, ఇటీవల విజయానంద్ అనారోగ్యానికి గురికావడంతో ప్రస్తుతం సీఎంఓలో పూర్తి స్థాయి ఇన్‌చార్జి లేరనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కొత్త నియామకం చేపట్టనున్నారనే వార్తలు సచివాలయం, మీడియా వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం ప్రకారం ప్రస్తుతం చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సుమిత్ కుమార్‌ను సీఎంఓలో కీలక బాధ్యతలకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం, సుమిత్ కుమార్‌ను సీఎంఓలో నియమించడం దాదాపు ఖరారైందని, నేడో లేదా రేపో దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) వెలువడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వంత జిల్లాగా భావించే చిత్తూరులో కలెక్టర్‌గా సుమిత్ కుమార్ పనితీరు తనను ఆకట్టుకుందని, అందుకే ఆయనకు సీఎంఓలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని కొందరు అధికార వర్గాలు చెబుతున్నాయి.

అయితే, మరోవైపు సీఎంఓ రేసులో సుమిత్ కుమార్ ఒక్కరే లేరని, మరో రెండు లేదా మూడు జిల్లాల కలెక్టర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం సీఎంఓలో పనిచేస్తున్న ఒక అధికారిని తప్పిస్తేనే కొత్త అధికారికి అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న అధికారిని తొలగించే అవకాశాలు లేవని, ఆయన కొనసాగుతారని, అలాంటి పరిస్థితుల్లో కొత్త అధికారికి అవకాశం ఉంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఇటీవల పదవీ విరమణ చేసిన కొందరు ఐఏఎస్ అధికారుల స్థానాల్లో ఇప్పటివరకు కొత్త నియామకాలు చేపట్టలేదు. ఆ శాఖలకు పూర్తి స్థాయి అధికారులను నియమించకపోవడమే కాకుండా, తాత్కాలిక ఇన్‌చార్జిలను కూడా నియమించకపోవడం సచివాలయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. బాధ్యతలు ఖాళీగా ఉన్న శాఖలకు తాత్కాలికంగా అయినా అధికారులను నియమించవచ్చుకదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే, త్వరలోనే పరిపాలనా వ్యవస్థలో భారీ ప్రక్షాళన చేపట్టనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అదే కారణంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న కీలక పోస్టులను భర్తీ చేయడం లేదని, ఒకేసారి విస్తృత స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, బాధ్యతల పునర్విభజన చేపట్టే అవకాశముందని అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి.

మొత్తం మీద ముఖ్యమంత్రి కార్యాలయంలో మార్పులతో పాటు ఐఏఎస్ అధికారుల బదిలీలు ఎప్పుడు జరుగుతాయన్న అంశంపై సచివాలయం, రాజకీయ వర్గాలు, మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ మార్పులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సీఎంఓలోకి వస్తారా? లేక మరో అధికారికి అవకాశం దక్కుతుందా? భారీ స్థాయిలో పరిపాలనా ప్రక్షాళన ఎప్పుడు చేపడతారు? అనే ప్రశ్నలకు అధికారిక నిర్ణయం వెలువడే వరకు వేచి చూడాల్సిందే.