నేరాల కట్టడిలో బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్‌కు సీఎం ప్రశంసలు
బాపట్ల, ఆగస్టు 8: బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేర నియంత్రణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, మాదకద్రవ్యాలు, సైబర్, వైట్‌కాలర్ నేరాలు, రౌడీషీటర్ల కార్యకలాపాలు, పేకాట, నాటు సారా, దొంగతనాలపై కఠిన చర్యలు చేపడుతున్నారు.మారుమూల ప్రాంతాల్లోనూ డ్రోన్లతో నిఘా ఏర్పాటు
చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికడుతున్నారు. పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు, ప్రతి నెలా క్రైమ్ సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.రౌడీషీటర్లలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు పోలీసు సిబ్బంది తప్పిదాలను సరిదిద్దుకునేలా ప్రోత్సహిస్తున్న తీరు సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపుతోంది.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్ ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల కొత్తపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్పీ ఉమామహేశ్వర్‌ను అభినందించడం జిల్లా పోలీసు శాఖలో మరింత ఉత్సాహాన్ని నింపింది.