జగన్ 'మావిగన్' ప్లాన్ వెనుక అసలు లెక్క ఇదేనా?

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగ‌న్‌ను స‌మ‌ర్థించేవారు వైకాపాకు ఓటు వేస్తార‌ని, అమ‌రావ‌తిని స‌మ‌ర్థించే వారు టిడిపికి ఓటు వేస్తార‌ని, రాజ‌ధాని విష‌యం అప్పుడు తేలిపోతుంద‌ని వైకాపా అధినేత వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రాజ‌ధాని విష‌యంపై కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. దీంతో రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండ‌డం ఆయ‌న‌కు ఇష్టం లేద‌ని, తాను మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే..అమ‌రావ‌తి ఉండ‌బోద‌ని స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో మూడు ఏళ్లు స‌మ‌యం ఉండ‌గానే..ఆయ‌న రాజ‌ధాని విష‌యంలో ఇంత స్ప‌ష్ట‌త ఇవ్వడం, మావిగ‌న్‌ను ఆషామాషీగా తీసుకోవ‌డం లేద‌నే సంగ‌తిని తేల్చి చెప్ప‌డంపై అటు స్వంత పార్టీ నాయ‌కుల‌తో పాటు, రాజ‌కీయ ప‌రిశీల‌కులు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మ‌రోవైపు టిడిపి కూట‌మి నాయ‌కులు రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ మ‌రోసారి బోల్తా కొట్టార‌ని, ఆయ‌న సెల్ఫ్ గోల్ వేసుకున్నార‌ని సంబ‌రాలు చేసుకుంటున్నారు. జ‌గ‌న్ తెలివిత‌క్కువ వాడ‌ని, ఆయ‌న రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఘోరాతి ఘోర‌మైన త‌ప్పులు చేస్తున్నార‌ని, మూర్ఖ‌పు నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌నే అభిప్రాయం సాధార‌ణ ప్ర‌జ‌ల్లో కూడా వ్య‌క్తం అవుతోంది. అస‌లు రాజ‌ధాని వ్య‌వ‌హారంలో ఆయ‌న మొద‌టి నుంచి త‌ప్పులు చేస్తున్నార‌ని, ఇప్పుడు మ‌రో త‌ప్పు చేశార‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఢిల్లీకి మించిన, లండ‌న్ న‌గ‌రం వంటి రాజ‌ధాని కావాల‌ని, దాని కోసం త‌న వ‌ద్ద బ్లూ ప్రింట్ ఉంద‌ని జ‌గ‌న్ చెప్పారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో అమ‌రావ‌తిలోనే తాను ఇంటిని నిర్మించుకున్నాన‌ని, తాను రాజ‌ధాని అమ‌రావ‌తికి వ్య‌తిరేకం కాద‌ని చెప్పుకున్నారు. అయితే..2019 ఎన్నిక‌ల్లో గెలిచిన  త‌రువాత మూడు రాజ‌ధానులంటూ..మూడు ముక్క‌లాట‌కు తెర‌తీశారు. అయితే..2024 ఎన్నిక‌ల్లో రాజ‌ధాని విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరుతో పాటు, ప‌లు అంశాల్లో ఆయ‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న వ్య‌తిరేక‌త‌తో ఘోర‌మైన ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. అయితే..ఇంతటి ప‌రాజ‌యం త‌రువాత ఆయ‌న రాజ‌ధాని విష‌యంలో వెన‌క్కు త‌గ్గుతార‌ని,మంచో చెడో ఇక అమ‌రావ‌తి గురించి

మాట్లాడ‌ర‌ని, చేసిన త‌ప్పును దిద్దుకుంటార‌ని కొంత మంది ప్ర‌జ‌ల‌తోపాటు, రాజ‌కీయ ప‌రిశీల‌కులు, రాజ‌కీయ నాయ‌కులు ఆశించారు. అయితే..జ‌గ‌న్‌మాత్రం త‌న తీరు మార్చుకోలేదు. గ‌తానికి భిన్నంగా ఈసారి గుంటూరు, విజ‌య‌వాడ‌, మ‌చిలీప‌ట్నం..ప‌ట్ట‌ణాల‌ను క‌లుపుతూ మావిగ‌న్‌ను రాజ‌ధానిగా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇది సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌ను ట్రోల్ చేయ‌డానికి, ఎద్దేవా చేయ‌డానికి కార‌ణ‌మైంది. అయితే..ఎంత ట్రోల్ అయినా, ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా..ఆయ‌న మాత్రం మ‌ళ్లీ మావిగ‌న్ పాటే పాడుతున్నారు. ఆయ‌న ఎందుకు ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారే దానిపై స్వంత పార్టీలోనూ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న ఒక వ్యూహం ప్ర‌కార‌మే ముందుకు వెళుతున్నార‌ని, అస‌లు రాజ‌ధాని విష‌యం ఎన్నిక‌ల అంశం కాద‌ని, అందుకే ఆయ‌న రోజుకో మాట మాట్లాడుతున్నార‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప‌రాజ‌యం పాల‌వ‌డానికి కేవ‌లం రాజ‌ధాని అమ‌రావ‌తి ఒక్క‌టే కార‌ణ‌మా..? అంటే..కానే కాదు. ప‌రిపాల‌నా ప‌ర‌మైన లోపాలు, వ్య‌క్తిత్వ లోపాలు, అవినీతి, అరాచ‌కం, ప్ర‌శ్నించిన వారిపై కేసులు, క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు, తానేదో..రాజును అన్న‌ట్లు..ప్ర‌జ‌ల‌కు భిక్షం వేస్తున్న‌ట్లు ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరే..ఆయ‌న ఘోర ప‌రాజ‌యానికి ప్ర‌ధాన కార‌ణం. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కూడా బ‌ల‌ప‌రిచారు. తానేదో ద‌య‌త‌ల‌చి ఇస్తున్నాన‌ని, ప్ర‌జ‌లంతా త‌న‌కు రుణ‌ప‌డి ఉండాల‌నే భావ‌న ఆయ‌న‌లో ఉంద‌ని, తాను ఇచ్చే సొమ్ముల‌కు ఆనంద‌ప‌డి త‌న‌ను ప్ర‌జ‌లు మ‌ళ్లీ గెలిపిస్తార‌ని ఆయ‌న భావించారు. అయితే... అది బెడిసికొట్టింది. అయితే ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయినా..ఆయ‌న‌కు దాదాపు 40శాతం ఓటింగ్ వ‌చ్చింది. అన్ని అరాచ‌కాలు చేసినా, అవినీతి చేసినా, మ‌ద్యం కుంభ‌కోణాల‌కు పాల్ప‌డినా..చంద్ర‌బాబును జైలులో పెట్టినా..చివ‌ర‌కు 80ఏళ్ల రంగ‌నాయ‌క‌మ్మ అనే వృద్ధురాలిని జైలులో పెట్టినా, విశాఖ‌లో డాక్ట‌ర్‌ను హింసించి చంపినా, చివ‌ర‌కు స్వంత పార్టీ ఎంపిని చిత‌క‌బాదించినా..2024 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓటు శాత‌మేమీ త‌గ్గ‌లేదు. ఎన్ని అరాచ‌కాలు చేసినా, రాజ‌ధాని

లేక‌పోయినా..రోడ్లు లేక‌పోయినా, ఉద్యోగాలు, ఉపాధి లేక‌పోయినా..ఆయ‌న‌ను స‌మ‌ర్థించే ప్ర‌జ‌లు ఈ రాష్ట్రంలో ఇంకా 40శాతం మంది ఉండేనే ఉన్నారు. వారికి రాజ‌ధాని కానీ, ఉద్యోగాలు, ఉపాధి, రోడ్లు, శాంతిభ‌ద్ర‌త‌లు ఇవేవీ అవ‌స‌రం లేదు. వారికి కావాల్సింది త‌మ‌కు నెల నెలా ఎంత ఇస్తున్నార‌నేదే ప్ర‌ధానం. ఆ పార్టీ కాదు..ఈ పార్టీ కాదు..ఏ పార్టీ త‌మ‌కు ఎంత ఇస్తున్న‌ద‌న్న‌దే ప్ర‌ధానం. సొమ్ములు త‌రువాత కులం, మ‌తం, ప్రాంతం..ఇవే ముఖ్యం. ఇప్పుడు జ‌గ‌న్ బ‌లం ఇదే. మూడు రాజ‌ధానులు కాదు..ముప్ప‌యి రాజ‌ధానులు పెట్టుకున్నా..కొంత మంది ప్ర‌జ‌ల‌కు అది అంత ప్ర‌ధాన‌మైన విష‌యం కాదు. త‌మ వాడు అధికారంలో ఉన్నాడా..లేడా..అనేదే వారికి ప్ర‌ధాన‌మైన విష‌యం. అత‌ను అభివృద్ది చేస్తాడా..చేయ‌డా..అనేది అప్ర‌ధానం. కేవ‌లం కులం, మతం, ప్రాంతం వారీగా విడిపోయిన ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు రాజ‌ధాని అనేది అవ‌స‌రం లేని విష‌యంగా క‌నిపిస్తోంది. దీన్ని జ‌గ‌న్ గ్ర‌హించే..రాజ‌ధాని విష‌యంలో రోజుకో మాట మాట్లాడుతున్నారు. అందుకే ఆయ‌న‌కు అది ప్ర‌ధాన‌మైన విష‌యం కాదు. రాజ‌ధాని విష‌యంలో ప‌దే ప‌దే మాట మార్చ‌డం..వెనుక అస‌లు మ‌త‌ల‌బు ఇదే. ఇప్ప‌టికే 40శాతం ఖ‌చ్చిత‌మైన ఓటు బ్యాంక్ త‌న జేబులో ఉంది..ఇక కూట‌మి ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌, అవినీతి త‌దిత‌ర అంశాల‌తో..త‌న ఓటు బ్యాంక్ మ‌రో 5శాతమో..6శాత‌మో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఖ‌చ్చితంగా పెరుగుతుంద‌నే దాంతో..విజ‌యం త‌న‌దే అన్న భావ‌నతోనే ఆయ‌న రాజ‌ధానిపై ఆట‌లు ఆడుతున్నారు. అంతే కాకుండా మ‌రో మూడేళ్ల‌లో ప్రాంతీయ‌, కుల, మ‌త ద్వేషాల‌ను ర‌గిలిస్తే..ఇక త‌న‌కు తిరుగుండ‌ద‌ని, ఈ మూడు విష‌యాల‌కు ఆంధ్ర‌ప్ర‌జ‌లు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తారు క‌నుక త‌న‌దే విజ‌య‌మ‌ని, రాజ‌ధాని విష‌యం గురించి అంత వర్రీ అవాల్సిన అవ‌స‌రం లేద‌నేది ఆయ‌న వ్యూహం. అందుకే ఆయ‌న ప్రెస్‌మీట్ పెట్టిన‌ప్పుడ‌ల్లా మావిగ‌న్ అని చంద్ర‌బాబు చెవిలో అంటే..ఆయ‌న హ‌రీమంటార‌ని ఎక‌స‌క్కాలు ఆడుతుంటారు.