లేటెస్ట్

పెద్ద‌గా స‌ల‌హాదార్లు ఉండ‌రు...!

గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఎక్క‌డ చూసినా క‌నిపించే స‌ల‌హాదార్ల‌కు నూత‌న ఎన్‌డిఏ ప్ర‌భుత్వం మంగ‌ళం పాడే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే దీనిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఒక నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అత్య‌వ‌స‌ర‌మైన శాఖ‌ల‌కు త‌ప్ప మ‌రే విధ‌మైన స‌ల‌హాదారుల‌ను నియ‌మించ‌కూడ‌ద‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ని, స‌ల‌హాదారుల వ‌ల్ల ఒరిగేదేమీ లేద‌నేది ఆయ‌న అభిప్రాయంగా చెబుతున్నారు. వారి వ‌ల్ల మేలు కంటే కీడే ఎక్కువ జ‌రుగుతుంద‌ని, ప్ర‌జాధ‌నాన్ని స‌ల‌హాదారుల‌పేరుతో పంచ‌డానికి ఆయ‌న సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి టిడిపి అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి స‌ల‌హాదాల‌రుల‌ను తీసుకుంటార‌ని, కొంత మంది బ‌యోడేటాల‌ను రెడీ చేసుకుని చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇటువంటి వారికి వారి వ‌ద్ద నుంచి సానుకూల సంకేతాలు రావ‌డం లేదంటున్నారు. పెద్ద‌గా స‌ల‌హాదారుల‌ను పెట్టుకోకూడ‌ద‌ని, ముఖ్య‌మైన‌శాఖ‌లైన నీటిపారుద‌ల‌, ఐటి,మున్సిప‌ల్ వంటి శాఖ‌ల‌కే స‌ల‌హాదారులు ఉంటార‌ని తెలుస్తోంది. ఈ శాఖ‌ల‌కు నియ‌మించే స‌లహాదారులు ఆయా శాఖ‌ల్లో అత్యున్న‌త అనుభవం ఉన్న‌వారు అయితేనే నియ‌మిస్తార‌ని అధికార‌వ‌ర్గాలుచెబుతున్నాయి.


గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో లెక్క‌కు మించి స‌ల‌హాదారులు ఉన్నారు. ఎవెరెవ‌రో స‌ల‌హాదారుల రూపంలో ప్ర‌జ‌ల సొమ్మును తినేశార‌నే ఆరోప‌ణలు ఉన్నాయి. ఈ స‌ల‌హాదారుల‌పై రాష్ట్ర హైకోర్టు కూడా అభ్యంత‌రం చెప్పింది. వాళ్లు ఇచ్చిన స‌ల‌హాలు ఏమిటో..? అన్న వ్యాఖ్య‌లు కూడా చేసింది. అప్ప‌టి ప్ర‌భుత్వంలో ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌రామ‌కృష్ణారెడ్డితోమొద‌లు పెడితే..దాదాపు వంద మంది వ‌ర‌కూ స‌ల‌హాదారులు ఉన్నారు. వీరెవ‌రూ అప్ప‌టి ప్ర‌భుత్వానికి ఎటువంటి స‌ల‌హా ఇచ్చిన పాపాన‌పోలేదు. ఒక‌వేళ వారిలో ఒక‌రో ఇద్ద‌రో..త‌మ శాఖ‌కు సంబంధించిన స‌ల‌హా ముఖ్య‌మంత్రికి ఇస్తే ఆయ‌న ప‌ట్టించుకున్న పాపాన‌పోలేదు. అప్ప‌ట్లో ఒక శాఖ‌కు స‌ల‌హాదారుగా ఉన్న ప్ర‌ముఖ ఎడిట‌ర్ శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి త‌న‌కు ఎటువంటి ప‌నిలేద‌ని, త‌న‌కు స‌ల‌హాదారు ప‌ద‌వి అవ‌స‌రం లేద‌ని రాజీనామా చేశారు. ప‌ని చేయ‌కుండా ప్ర‌జ‌ల సొమ్ములు తీసుకోవ‌డం ఎందుక‌నే భావ‌న‌తో ఇలా చేశారంటారు. అయితే..జ‌గ‌న్ నియ‌మించిన వారిలో చాలా మంది ఎటువంటి ప‌నిచేయ‌కుండా, ప్ర‌జ‌ల‌కు ఎటువంటి మేలు చేయ‌కుండానే కోట్లాది రూపాయ‌ల‌ను జేబులో వేసుకున్నారు. కొంద‌రైతే జాతీయ స‌ల‌హాదారు, అంత‌ర్జాతీయ స‌ల‌హాదారు పేరిట కూడా జీతాలు మేసేశారు. ఎక్క‌డా లేని స‌ల‌హాదారు ప‌ద‌వులు సృష్టించి మ‌రీ ప్ర‌జ‌ల సొమ్మును జ‌గ‌న్ వారికి దోచిపెట్టారు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన కొంద‌రు ఐఏఎస్ అధికారుల‌ను సైతం స‌ల‌హాదారులుగా జ‌గ‌న్ నియ‌మించుకున్నారు. వారిని ప్ర‌లోభ‌పెట్టేందుకే, వారిచేత అడ్డ‌మైన‌ప‌నులు చేయించేందుకే ఈ ప‌ద‌వుల‌ను ఆయ‌న వాడుకున్నారు. ఈ స‌ల‌హాదారుల వ్య‌వ‌హారం ఎన్నిక‌ల్లో బాగానే ప్ర‌భావం చూపింది. కాగా జ‌గ‌న్ త‌న పార్టీ వారికి, త‌న సామాజిక‌వ‌ర్గానికి స‌ల‌హాదారుల పేరుతో దోచిపెట్టార‌ని, ఇప్పుడు టిడిపి కూడా అదే విధంగా చేస్తుంద‌నే భావ‌న‌తో కొంద‌రు ఇబ్బ‌డిముబ్బ‌డిగా స‌ల‌హాదారుపోస్టుల కోసం ధ‌ర‌ఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం పెద్ద‌గా స‌ల‌హాదారుల‌ను తీసుకోద‌ల‌చుకోలేద‌నే సంకేతాల‌ను ఇస్తున్నారు. మొత్తం మీద గ‌త ప్ర‌భుత్వాలు చేసిన దుబారాను చంద్ర‌బాబు చేయ‌ర‌నే విశ్వాసం ప్ర‌జ‌ల్లో నెల‌కొంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ