లేటెస్ట్

సిఎంఓ కూర్పుపై సిఎం క‌స‌ర‌త్తు...!?

చారిత్రత్మాక విజ‌యం సాధించిన టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో మీన‌మేషాలు లెక్కిస్తున్నారనే మాట ప‌లువ‌ర్గాల నుంచి వ‌స్తోంది. రాజ‌కీయ‌, అధికార నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి ఆయ‌న వెనుకాముందాడుతున్నార‌ని వారు అంటున్నారు. ముఖ్యంగా అధికారుల నియామకంలో ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిని వారు ప్ర‌శ్నిస్తున్నారు. అధికారుల పోస్టింగ్‌లు, బ‌దిలీల విష‌యంలో ఆయ‌న మొహ‌మాటానికి పోతున్నార‌నే మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. కొందు ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ విష‌యంలో టిడిపి సోష‌ల్‌మీడియా నుంచి తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. వారి నిర‌స‌న‌ను గ‌మ‌నించి అభ్యంత‌రాలు, నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌యి అధికారుల విష‌యంలో చేసిన పొర‌పాట్ల‌ను దిద్దుకున్నారు. అయితే..వివిధ‌శాఖ‌ల‌కు అధికారుల నియామ‌కంలో ఆల‌స్యం అవుతుంద‌నే చ‌ర్చ అధికార‌వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. ముఖ్యంగా సిఎంఓ ఏర్పాటు విష‌యంలో ఆయ‌న ఎందుకు అంత స‌మ‌యం తీసుకుంటున్నారో తెలియ‌డం లేద‌ని, ఆయ‌న‌కు ఏమి కావాలో, ఎటువంటి అధికారులు కావాలో తెలియ‌ద‌ని, అధికారుల ఎంపిక‌పై ఆయ‌న మీన‌మేషాలు లెక్కిస్తున్నార‌ని, దీని వ‌ల్ల పాల‌న‌లో న‌ష్టం చేకూరే అవ‌కాశం ఉంద‌ని వారు అంటున్నారు. 

వాస్త‌వానికి టిడిపి గెలుస్తుంద‌నే అంచ‌నాలు వ‌చ్చిన వెంట‌నే సిఎంఓకు సీనియ‌ర్ ఐఏఎస్ ర‌విచంద్ర వ‌స్తార‌ని ప‌లువురు అంచ‌నాలు వేశారు. వారు అంచ‌నా వేసిన విధంగానే చంద్ర‌బాబు ర‌విచంద్ర‌ను ముఖ్య‌మంత్రి కార్యాల‌య ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. సీనియ‌ర్‌, నిజాయితీప‌రుడు, స‌మ‌ర్ధుడైన ర‌విచంద్ర‌ను ఆ పోస్టుకు ఎంపిక చేయ‌డంపై అన్నివ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేశాయి. అయితే త‌రువాత సిఎంఓ అధికారుల‌ను ఎంచుకోవ‌డంలోనే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మీన‌మేషాలు లెక్కిస్తున్నారు. అయితే గ‌తంలో సిఎంఓలో ప‌నిచేసిన ప్ర‌ద్యుమ్న‌ను కూడా ఇప్పుడు సిఎంఓలోకి తీసుకున్నారు. ఆయ‌న ఎంపిక‌పై టిడిపిలోభిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. ప్ర‌ద్యుమ్న భార్య వైకాపా లీగ‌ల్‌సెల్‌లో కీల‌కంగా ప‌నిచేస్తున్నార‌ని, అలాంట‌ప్పుడు పాల‌న‌లో కీల‌క‌మైన సిఎంఓలోకి ఆయ‌న‌ను ఎలా తీసుకుంటార‌ని టిడిపి వ‌ర్గాలు ప్ర‌శ్నించాయి. ద్వివేది విష‌యంలో ఫ‌లించిన టిడిపి సోష‌ల్‌మీడియా ఒత్తిడి ఇక్క‌డ ఫ‌లించ‌లేదు. కాగా..మిగ‌తా సిఎంఓ అధికారుల నియామ‌కంలో చంద్ర‌బాబు వేగంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం లేదు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్‌ల‌ను ఆయ‌న ప‌రిశీలిస్తున్న‌ట్లు చెబుతున్నారు. కేంద్ర‌స‌ర్వీసులో ఉన్న పీయూష్‌కుమార్‌ను కూడా సిఎంఓలోకి తీసుకున్నారు. అయితే..మ‌రి కొంద‌రు అధికారులు సిఎంఓలో చేరాల్సి ఉంది. అయితే..ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి వేగంగా స్పందించ‌డం లేదంటున్నారు. సిఎంఓతో పాటు ముఖ్య‌మంత్రి పిఆర్ ఓ, ఇత‌ర అధికారుల‌ను నియ‌మించాల్సి ఉంది. మొత్తం మీద చంద్ర‌బాబు..త‌న కార్యాల‌య ఏర్పాటు విష‌యంలో తొంద‌ర‌ప‌డ‌డం లేద‌ని, నిదానంగా చేస్తున్నార‌నే మాట ఆయా వ‌ర్గాల ద్వారా వ్య‌క్తం అవుతోంది.  కులాల వారీగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు అప్ప‌గిస్తున్నార‌ని, రాజ‌కీయాల్లో చేసిన‌ట్లే, అధికార‌వ‌ర్గాల్లో కూడా ఆయ‌న కులాల లెక్క చూస్తున్నార‌ని టిడిపి వ‌ర్గాలు అంటున్నాయి. అయితే..అదేమీ లేద‌ని, స‌మ‌ర్ధులు, నిజాయితీప‌రులు, ప‌నిమంతుల కోసం ముఖ్య‌మంత్రి అన్వేషిస్తున్నార‌ని అధికార‌వ‌ర్గాలు అంటున్నాయి.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ