కాంగ్రెస్కు బీవీఎం శివశంకర్ రాజీనామా.. కూటమికి మద్దతుగా కీలక వ్యాఖ్యలు
పలమనేరు, అక్టోబర్ 18: కాంగ్రెస్ పార్టీలో భద్రత లేదని, పార్టీ సిద్ధాంతాలు గతంలో మాదిరిగా లేవని ఆ పార్టీ అధికార ప్రతినిధి, పలమనేరు నియోజకవర్గ ఇన్చార్జి బీవీఎం శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన, పలమనేరు పట్టణ ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పలమనేరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శివశంకర్ మాట్లాడారు. పార్టీలో ఎదుగుతున్న నాయకులను చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని, వారిని రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని శివశంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని ప్రశంసించారు. నల్లగుట్లపల్లి గ్రామంలో గతంలో కొండలు, గుట్టలతో ఉన్న ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావడం ద్వారా అనేక మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు.
యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు భద్రత లేదని, పార్టీ సమావేశాల నిర్వహణలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన సమావేశానికి 20 వేల మందిని సమీకరించినట్లు తెలిపారు.
నల్లగుట్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించిన సమయంలోనే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, అయితే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తన రాజీనామాను అంగీకరించలేదని శివశంకర్ వెల్లడించారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న సిద్ధాంతాలు కనిపించడం లేదని విమర్శించారు.
పలమనేరు పట్టణ ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి, అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.