11:11:11:11.. జగన్కు 11తో చురకలా? విజయసాయిరెడ్డి పార్టీ ప్రకటనపై సెటైర్లు!
ఒకప్పుడు వైకాపాలో నెంబర్ టూ అయిన విజయసాయిరెడ్డి గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వైకాపాతో విభేదించి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తాను వ్యవసాయం చేసుకుంటానని, రాజకీయాలతో తనకు సంబంధం లేదని ప్రకటించి వెళ్లిపోయారు. అయితే.. ఆరు నెలలు మౌనంగా ఉన్న విజయసాయిరెడ్డి తర్వాత మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకమయ్యారు. త్వరలో తాను పార్టీ పెడతానని, దసరా రోజున పార్టీని ప్రారంభిస్తానని గతంలో ప్రకటించారు. అయితే.. ఆ ప్రకటనకు భిన్నంగా ఆయన వచ్చే నెల 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాల 11 సెకన్లకు తన పార్టీని ప్రకటిస్తానని ఈ రోజు వెల్లడించారు.
ఆయన ప్రకటనపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఆయన 11 అంకెను ఎంచుకోవడానికి కారణం జగన్ పార్టీని ఎద్దేవా చేయడానికేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుస్తామని ప్రకటించుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం 11 స్థానాల్లోనే గెలిచారు. దీంతో.. ఇప్పుడు 11 అంకె అంటే వైకాపాకు మండిపోతోంది. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు కూడా 11 అంకె అంటే రంకెలేస్తున్నారు. ఇటువంటి తరుణంలో విజయసాయిరెడ్డి కావాలనే 11వ తేదీన తన పార్టీని ప్రకటిస్తానని, అన్ని సంఖ్యలూ 11 వచ్చేలా చూసుకోవడంతో ఆయనపై వైకాపా కార్యకర్తలు మండిపడుతున్నారు. తమను ఎద్దేవా చేయడానికే విజయసాయిరెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆయనపై ధ్వజమెత్తుతున్నారు.
అయితే.. జగన్కు దూరమైన దగ్గర నుంచి విజయసాయిరెడ్డి వైకాపాపై విరుచుకుపడుతున్నారు. వైకాపా క్రిస్టియన్ల పార్టీ అని, జగన్ అసలు రెడ్డి కులస్థుడు కాదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాను అసలైన రెడ్డినని.. రెడ్డి సామాజికవర్గం మొత్తం తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. జగన్ కోసం తాను ఎన్నో చేసినా.. తనను జగన్ అవమానించి పార్టీ నుంచి తరిమేశారని, జగన్ తనకు నమ్మకద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. జగన్ అక్రమాలకు తాను సాక్షినని, ఎప్పుడు కోరితే అప్పుడు తాను సాక్ష్యం చెబుతానని కూడా ఆయన అంటున్నారు.
మొత్తం మీద ఒకవైపు స్థానిక ఎన్నికల్లో వైకాపాకు బొప్పి కడుతుంటే.. మరోవైపు విజయసాయిరెడ్డి వైకాపా అధినేతతో అంకెల ఆట ఆడుకుంటున్నారు.