జగన్‌రెడ్డి సహా కీలక నేతలకు టిక్కెట్లు లేనట్లేనా..?
ఏకగ్రీవాలపై జగన్ చేసిన హెచ్చరికలే ఇప్పుడు ఆయనకు సవాల్.. పులివెందుల, కడప, పుంగనూరు పరిణామాలతో వైకాపాలో చర్చ
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే చుట్టుకుంటున్నాయి. ఆయనతో పాటు ఆయన తమ్ముడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైకాపాలో కీలక నేతగా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిధున్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో వైకాపా టిక్కెట్లు దక్కే పరిస్థితి లేదా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలదే బాధ్యతని, అటువంటి వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని జగన్ ఎన్నికలకు ముందు ఖరాఖండిగా ప్రకటించారు. నాయకులంతా అధికార కూటమిపై గట్టిగా పోరాడాలని, రాష్ట్రంలో ఎక్కడ ఏకగ్రీవాలు జరిగినా అక్కడి ఇన్‌ఛార్జిలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని హెచ్చరించారు.
అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైకాపా కోటలుగా భావించే పులివెందుల, కడప, పుంగనూరుల్లో ఏకగ్రీవాలకు సంబంధించిన పరిణామాలు తెరపైకి వచ్చాయి. సాక్షాత్తూ వైకాపా అధ్యక్షుడు జగన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల మున్సిపాలిటీలో 19 వార్డుల్లో వైకాపా నామినేషన్లు కూడా దాఖలు చేయలేకపోయిందన్న సమాచారం రాజకీయంగా చర్చకు దారితీసింది. దీంతో ఈ వార్డుల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఏర్పడింది. ఇదే విధంగా కడపలోనూ ఏకగ్రీవాల అంశం తెరపైకి వచ్చింది. ఇక్కడి నుంచి ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడపలో మొత్తం 66 వార్డులు ఉంటే అక్కడ కేవలం 12 చోట్ల మాత్రమే వైకాపా అభ్యర్ధులతో నామినేషన్ వేయించగలిగింది. దీంతో మిగతా వార్డులన్నీ ఏకగ్రీవం కానున్నాయి. ఈ ప్రాంతంలో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పులివెందులలోనే నామినేషన్లు కరువా?
వైకాపాకు బలమైన ప్రాంతంగా భావించే పులివెందులలోని మున్సిపాలిటీలో 40 వార్డులు ఉంటే దాదాపు సగం అంటే 19 చోట్ల వైకాపా నామినేషన్ వేయలేకపోయింది. అంటే జగన్ స్వంత నియోజకవర్గంలోనే దాదాపు సగం వార్డులు ఏకగ్రీవాలు అవుతున్నాయి. టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అక్కడ ఒక్కసారి కూడా టిడిపి గెలుపొందలేదు. పైగా..అప్పటి నుంచి కూడా వైకాపా కుటుంబంమే ప్రతిసారీ ఎమ్మెల్యేగా ఎన్నికవుతోంది. ఇటువంటి కంచుకోటలో 19 చోట్ల నామినేషన్ వేయలేదంటే..జగన్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. జగన్ సొంత నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడటంతో, గతంలో ఆయన చేసిన హెచ్చరికలను ఇప్పుడు ఎలా అమలు చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ ఏకగ్రీవాలు జరిగినా సంబంధిత నియోజకవర్గ ఇన్‌ఛార్జిలకు టిక్కెట్లు ఇవ్వబోమని జగన్ గతంలో ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారం చూస్తే, పులివెందులలో చోటుచేసుకున్న పరిణామాలకు బాధ్యత ఎవరు వహించాలి? సొంత నియోజకవర్గంలోనే పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేని పరిస్థితి ఏర్పడితే, దానికి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
కడపలో అవినాష్‌రెడ్డి పరిస్థితి ఏమిటి?
కడపలోనూ ఏకగ్రీవాలకు సంబంధించిన పరిణామాలు వైకాపా నాయకత్వానికి ప్రశ్నలు ఎదురయ్యేలా చేస్తున్నాయి. కడప ఎంపీగా వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడి రాజకీయ వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి పులివెందుల కంటే ఘోరంగా ఉంది. మొత్తం 66 వార్డుల్లో కనీసం 25శాతం కూడా వైకాపా నామినేషన్ వేయనిపరిస్థితి. అంటే ఇక్కడ కూడా టిడిపి ఏకగ్రీవంగా గెలుపొందబోతోంది. దీంతో స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి ఆయన బాధ్యత ఏమిటన్న చర్చ మొదలైంది.
ఏకగ్రీవాలపై జగన్ గతంలో చేసిన ప్రకటనను అమలు చేస్తే, కడపలో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకుల విషయంలోనూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నామినేషన్లు దాఖలు కాకపోవడానికి గల కారణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
పుంగనూరులో చేతులు ఎత్తేసిన పెద్దిరెడ్డి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ తాము పోటీ చేయడం లేదని పెద్దిరెడ్డే స్వయంగా ప్రకటించారు. ఆ తరువాత మాట మార్చారు. అయితే పార్టీ తరుపున నామినేషన్ వేయించలేకపోయారు.
2021లో టీడీపీ నాయకులను కనీసం నామినేషన్లు కూడా దాఖలు చేయకుండా అడ్డుకున్నారంటూ పెద్దిరెడ్డి కుటుంబంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే పుంగనూరులో వైకాపా పోటీకి సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలను రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తావిస్తున్నారు. గతంలో ఇతర పార్టీల అభ్యర్థుల నామినేషన్ల విషయంలో వివాదాలు ఎదుర్కొన్న ప్రాంతంలోనే ఇప్పుడు వైకాపా పోటీపై ప్రశ్నలు తలెత్తడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిధున్‌రెడ్డి విషయంలో జగన్ ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకగ్రీవాలు జరిగితే బాధ్యులైన ఇన్‌ఛార్జిలకు టిక్కెట్లు ఇవ్వబోమని చెప్పిన జగన్.. పార్టీ ముఖ్యనేతల విషయంలోనూ అదే నిర్ణయాన్ని అమలు చేస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జగన్ తన మాటకు కట్టుబడి ఉంటారా?
ఏకగ్రీవాలపై గతంలో చేసిన హెచ్చరికల ప్రకారం చూస్తే, మొదట ప్రశ్న ఎదురయ్యేది జగన్‌కే. ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్న సమాచారం నేపథ్యంలో, తన ప్రకటనకు ఆయనే కట్టుబడి ఉంటారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అదే విధంగా కడపలో అవినాష్‌రెడ్డి, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్‌రెడ్డిల విషయంలోనూ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. అయితే ఈ నాయకులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కవని ఇప్పుడే నిర్ధారించలేం. పార్టీ అధికారికంగా తీసుకునే నిర్ణయం వెలువడాల్సి ఉంది.
రాజకీయాల్లో మాటలు చెప్పడం ఒక ఎత్తయితే, వాటిని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు. ఎక్కడ ఏకగ్రీవాలు జరిగినా బాధ్యులైన ఇన్‌ఛార్జిలకు టిక్కెట్లు ఇవ్వబోమని జగన్ చేసిన ప్రకటనను ఇప్పుడు అమలు చేస్తారా? లేక కీలక నేతల విషయంలో మినహాయింపులు ఉంటాయా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలకే ఆంక్షలా?
జగన్ హెచ్చరికలపై వైకాపాలోని కొందరు బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ అంతర్గత చర్చల్లో కొందరు నాయకులు, జగన్ హెచ్చరికలు కింది స్థాయి నాయకులకే పరిమితమవుతున్నాయని, కీలక నేతల విషయంలో మాత్రం అదే కఠిన వైఖరి కనిపించడం లేదని విమర్శిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తన సామాజిక వర్గానికి చెందిన నాయకుల విషయంలో చర్యలు తీసుకుంటారా? లేక ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులపైనే క్రమశిక్షణ చర్యలు పరిమితం అవుతాయా? అన్న ప్రశ్నలను కొందరు పార్టీ నాయకులు లేవనెత్తుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవి పార్టీ అంతర్గతంగా వినిపిస్తున్న విమర్శలు మాత్రమే. ఈ అంశంపై వైకాపా నాయకత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
కీలకనేతలకు టిక్కెట్లు ఇవ్వకపోతే..అసలు పార్టీయే ఉంటుందా?
ఏకగ్రీవాలు జరిగితే టిక్కెట్లు లేవన్న జగన్ తన స్వంత కులానికిచెందిన నాయకులపై, లక్షల కోట్లు ఉన్న నాయకుల విషయంలో అన్నమాటకు కట్టుబడి ఉంటారా..? అనే ప్రశ్న సామాన్య కార్యకర్తల నుంచి వస్తోంది. పార్టీలో కీలకనేతలైన పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలకు చెప్పిన మాట ప్రకారం టిక్కెట్లు ఇవ్వకపోతే..వైకాపా అనే పార్టీ ఉంటుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే..జగన్ ఎప్పుడూ తాను ఇచ్చిన మాటకు నిలబడే రకం కాదని, గతంలోనే ఆయన చేసిన చేష్టలే దీనికి ఉదాహరణ అని ఆయన ప్రత్యర్ధులు ఆయనను ఎద్దేవా చేస్తుంటారు. రాజధాని అమరావతి విషయంలో కానీ, ఉద్యోగులు సిపిఎస్‌కు సంబంధించిన విషయంలో కానీ, లేకపోతే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ..విషయం ఏదైనా..ఆయన ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి కాదని, ఇప్పుడు అలా నిలబడదామనుకుంటే..ఆయన పుట్టిమునగడం ఖాయం కనుక..ఏకగ్రీవాలు అయితే..టిక్కెట్ లేదనే మాట..ఒట్టొట్టి మాటలే.
ఫైనల్‌గా “అన్నరూల్స్ పెడతాడు...పాటించరు..” అని అదేదో సినిమాలో సునీల్ అంటాడు.. అలా ఉంది జగన్ పరిస్థితి.