కడప జిల్లాలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కాఫీ పొడి అట్టపెట్టెల మాటున ఎర్రచందనం తరలింపు.. రూ.1.30 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
కడప: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాపై కడప జిల్లా పోలీసులు కొరడా ఝళిపించారు. కాఫీ పొడి ప్యాకెట్ల అట్టపెట్టెల మాటున ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి 1.984 టన్నుల బరువున్న 70 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మూడు వాహనాలు, 643 కాఫీ పొడి అట్టపెట్టెలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ.1.30 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
కడప జిల్లాలోని ఎస్.ఏ. కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లె సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒకరు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.
కాఫీ పొడి అట్టపెట్టెల మాటున అక్రమ రవాణా
ఎర్రచందనం దుంగలను పోలీసుల కంట పడకుండా తరలించేందుకు స్మగ్లర్లు కొత్త పద్ధతిని అనుసరించినట్లు పోలీసులు గుర్తించారు. కాఫీ పొడి ప్యాకెట్లతో కూడిన అట్టపెట్టెల లోడు చాటున ఎర్రచందనం దుంగలను దాచి తరలిస్తున్నట్లు వెల్లడించారు. తనిఖీల సందర్భంగా ఈ అక్రమ రవాణాను గుర్తించిన పోలీసులు ఎర్రచందనం దుంగలతో పాటు వాటిని తరలించేందుకు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో నిందితులు పోలీసులపై గొడ్డళ్లు, రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయినప్పటికీ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తూ, పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
అక్రమ రవాణాపై కఠిన చర్యలు
ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. పునరావృత నేరాలకు పాల్పడే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. అటవీ సంపదను అక్రమంగా తరలించే ముఠాలపై నిఘా కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.