వంగవీటి రాధాకు పోటీగా ఏబీ.. విజయవాడలో అసలైన పోరు ఇప్పుడేనా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ నగర మేయర్‌గా తాను పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
కూటమి తన పొత్తుల్లో భాగంగా విజయవాడ మేయర్ స్థానాన్ని జనసేనకు కేటాయించింది. అయితే, ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. నిన్నటి వరకు టీడీపీ నాయకుడిగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ హఠాత్తుగా జనసేన పార్టీలో చేరడం, ఆయనకు జనసేన నగర మేయర్ అభ్యర్థిత్వాన్ని కేటాయించడం చకచకా జరిగిపోయాయి. అయితే, కూటమి పెద్దలు ముందుగానే నిర్ణయించుకుని ఈ విధంగా చేశారనే ప్రచారం ఉంది.
జనసేనకు విజయవాడ నగర మేయర్ స్థానం ఇవ్వడం టీడీపీలోని ఒక వర్గానికి ఇష్టం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధినేత తీసుకున్న నిర్ణయంపై వారు బహిరంగంగా ఏమీ మాట్లాడకపోయినా, లోలోపల మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఏబీ వెంకటేశ్వరరావు తన పార్టీ తరఫున నగర మేయర్‌గా పోటీ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
విజయవాడ అంటేనే కులాల కుమ్ములాటకు పేరుందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా, ఏబీ వెంకటేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో ఇక్కడ ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలో అసంతృప్తితో ఉన్నవారు ఇప్పుడు ఏబీ పోటీ చేస్తుండటంతో ఆయనకు మద్దతు ఇస్తారా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలి కాలంలో ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, వైసీపీతో కుమ్మక్కైందని, డబ్బులు తీసుకుని వైసీపీ నేతలపై ఉన్న కేసులను నీరుగారుస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.
కాగా, ఇటీవలి కాలంలో కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందనే చర్చ సాగుతోంది. కమ్మ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఆ వర్గంలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఇప్పుడు విజయవాడ నగర మేయర్‌గా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమను పట్టించుకోవడం లేదని భావిస్తున్న చంద్రబాబు, లోకేశ్‌లకు కమ్మ సామాజిక వర్గం షాక్ ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని వీడదని, చంద్రబాబుపై అసంతృప్తి ఉన్నప్పటికీ ఓటు మాత్రం కూటమికే వేస్తారనే భావన కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.
మొత్తం మీద ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలో మేయర్‌గా పోటీ చేస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు, ఆయన కాంగ్రెస్ మద్దతును కోరడం, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మద్దతు కోరుతూ లేఖ రాయడం గమనార్హం. దీంతో ఆయన ఆషామాషీగా కాకుండా, ఎన్నికల్లో గట్టిగానే పోటీ పడేందుకు సిద్ధమయ్యారనే విషయం స్పష్టమవుతోంది.