ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. మరో ఏడాది ఉచిత వసతి పొడిగింపు
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి కార్యాలయాల తరలింపు నేపథ్యంలో ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత తాత్కాలిక వసతి సౌకర్యాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ 2026 అక్టోబర్ 14న జీఓ ఆర్టీ నంబర్ 2008ను జారీ చేసింది.
సచివాలయం, అసెంబ్లీ, వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలు (హెచ్ఓడీలు), హైకోర్టు, రాజ్భవన్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులకు ఈ సౌకర్యం వర్తించనుంది. ఇందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రైవేటు యజమానుల నుంచి లీజుకు తీసుకున్న ఫ్లాట్లలో ఉద్యోగులకు ఉచితంగా, షేరింగ్ పద్ధతిలో వసతి కల్పిస్తున్నారు.
జూన్ 27 నుంచి అమలు
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, 2026 జూన్ 27 నుంచి మరో ఏడాది పాటు ఈ సౌకర్యాన్ని పొడిగించారు. అయితే, అంతకంటే ముందుగా అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) ప్రభుత్వ క్వార్టర్లను అందుబాటులోకి తీసుకొస్తే, ఆ సమయం నుంచే ఈ సౌకర్యం ముగుస్తుంది.
ప్రైవేటు ఫ్లాట్ల యజమానులతో చెల్లుబాటయ్యే లీజు ఒప్పందాలను కుదుర్చుకోవడం లేదా పునరుద్ధరించడం తప్పనిసరి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఒప్పందాలు సమర్పించని ఫ్లాట్లను ఈ సౌకర్యం నుంచి తొలగించే అవకాశం ఉంది. ఫ్లాట్లను ఖాళీ చేయాలని యజమానులు కోరిన సందర్భాల్లో, వాటిని ఖాళీ చేసిన తేదీ నుంచి వసతి సౌకర్యం వర్తించదు.
ఉద్యోగులకు వసతి కల్పించేందుకు అయ్యే అద్దె, ఇతర అర్హమైన చెల్లింపులను చెల్లుబాటయ్యే లీజు ఒప్పందాల ప్రకారం చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీఆర్డీఏ నుంచి ప్రభుత్వ నివాస సముదాయాలు అందుబాటులోకి వచ్చే వరకు అర్హులైన ఉద్యోగులకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.