WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జ్ఞానమే విముక్తి మార్గం

విప్లవమనేది సాయుధంగా కాక, మానవుని మనో వర్తనలో సంభవించాలని అంబేద్కర్‌ బోధించారు. శాంతియుత పద్ధతిలో ప్రజాస్వామ్య విధానం ద్వారా విప్లవం సంభవిస్తే- ఒక బలమైన, స్థిరమైన మానవతా సంఘం ఆవిష్కృతమవుతుందని ఆయన చెప్పారు. తద్వారా సంఘంలో అందరూ అన్నింటినీ సమానంగా అనుభవించి, సంతోషంగా ఉండవచ్చు. దానికి ‘బుద్ధుడి విలువలతో సంఘ నిర్మాణమే’ శరణ్యం అని బలంగా నమ్మి దానినే ఆచరించి, ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారు అంబేద్కర్‌.

ఏప్రిల్‌ 14 వస్తుందంటే దళిత నాయకులుగా చెలామణి అవుతున్న వారికి పెద్ద పండుగ. డాక్టర్‌ అంబేద్కర్‌ తన జీవితకాలమంతా ఏ అగ్ర కుల మనువాద వ్యవస్థపై పోరాడారో వారి దగ్గరికే వెళ్ళి చందాలు పోగేసి అంబేద్కర్‌ జయంతి చేసుకోవడం మహారాష్ట్రలో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆ తర్వాత ఆ సంప్రదాయం ఇతర రాషా్ట్రలకు విస్తరించింది. అయితే అగ్ర కులస్తులు ఇలాంటి దళిత నాయకులకు డబ్బు ఇవ్వడమేమిటి? ఎన్నికల్లో ఓట్లను ఆశించి వారు దళిత నాయకులకు చందాలు ఇస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. అయితే అంబేద్కర్‌ కలలుగన్నదేమిటి? ఆ ఓట్లతోనే తన ప్రజలు సొంత కాళ్ళపై రాజ్యాధికారానికి వస్తారని ఆయన ఆశించారు. కానీ ఈ దళిత నాయకుల వల్ల అంబేద్కర్‌ కన్న కలలు నిర్వీర్యమైపోతున్నాయి. అంబేద్కర్‌ నిర్విరామ పోరాటం ద్వారా లాభపడిన విద్యావంతులు సొంత ఖర్చులతో జయంత్యుత్సవాలు జరుపుకోవాలి కదా! ఈ పద్ధతి ఉత్తర ప్రదేశ్‌లో విజయవంతంగా అమలు జరుగుతుంది.

అదే ఇక్కడ మనకూ ఆదర్శం కావాలి.మన ఉద్యోగులు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి వెళతారు. అక్కడ అంబేద్కర్‌ నిజమైన పోరాట చరిత్ర, ఉద్యమం గాని బయటకు రాదు. ఆయనను కేవలం గుడిలో ఉత్సవ విగ్ర హంగానే చూపిస్తారు. మనవాళ్ళు వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు. ఎందుకంటే వీరు అంబేద్కర్‌ ఆలోచనని ఆచరణాత్మకంగా తీసుకుపోయి దాన్ని గెలిపించటానికి సంబంధించిన ఆలోచనలు ఏవీ వీరికి ఉండవు. డాక్టర్‌ అంబేద్కర్‌ అంటరాని వారి కోసం శూద్రుల కోసం, సగటు పౌరుల కోసం, సీ్త్రల కోసం, కార్మికుల కోసం ముస్లిం మైనారిటీల కోసం అంతిమంగా వీరందరికీ రాజ్యాధికారం అందించి తద్వారా సంఘాన్ని మార్చడం ఆయన అంతిమ లక్ష్యంగా ముందుకెళ్ళారు. అంబేద్కర్‌ అంటే యథాస్థితిలో ఉన్న సంఘాన్ని సాంస్కృతిక, రాజకీయ ఆయుధాలతో సమూలంగా మార్చి ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించడం.
అంబేద్కర్‌ బాల్యం, విద్యార్థి, యవ్వన, నడి వయస్సు దశలలో అడుగడుగునా అంటరానితనం, కటిక పేదరికం, దుఃఖం, ఒంటరితనం అనుభవించారు. కారు చీకటిలో, బయలు దేరారు అంబేద్కర్‌ వాటన్నింటినీ అధిగమించి ‘ప్రపంచలోనే మొదటి మేధావి’గా తయారయ్యారు.

తన ముందు మార్క్సిస్టు విజ్ఞాన శాస్త్రమున్నప్పటికీ, కళ్ళ ముందే శ్రామిక స్వర్గాలైన సోవియట్‌ రష్యా, చైనాలు ఉన్నప్పటికీ ఆయన తనదైన విజ్ఞాన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విప్లవమనేది సాయుధంగా కాక, మానవుని మనో వర్తనలో సంభవించాలని ఆయన బోధించారు. శాంతియుత పద్ధతిలో ప్రజాస్వామ్య విధానం ద్వారా విప్లవం సంభవిస్తే... ఒక బలమైన, స్థిరమైన మానవ తా సంఘం’ ఆవిష్కృతమవుతుందని ఆయన చెప్పారు. తద్వారా సంఘంలో అందరూ అన్నింటినీ సమానంగా అనుభవించి, సంతోషంగా ఉండవచ్చు. దానికి ‘బుద్దుడి విలువలతో సంఘ నిర్మాణమే’ శరణ్యం అని బలంగా నమ్మి దానినే ఆచరించి, ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారు అంబేద్కర్‌.
అయితే అంబేద్కర్‌కు కొన్ని సవాళ్లు ఎదురైనాయి. 1. కోట్లమంది బాధితులైన తన వారికి తాము బానిసలమని తమకే తెలియక పోవడం; 2. తన ప్రజలైన శూద్ర అతి శూద్రులకు నాయకత్వం వహించాలనుకున్నా, తన వారికి తానే అర్థం కాక పోవడం (ఇది ప్రపంచంలో ఎవ్వరికీ ఎదురు కాని వింత పరిస్థితి). ఎందుకంటే తన ప్రజలు ఒక ముద్ద కోసం శరీరాన్ని ముక్కలు చెక్కలు చేసుకుంటూ, శరీరం కోసం మాత్రమే బతకడం. జీవితం అంటే ఏమిటో తెలియక పోవడం, ఎందుకంటే వీరికి ఆ రోజుల్లో జ్ఞానంపై (విద్య) హక్కులేదు. వీరిపై దాష్టీకం చేస్తున్న అగ్రకుల మనువాదుల్నే వారు దైవంగా భావిస్తారు. శూద్ర, అతి శూద్ర కులస్తుల మనో ప్రవర్తనలో అగ్ర కుల వ్యవస్థ నాటిన భావాలే ప్రబలంగా ఉంటాయి. దాంతో డాక్టర్‌ అంబేద్కర్‌ తన వారికి అర్థం కాలేదు. కానీ మనువాదులకు అంబేద్కర్‌ అర్థమైనాడు. ఈ నేపథ్యంలో అంబేద్కర్‌ ముందున్న ప్రథమ కర్తవ్యం ఏమంటే తన ప్రజల్ని విద్య ద్వారా జ్ఞానవంతుల్ని చేయడం. అందుకోసం అంబేద్కర్‌ ఉద్యమం అవిశ్రాంతంగా సాగింది. అది ఆయన జీవితాంతం 1956 డిసెంబర్‌ 6వ తేది వరకు కొనసాగింది.

దేశం నలుమూలలా ఈ శతాబ్దంలోను, గత శతాబ్దిలోనూ అణచివేయబడిన వారి కోసం, వారి విముక్తికి అనేక మంది ఉద్యమకారులు పోరాటాలు చేసారు. మహాత్మ జ్యోతిబా ఫూలేని అంబేద్కర్‌ తన గురువుగా స్వీకరించారు. ఫూలే ఉద్యమాన్ని 1919 నుంచి 1956 వరకు డాక్టర్‌ అంబేద్కర్‌ కొనసాగించారు. వారి పోరాటాల ఫలితంగానే మనకు విద్యా ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ హక్కులు లభించాయన్న విషయం మరువరాదు. అయితే ఇప్పటికీ పరిపూర్తి కావల్సిన లక్ష్యాలను చేరుకునేందుకు వారి పోరాటాలను ముందుకు తీసుకుపోవడమే, వారికి మనమిచ్చే నిజమైన నివాళి.

(384)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ