లేటెస్ట్

మలేషియా అభివృద్ధిలో తెలుగు వారి పాత్ర మరువలేనిది : రజాక్

(కౌలాలంపూర్‌ నుంచి): మలేషియా దేశానికి 150 ఏళ్ల క్రితం వచ్చిన తెలుగువారు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని ఆ దేశ ప్రధానమంత్రి నజాబ్‌ హజీ రజాక్‌ కొనియాడారు. శనివారం సాయంత్రం కౌలాలంపూర్‌లో నిర్వహించిన మలేషియా తెలుగు సంఘం (టాం) 60వ వార్షికోత్సవం, ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. మలేషియాలో నలుమూలలా విస్తరించిన తెలుగువారు అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని ఆ దేశ ప్రధాని ప్రశంసించారు. మలేషియాలో తెలుగు విద్యార్ధులకు ప్రత్యేక ఉపకార వేతనాలు అందజేస్తామని, తెలుగు పాఠశాలలు కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.

మలేషియాలోని తెలుగు వారి కోసం గతంలో ఏ ప్రధాని చేయని విధంగా 11మిలియన్‌ రింగెట్ల ఆర్ధిక సాయం అందించామని పేర్కొన్నారు. కౌలాలాంపూర్‌లో రూ.10కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న తెలుగు అకాడమీ భవనానికి ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. ‘ఉగాది శుభాకాంక్షలు’.. అంటూ తెలుగులో ఆయన ప్రసంగం ప్రారంభించడం అతిధులను ఆకట్టుకుంది. ప్రత్యేక అతిధిగా హాజరైన ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ తొలి ప్రవాస తెలుగు సంఘం తొలిసారిగా 60ఏళ్ల క్రితం మలేషియాలో ఏర్పడిందని, 2వ ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్రం వెలుపల తొలిసారిగా మలేషియాలోనే జరిగాయని గుర్తు చేశారు. మాజీ మంత్రి, ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ అచ్చయ్యకుమార్‌ రావు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

(772)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ