WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అప్పు ఇప్పిస్తారా...!?

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రతిసారీ ఆంధ్రుల మనోభావాలతో ఆడుకుంటూనే ఉంది. గతంలో కాంగ్రెస్‌ ఈ విధంగా వ్యవహరించి పతనమైనా..దాని నుంచి 'బిజెపి'పాఠాలు నేర్చుకున్నట్లు లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి ప్రతిసందర్భంలో ఆంధ్రుల మనోభావాలతో కేంద్ర ప్రభుత్వం గాయపరుస్తూనే ఉంది. అధికారంలోకి రాకముందు...ఆంధ్రాకు కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని, తాము అధికారంలోకి వస్తే..ఆంధ్రాకు న్యాయం చేస్తామని..ఊదరగొట్టి...తరువాత తీరిగ్గా ఒక్కో హామీకి మంగళం పాడారు. అయినా..ఆంధ్రా'జనం' పెద్దగా నోరెత్తలేదు. దాంతో మరింత రెచ్చిపోతోంది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం. తొలుత ఆంధ్రుల రాజధాని 'అమరావతి' శంఖుస్థాపన సమయంలో ప్రధాని 'నరేంద్రమోడీ' ప్రజల మనోభావాలను గాయపరిచారు. ఎన్నో ఆశలతో రాజధాని నిర్మాణానికి శంఖుస్థాపన జరుగుతుంటే..భారత ప్రధాని హోదాలో ఎంతో కొంత ఆర్థిక సహాయం ప్రకటిస్తారని ప్రజలందరూ భావించగా..ఆయన గుప్పెడు మట్టి...చెంబుడు నీళ్లు ఇచ్చి...ఆంధ్రా ప్రజలను నివ్వెర పరిచారు. ఇదేమిటి...ఎంతో అన్యాయం జరిగిన రాష్ట్రానికి న్యాయం చేస్తానన్న వ్యక్తి...మట్టి..నీళ్లు ఇస్తారా..? అని బుగ్గలు నొక్కుకున్నారు....! సరే...! ఓట్లేసి గెలిపించాం...ఏం చేస్తామన్నట్లు ఆంధ్రాజనం నోరు మెదపలేదు. ఇది తొలిసారి...ఆంధ్రుల మనోభావాలు దెబ్బతిన్న రోజు...! తరువాత....నుంచి 'మోడీ' ప్రభుత్వం మరింత రెచ్చిపోయింది. ఆంధ్రాకు ప్రత్యేకహోదా...విషయంలో..రైల్వేజోన్‌ విషయంలో...అసెంబ్లీ నియోజకవర్గాల పునర్‌వ్యవస్ణీకరణ విషయంలోనూ...రాజధానికి నిధులు కేటాయింపు విషయంలో...ఉమ్మడి సంస్థల విభజన విషయంలోనూ...ఆంధ్రుల మనోభావాలను గాయపరుస్తూనే వస్తోంది బిజెపి ప్రభుత్వం...ఇప్పుడు తాజాగా..ఆంధ్రులను మరింత బాధపెట్టే చర్యలకు శ్రీకారం చుట్టారు...కేంద్రంలోని పెద్దలు.

  ఆంధ్రాకు జీవనాడి అయిన 'పోలవరం' ప్రాజెక్టు పనులు ఏదో రూపంలో అడ్డుకుంటూ...ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడుతున్న 'మోడీ' ప్రభుత్వం...ఇప్పుడు...ఆ ప్రాజెక్టు నిర్మాణంలో సహాయం చేస్తానని..చెబుతూ...ఎకెసెక్కాలు ఆడుతోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని..దానిని పూర్తి చేసే బాధ్యత తమదని, పదే పదే చెబుతున్న కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ...తాజాగా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన సిమెంట్‌, ఇనుము అప్పుపై ఇప్పిస్తానని చెబుతున్నారు..? ఒక జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఇనుము, సిమెంట్‌ అప్పుపై ఇప్పిస్తారా...? ఇదేమైనా...పేద వాని పెళ్లా...? పాత రోజుల్లో ఎవరైనా పేద వారు పెళ్లి చేసుకుంటుంటే...ఆ గ్రామంలోని మోతుబరి రైతు తనకు తెలిసిన వ్యాపారుల నుంచి...వివాహానికి అవసరమైన దుస్తులు,సరుకులు... ఇతర వస్తువులు అరువుగా ఇప్పించి పెళ్లి పెద్దగా వ్యవహరించేవారు...! ఇప్పుడు 'గడ్కరీ' వైఖరి చూస్తుంటే...పోలవరం నిర్మాణం..పేదవాని వివాహమే అన్నట్లు చూస్తున్నట్లుంది...!? ఏమిటీ..అసందర్భ ప్రేలాపనలు..? ఆంధ్రులతో వ్యవహరించే తీరేనా..ఇది...? తమది గొప్ప ప్రభుత్వమని, తమ ఏలుబడిలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, సాగునీటి ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న కేంద్ర పెద్దలు ఒక జాతీయ ప్రాజెక్టుకు ఇనుము,సిమెంట్‌ అప్పుగా ఇప్పిస్తామని చెప్పడం...ఆంధ్రుల మనోభావాలను గాయపర్చడమే...! మహారాష్ట్రలో 70వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులను చేపట్టిన గడ్కరీ..అక్కడ కూడా ఇదే అప్పు మాటలు చెప్పవచ్చు కదా...? ఎప్పటికప్పుడు వేల కోట్లు మాత్రం స్వంత రాష్ట్రానికి విడుదల చేసుకుంటూ..అన్యాయానికి గురైన ఆంధ్రాకు మాత్రం అప్పులు ఇప్పిస్తారట...? ఇదే వైఖరి ముందు ముందు కొనసాగితే...కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కిన ఆంధ్రా 'జనం' త్వరలో 'బిజెపి'కి కూడా పాడె కట్టడం ఖాయం...!


(707)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ