లేటెస్ట్

'నాయుడు' కలలను కల్లలు చేసిన 'జగన్‌'...!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పరిపాలనా కాలంలో రాజధాని ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని కలలు కన్నారు. రాజధాని ప్రాంతంలో ఎన్నో  అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. అంతే కాదు ఆయన కలలు కన్న కొన్ని ప్రాజెక్టులు వాస్తవ రూపం దాల్చాయి. మరి కొన్నింటిలోపనులు సాగుతుండగా...ఆయన ఎన్నికల్లో పరాజయం పాలవడంతో ఆయన కలలు ఇప్పుడు కల్లలు అవుతున్నాయి. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన పలు ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోవడమో..లేక వాయిదాపడడమో... లేదా..విచారణల పేరిట జాప్యం జరగడమో జరుగుతోంది. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం 'నాయుడు' కలల ప్రాజెక్టులపై శీత కన్ను వేసింది. ఆయన చేపట్టిన ప్రాజెక్టులపై విచారణ జరిపించడం లేదా..ఆపివేయడం చేస్తోంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో 'చంద్రబాబు' చేపట్టిన పలు ప్రాజెక్టులను 'జగన్‌' ప్రభుత్వం పక్కకు పెట్టేసింది. 

ప్రపంచంలోనే మేటి రాజధానిగా 'చంద్రబాబు' నిర్మించాలనుకున్న 'అమరావతి'పై ప్రస్తుత ప్రభుత్వం విచారణ కమిటీని వేసింది. అమరావతి రాజధానికి శ్రేయస్కరం కాదని, ఇక్కడ నుంచి రాజధానిని తరలించాలని 'జగన్‌' మంత్రులు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు రాజధాని ఉంటుందా..? ఉండదా..? అనే దానిపై ప్రజల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కృష్ణానదికి వరదలు వస్తే..ఈ ప్రాంతం మొత్తం మునిగిపోతుందని, ఇక్కడ రాజధాని నిర్మాణం ఖర్చుతో కూడిన వ్యవహారమని మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలతో ఇక్కడ కలకలం చెలరేగుతోంది. రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులు..తమ భవిష్యత్‌ ఏమిటో తెలియక అల్లాడుతున్నారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి 'జగన్‌' స్పందించకపోవడంతో..రాజధానిపై ఏదో జరుగుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

 'చంద్రబాబు' ప్రారంభించిన 'రాజధాని' వ్యవహారం ఇలా ఉంటే ఆయన మరో మానసపుత్రిక 'అన్న క్యాంటీన్‌'ను వైకాపా ప్రభుత్వం మూసివేసింది. 'అన్న క్యాంటీన్‌'ను 'చంద్రబాబు' ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ప్రారంభించారు. ఈ క్యాంటీన్‌ను ప్రారంభించే సమయంలో ముందుగా తమిళనాడులో ఉన్న 'అమ్మక్యాంటీన్‌' పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలని అప్పటి మంత్రులను ఆయన అక్కడకు పంపించి అధ్యయనం చేయించి..రాష్ట్రంలో అంతకంటే నాణ్యత ఉండేలా 'అన్నక్యాంటీన్ల'ను ప్రారంభించారు. అయితే ఈ 'అన్నక్యాంటీన్ల'లో అవినీతి జరిగిందని 'జగన్‌' ప్రభుత్వం వాటిని మూసివేసింది. ఇక గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ సర్వీసులతో నింపాలనుకున్న 'బాబు' కలలు కూడా కల్లలు అయిపోయాయి. గతంలో 'చంద్రబాబు' ప్రభుత్వం ప్రారంభించిన ఒకే ఒక్క అంతర్జాతీయ సర్వీసు 'సింగపూర్‌' సర్వీసును 'జగన్‌' ప్రభుత్వం ఆపివేసింది. కృష్ణా నదిపై నిర్మించాలని తలపోసిన ఐకానిక్‌ బ్రిడ్జి అవసరం లేదని ప్రస్తుత ప్రభుత్వం తోసివేసింది. మెట్రో రైలు, మచిలీపట్నంపోర్టు, వైకుంఠపురం బ్యారేజ్‌, ఎన్టీఆర్‌ హౌసింగ్‌ వంటి చంద్రబాబు కార్యక్రమాలను ప్రస్తుత వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టేసింది. మొత్తం మీద..గత ఐదేళ్ల కాలంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ప్రారంభించి, రాజధానికి ఒక గుర్తింపు తేవాలనుకున్న 'చంద్రబాబు' కలలను 'వైకాపా' ప్రభుత్వం ఆదిలోనే తుంచివేసింది. ఆయన ప్రాజెక్టుల మొత్తాన్ని ఆపివేసి..తనదైన శైలిలో ముందుకు వెళుతోంది. 

(478)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ