WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పల్నాడు' ప్రాంత ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత...!?

గుంటూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన 'పల్నాడు'లోని ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారా...? అంటే అవుననే సమాధానం రాజకీయవర్గాల నుంచి వస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు...ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు సామంతరాజుల్లా వ్యవహరిస్తుండడం, ప్రజలతో సంబంధాలను నెరపక..స్వంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంలో నిమగ్నమవడం, అదే సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుండడం, అక్రమ ఇసుక రవాణా, అభివృద్ధి పనుల్లో వాటాలు...ఇతర వ్యవహారాల్లో తల దూర్చడం వంటి పనులతో వీరు ప్రజా మద్దతును వేగంగా కోల్పోతున్నారనే మాట వినిపిస్తోంది. పల్నాడు ప్రాంతంతో నర్సరావుపేట,వినుకొండ,మాచర్ల,గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజక వర్గాలు ఉన్నాయి. దీనిలో నాలుగు నియోజకవర్గాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉండగా...రెండు చోట్ల ప్రతిపక్షానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రజల నుంచి వ్యతిరేకతనే ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉండడం సహజం అనుకుంటుంటే... వారితో పాటు..ప్రతిపక్ష ఎమ్మెల్యేలపైనా...ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దీనితో...రెండు పార్టీల ప్రజాప్రతినిధులు..ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

  పార్టీల వారీగా...చూసుకుంటే...ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...టిడిపి తన నాలుగు సీట్లను నిలబెట్టుకునే పరిస్థితిలోనే ఉంది. అయితే...అది ఎమ్మెల్యేల పనితీరుతో మాత్రం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రజలకు ఉన్న విశ్వాసం వల్లే..మళ్లీ ఆ సీట్లను టిడిపి గెలిచే పరిస్థితి ఉంది. ప్రస్తుతం  టిడిపి ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లల్లో ఒకటి కోల్పోతే...ప్రతిపక్ష వైకాపా ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లల్లో ఒకటి టిడిపి గెలవగలదు. అంటే..దాదాపుగా ప్రస్తుతం ఉన్న బలాలు మార్పేమీ ఉండదు. కానీ...ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వ్యవహరిస్తున్న తీరుపై సగటు ప్రజలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలపై ఈ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అదే సమయంలో 'చంద్రబాబు' ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమపథకాలు వందశాతం అమలు జరగడం, అభివృద్ధి పథకాలు శరవేగంతో పూర్తి అవుతుండడంతో...'చంద్రబాబు'పై ప్రజలు అభిమానం వ్యక్తం చేస్తూనే...స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తి వల్లే...ప్రస్తుతం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ సభలకు 'జనం' విరగబడుతున్నారు. వైకాపా నాయకులు భారీ ఎత్తున నిధులు ఖర్చుచేసి ప్రజలను తరలిస్తున్నారని టిడిపి నేతలు ప్రచారం నిర్వహిస్తున్నా...ఆ సభల్లో 'జగన్‌' పేలుస్తోన్న డైలాగ్‌లకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుందనేది కాదనలేని నిజం.

  గత నాలుగేళ్లుగా...అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు...చేస్తోన్న అరాచకాలకు...నిరసనగానే...ప్రజలు ఈ సభలకు వస్తున్నారని, స్పందిస్తున్నారని వైకాపా నేతలు చెప్పుకుంటున్నారు. వారు చెప్పిన దాంట్లో నిజం ఉందో లేదో..కానీ...అధికార మదంతో...అధికారపార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును మాత్రం ప్రజలు ఎండగడుతున్నారు. నియోజకవర్గాల్లో...ఎమ్మెల్యేలు సామంతరాజులుగా వ్యవహరిస్తున్నారనే మాటను ఎవరూ కాదనడం లేదు. ఎవరికి వారు బౌండరీలు గీసుకుని...తమ పరిధిలోకి ఎవరూ రావద్దని...అనధికార నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఇసుక, బియ్యం అక్రమ రవాణాలు, అభివృద్ధి పనుల్లో వాటాలు...క్లబ్‌లు...ఇతర వ్యాపారాలతో ప్రజాప్రతినిధులు తీరక లేకుండా ఉంటే..కింది స్థాయి అధికారపార్టీ నాయకులు..ఎవరికి వారు దోపిడీకి పాల్పడుతున్నారు. వారిని అడిగే నాధుడే లేకపోవడంతో..వారి ఆగడాలకు హద్దే లేకుండాపోయింది. అంతే కాకుండా కొంత మంది ఎమ్మెల్యేలు అనైతిక సంబంధాలు పెట్టుకుని...పెత్తనాన్ని తమకు ఇష్టమైన వారికి అప్పగించి చోద్యం చూస్తున్నారనే మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఆ మాటలు విని కూడా విననట్లు సదరు నేతలు వ్యవహరిస్తున్నారు.

   నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నీరు వచ్చినా...ప్రభుత్వం ఈ ప్రాంతంలో సాగునీరు ఇవ్వలేకపోయింది. గత నాలుగేళ్ల నుంచి..పంటలు లేక...నానా ఇబ్బందులు పడుతున్న రైతాంగం...నీరు వచ్చినా..ఇవ్వడం లేదని ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. చదువుకున్న యువతకు ఉపాధి లేక...బెంగుళూరు,హైదరాబాద్‌, చెన్నై నగరాలకు వలసలు వెళుతున్నారు. యువతకు ఉపాధి చూపాల్సిన నాయకత్వం అదేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. విభజన తరువాత...రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యల్లో నూతన సంస్థలు, ఇతర విద్యాసంస్థలు నెలకొల్పుతున్నా...'పల్నాడు' ప్రాంతంలో మాత్రం చెప్పుకోదగిన ఒక్క ప్రాజెక్టూ రాలేదు. ఈ ప్రాంతానికి చెందిన నేతలంతా గుంటూరు,విజయవాడ,హైదరాబాద్‌ల్లో స్థిరపడి..ఇక్కడ ఉండేవారిని పట్టించుకోవడం లేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఒకవైపు కరువు...మరోవైపు ఉపాధి లేక..ప్రజలు హైదరాబాద్‌ వంటి నగరాలకు వలసలు వెళుతున్నారు. దీన్నేమీ పట్టించుకోకుండా..ప్రజాప్రతినిధులు..తమ వ్యాపారాల్లో మునిగిపోయి...కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో తమకు అన్యాయం జరిగిందనే భావనతో...టిడిపిని ఎన్నుకుంటే..వీళ్లూ ఇదే రకంగా వ్యవహరిస్తున్నారని..వీరికి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతామని..ఆయా ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో...ఇప్పటికైనా సదరు నేతలు..తాత్కాలిక చర్యలను కట్టిపెట్టి...ధీర్ఘకాలంలో ప్రజలకు పనికి వచ్చే పనులు చేస్తే...ప్రజలు ఆదరిస్తారు..లేకుంటే...ఎన్నికల్లో వారి సత్తాను చాటుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. తస్మాత్‌...జాగ్రత్త...!?

(627)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ