WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కిమిడి'కి వైద్య,ఆరోగ్యశాఖ...!

ఇటీవలే వైద్య,ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న 'కామినేని శ్రీనివాస్‌, దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాణిక్యాలరావులు మంత్రి పదవుల నుంచి వైదొలిగిన నేపథ్యంలో దేవాదాయశాఖను డిప్యూటీసిఎం కృష్ణమూర్తికి కేటాయించిన విషయం విదితమే. అదే విధంగా వైద్య,ఆరోగ్యశాఖను ఎవరికి కేటాయిస్తారు..అని మంత్రులు..ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత మంత్రుల్లో చాలా మంది కన్నా సీనియర్‌ అయిన ఆంధ్రప్రదేశ్‌ టిడిపి అధ్యక్షులు మరియు ఇంధనశాఖ మంత్రి  కిమిడి కళా వెంకటరావుకు వైద్య,ఆరోగ్యశాఖను అప్పగించే అవకాశాలు ఉన్నాయని పలువురు మంత్రులు మీడియా వర్గాలతో వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ జీవితంలో నిజాయితీపరుడిగా..ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారో కానీ...అవినీతిపరుడిగా...అసమర్థుడిగా పేరు తెచ్చుకోలేదన్నది యధార్థం. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో పలుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు...రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. 

  1983,85,89,2004,2014లో విజయం సాధించిన కళావెంకటరావు 1994,2009 (ప్రజారాజ్యం) లో ఓడిపోయారు. రాజకీయంగా సౌమ్యుడిగా పేరున్నప్పటికీ..సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారనేవిమర్శలు ఉన్నాయి. 35ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కళా వెంకటరావుకు టిడిపి అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించినా..మంత్రి పదవి ఇచ్చి...కీలక ప్రాధాన్యత శాఖలు కేటాయించలేదని ఆయన అనుచరవర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంధనశాఖకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలన్నీ సిఎం, మంత్రివర్గమే తీసుకుంటుందనే విషయం అందరికీ తెలుసు. ఈ విషయంలో 'కళా' ఆవేదన చెందుతున్నారు. ఇంధనశాఖ అప్పగించడంపై 'కళా' ఆవేదన చెందారని సిఎం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాష్ట్రవైద్య,ఆరోగ్యశాఖను ఆయనకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఆ శాఖ తనకు దక్కుతుందని 'కళా' ఆశగా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు అనంతరం 'చంద్రబాబు' వైద్య,ఆరోగ్యశాఖను కళాకు కేటాయించడం ఖాయమని విశ్వసనీయవర్గాల అభిప్రాయం.

(225)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ