ఉత్తరాదివారికే సిఎస్ పోస్టు...!

డిసెంబర్ మాసాంతానికి ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ పదవీ విరమణ చేయనున్నారు. వాస్తవానికి ఆమె నాలుగు నెలల క్రితమే రిటైర్ అయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆమె పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట మూడు నెలలు..ఆ తరువాత మరో మూడు నెలలు మొత్తం ఆరు నెలల పాటు ఆమెకు పొడిగింపు లభించింది. దీంతో ఆమె ఈ ఏడాది చివరి రోజు వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. ఆమె తరువాత ఎవరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి లభిస్తుందనే దానిపై ఐఎఎస్, ఉన్నతాధికారవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పాలనాపరంగా ముఖ్యమంత్రి తరువాత..అత్యున్నత హోదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే. ప్రతి ఐఎఎస్ అధికారి సిఎస్‌గా రిటైర్ కావాలని కోరుకుంటారు. అటువంటి ఉన్నత పదవి కోసం ప్రస్తుతం పలువురు సీనియర్ ఐఎఎస్‌లు తమ తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఈసారి ఎవరికి ఆ పదవి దక్కినా..అది ఉత్తరాది వారికే దక్కుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ‘నీలం సహానీ’ తరువాత ఉన్న సీనియర్ ఐఎఎస్ అధికారులందరూ ఉత్తరాదివారే. ఆమె తరువాత ఆంధ్రా క్యాడర్లో ప్రకాశ్ సహానీ, సమీర్‌శర్మ,అభయ్త్రిపాఠీలు ఉన్నారు. వీరంతా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. వీరి తరువాత రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న ‘సతీష్‌చంద్ర,జె.వెంకటేశ్వర ప్రసాద్, నీరబ్‌కుమార్ ప్రసాద్, ఆదిత్యనాథ్‌దాస్, పూనం మాకొండయ్య, కరికావళవన్, తదితరులు ఉన్నారు. వీరిలో ఒక్క ‘వెంకటేశ్వర్ ప్రసాద్’ తప్ప మిగతా వారంతా ఉత్తరాది లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. పైన పేర్కొన్న అధికారుల్లో ‘సతీష్‌చంద్ర, నీరబ్‌కుమార్ ప్రసాద్, ఆధిత్యనాథ్‌దాస్’లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
గత టిడిపి హయాంలో సిఎంఒలో కీలకంగా వ్యవహరించిన ‘సతీష్‌చంద్ర’ వీరందరి కంటే సీనియర్. ఆయనను సిఎం జగన్ సిఎస్‌గా నియమించుకుంటారా..? లేదా అనే దానిపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. టిడిపి ప్రభుత్వ హయాంలో వైకాపా సీనియర్ నేత విజయసాయిరెడ్డి తమ ఎమ్మెల్యేలను ‘సతీష్‌చంద్ర, అప్పటి ఇంటిలిజెన్స్ ఐజి వెంకటేశ్వరరావు కలసి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి ఓడిపోయిన తరువాత చాలా కాలం పాటు ‘సతీష్’కు ఎటువంటి పోస్టు ఇవ్వలేదు. అయితే తరువాత కాలంలో సిఎం మనస్సు మార్చుకుని ‘సతీష్’కు కీలకమైన విద్యాశాఖను అప్పచెప్పారు. అప్పటి నుంచి ‘సతీష్‌చంద్ర’ను సిఎం విశ్వాసంలోకి తీసుకుంటున్నారంటున్నారు. ‘సతీష్‌చంద్ర’ను సిఎస్‌గా ‘జగన్’ తీసుకుంటే పాలనాపరంగా అది గొప్ప మలుపు అవుతుందనే అభిప్రాయం పలు వర్గాల నుంచి వస్తోంది. కాగా నీరబ్‌కుమార్, ఆధిత్యనాథ్దాస్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఆధిత్యనాథ్దాస్కు సిఎం జగన్ వద్ద ఎక్కువ పలుకుబడి ఉంది. ఆ రకంగా చూస్తే.‘దాస్’కు అవకాశాలు మెండుగా ఉన్నట్లే. మొత్తం మీద..చూస్తే..సీనియర్ అధికారుల్లో అందరూ ఉత్తరాదికి చెందిన వారే ఉండడంతో..వారికే మరోసారి సిఎస్ పోస్టు దక్కే అవకాశాలు ఉన్నాయి. పైన పేర్కొన్న నలుగురు అధికారుల్లో ముగ్గురు ఉత్తరాది వారు కాగా రాష్ట్రానికి చెందిన వారు వెంకటేశ్వరప్రసాద్ మాత్రమే. ఇటీవలే ఆయనను అప్రధానమైన పోస్టుకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ రకంగా చూస్తే..ఆయనను సిఎస్ పోస్టు కోసం పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఏ మాత్రం లేదు. ఏది ఏమైనా పరిస్థితు ప్రభావం వల్ల కానీ, లేక ఇతర కారణాల వల్ల కానీ..విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రేతర ఐఎఎస్‌లే ఎక్కువగా ఉన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఏడుగురు సిఎస్లుగా పనిచేస్తే వారిలో నలుగురు ఉత్తరాదికి చెందిన వారే. ‘ఠక్కర్, దినేష్‌కుమార్, పునీతా, నీలం సహానీ’లు ఉత్తరాదికి చెందిన వారు కాగా..ఐ.వై.ఆర్.కృష్ణారావు, అజయ్‌కల్లం’, ఎల్.వి.సుబ్రహ్మణ్యంలు తెలుగు ప్రాంతానికి చెందిన వారు.