నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభలు
నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన ఈ మహాసభలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి.
మహాసభల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులు షేక్ రియాజ్, ఎస్.ఎం. బాషా జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం “భారత రాజ్యాంగం – లౌకికవాదం ఎదుర్కొంటున్న సవాళ్లు” అనే అంశంపై రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో లౌకికత్వం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మత భేదాలకు అతీతంగా ప్రజలంతా ఏకమై లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. “మేము అందరివారిమే” అంటూ కేంద్ర ప్రభుత్వం విభజన రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. లౌకిక భారత నిర్మాణానికి అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఆవాజ్ ముందుండాలని పిలుపునిచ్చారు.
ఆవాజ్ ఆహ్వాన సంఘం అధ్యక్షులు విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నెల్లూరులో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో లౌకిక విలువలను పరిరక్షించే దిశగా ఈ మహాసభలలో చర్చలు జరగాలని ఆకాంక్షించారు.
ఈ ప్రారంభ సభలో ఆవాజ్ గౌరవాధ్యక్షులు డాక్టర్ రఫిక్, గౌరవ సలహాదారులు చాంతల జాషువా, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఖాజా రసూల్, రాష్ట్ర అధ్యక్షులు సుభహాన్, కార్యదర్శి ఎం.ఏ. చిష్టి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, ఆవాజ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ రషీద్, అధ్యక్షులు సయ్యద్ రఫీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆవాజ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.