పల్నాడు జడ్పీ పీఠం.. నాగోతు వెంకటలక్ష్మి సరోజకేనా?

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

చైర్‌పర్సన్ రేసులో ప్రముఖంగా సరోజ పేరు.. కుటుంబ రాజకీయ నేపథ్యం కలిసొచ్చేనా? టీడీపీ, బీజేపీ నేతలతో అనుబంధం.. కూటమి పెద్దల నిర్ణయంపై ఉత్కంఠపల్నాడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠకు త్వరలో తెరపడనుంది. ఈ నెల 20న చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ పదవిని ఆశిస్తున్న కూటమి నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే ఈ పోటీలో నకరికల్లు జడ్పీటీసీగా విజయం సాధించిన డాక్టర్ నాగోతు వెంకటలక్ష్మి సరోజ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెకు ఉన్న కుటుంబ రాజకీయ నేపథ్యం, వివిధ పార్టీల నాయకులతో ఉన్న పరిచయాలు, స్థానికంగా ఉన్న రాజకీయ సంబంధాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.పల్నాడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని ఓసీ మహిళకు కేటాయించడంతో ఈ పదవిని ఆశిస్తున్న మహిళా జడ్పీటీసీ సభ్యులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 28 జడ్పీటీసీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 25 స్థానాల్లో, జనసేన మూడు స్థానాల్లో విజయం సాధించింది. వైకాపాకు ఒక్క స్థానం కూడా దక్కలేదు. దీంతో చైర్‌పర్సన్ ఎంపిక పూర్తిగా కూటమి పార్టీల మధ్య చర్చలు, సామాజిక సమీకరణాలు, రాజకీయ సమన్వయంపై ఆధారపడి ఉంది. మరోవైపు జనసేన కూడా జిల్లాపరిషత్ చైర్మన్ పదవుల విషయంలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో పల్నాడు పీఠంపై ఆసక్తి పెరిగింది.ఈ పోటీలో డాక్టర్ నాగోతు వెంకటలక్ష్మి సరోజకు కుటుంబ రాజకీయ నేపథ్యం ఒక ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. ఆమె మామ నాగోతు శౌరయ్య తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. గతంలో నకరికల్లు మండల పరిషత్ అధ్యక్షుడిగా, తురకపాలెం గ్రామ సర్పంచిగా బాధ్యతలు నిర్వహించారు. స్థానిక సంస్థల వ్యవహారాలపై అనుభవం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. నకరికల్లు ప్రాంతం గతంలో నరసరావుపేట రాజకీయాలతో అనుబంధం కలిగి ఉండగా, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం సత్తెనపల్లి నియోజకవర్గంలో భాగమైంది. ఈ క్రమంలో రెండు ప్రాంతాల్లోనూ నాగోతు కుటుంబానికి రాజకీయ పరిచయాలు, బంధుత్వ సంబంధాలు ఉండటం డాక్టర్ సరోజ కు కలిసి వచ్చే అంశంగా

ఉంది.నాగోతు శౌరయ్యకు పార్టీ నాయకత్వంతో ఉన్న సంబంధాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. గుంటూరు బిషప్ ఛాగయ్య, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు డాక్టర్ సరోజ కు చైర్ పర్సన్ గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు డాక్టర్ సరోజ  తండ్రి నల్లబోతు వెంకట్రావుకు కూడా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. తొలుత తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఆయన అనంతరం బీజేపీలో చేరారు. ఉమ్మడి గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గతంలో కోడెల శివప్రసాదరావుతో కలిసి రాజకీయంగా పనిచేసిన నేపథ్యం కూడా ఆయనకు ఉంది.  తండ్రి, మామ ఇద్దరూ వేర్వేరు రాజకీయ బాధ్యతల్లో పనిచేసిన అనుభవం వెంకటలక్ష్మి సరోజకు కలిసి వచ్చే అంశంగా ఉంది.జడ్పీ చైర్‌పర్సన్ రేసులో మరో ముఖ్యమైన అంశం సామాజిక సమీకరణాలు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి ఎంపికలో ప్రాంతీయ, సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ గతంలో బీజేపీలో ఉన్న సమయంలో డాక్టర్ సరోజ తండ్రి  నల్లబోతు వెంకట్రావు బిజెపిలో కీలక బాధ్యతలు చేతలు నిర్వహించిన సందర్భంలో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు సరోజ కు కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు.ఇదిలా ఉంటే, ఇదే పదవిని ఆశిస్తున్న ఇతర మహిళా జడ్పీటీసీ సభ్యుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. పెదకూరపాడు నుంచి ఎన్నికైన నల్లపాటి దివ్య, కారంపూడి నుంచి ఎన్నికైన కొండపల్లి శివకుమారి, పిడుగురాళ్ల నుంచి ఎన్నికైన డాక్టర్ ఉన్నం దీపిక పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నల్లపాటి దివ్యకు తన నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మద్దతుగా ఉన్నట్లు సమాచారం. అలాగే ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా తమ ప్రాంతాల నుంచి ఎన్నికైన మహిళా జడ్పీటీసీలకు అవకాశం కల్పించాలని

పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.జనసేన పార్టీ కూడా పల్నాడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిపై ఆసక్తి చూపుతోంది. రాష్ట్రంలో తమ పార్టీకి కొన్ని జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు కేటాయించాలని జనసేన నాయకత్వం కోరుతున్న నేపథ్యంలో పల్నాడు పీఠాన్ని కూడా ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ముప్పాళ్ల జడ్పీటీసీ బొర్రా అనిత పేరు కూడా తెర మీదకు వచ్చింది. జనసేన ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్ ద్వారా తమ అభ్యర్థనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.ఇలా ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో అభ్యర్థి పేరు వినిపిస్తుండటంతో పల్నాడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎంపిక కూటమి పార్టీలకు కీలకంగా మారింది. తమ నియోజకవర్గానికి చెందిన వారికి ఈ పదవి దక్కితే జిల్లా పరిషత్ నిధులు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రాధాన్యం లభిస్తుందనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, పార్టీ పరిశీలకులు, స్థానిక ఎమ్మెల్యేల మధ్య జరిగే చర్చల అనంతరం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ నెల 20న జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో ఆశావహుల ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. జనసేనకు అవకాశం ఇవ్వాలా? తెలుగుదేశం పార్టీలోనే ఒకరిని ఎంపిక చేయాలా? అన్న అంశంపై కూటమి నాయకత్వం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.మొత్తంగా చూస్తే పల్నాడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి కోసం జరుగుతున్న పోటీలో డాక్టర్ నాగోతు వెంకటలక్ష్మి సరోజ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కుటుంబ రాజకీయ నేపథ్యం, రెండు పార్టీలతో ఉన్న అనుబంధాలు, స్థానిక నాయకులతో పరిచయాలు, జడ్పీటీసీగా సాధించిన అత్యధిక మెజారిటీ ఆమె అభ్యర్థిత్వానికి సంబంధించిన కలిసి వచ్చే అంశాలుగా మారాయి. కూటమి పార్టీల్లోని కొందరు నాయకులు కూడా ఆమె పేరును పరిశీలించాలని పార్టీ అధిష్టానాన్ని  కోరుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో పల్నాడు జడ్పీ పీఠం నాగోతు వెంకటలక్ష్మి సరోజను వరించనుందా? అన్న ఆసక్తి జిల్లాలో నెలకొంది.