“Love, Prayers and More”.. అమితాబ్ బచ్చన్ పోస్టు వెనుక అసలు అర్థం ఇదేనా?

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 83 ఏళ్ల వయస్సులోనూ వరుస సినిమాలు, టీవీ షోలు, సోషల్ మీడియా పోస్టులతో అభిమానులను అలరిస్తున్న బిగ్‌బీ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ముంబైలోని ప్రముఖ లీలావతి ఆస్పత్రిలో మే 16 నుంచి అమితాబ్ బచ్చన్ చికిత్స పొందుతున్నారన్న వార్తలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రముఖ సినీ విశ్లేషకుడు విక్కీ లాల్వానీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, “అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలి” అంటూ పోస్టు చేయడంతో ఈ వార్త మరింత వైరల్ అయింది. అయితే అమితాబ్ ఆస్పత్రిలో చేరడానికి గల కారణాలపై అధికారిక సమాచారం మాత్రం బయటకు రాలేదు. బాలీవుడ్‌కు చెందిన కొన్ని వర్గాలు మాత్రం ఇది కేవలం రొటీన్ మెడికల్ చెకప్ మాత్రమేనని చెబుతున్నాయి. కానీ అభిమానులు మాత్రం బిగ్‌బీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తల నడుమ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసిన క్రిప్టిక్ పోస్టులు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. బుధవారం తెల్లవారుజామున తన వ్యక్తిగత బ్లాగ్‌లో ఆయన హిందీలో ఒక తాత్విక వ్యాఖ్యను షేర్ చేశారు. “చీల్ జబ్ హోవే శాంత్ తో భయ్యా, తోతే బోలన్ సురు కరేన్” అంటూ రాసిన ఆయన, చివరగా “Love, Prayers and more” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యను అభిమానులు వివిధ కోణాల్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అంతేకాకుండా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో “Pilori - Badumba” అంటూ మరో చిన్న పోస్టు చేశారు. ఈ రెండు పోస్టుల అర్థం ఏమిటో తెలియక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. “అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేస్తే ముందుగా దాని అర్థం తెలుసుకోవడానికి గూగుల్‌లో వెతకాల్సిందే” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “మీ ఒక్క మాట వెనుక కూడా ఒక తాత్విక భావం ఉంటుంది” అంటూ మరో అభిమాని స్పందించాడు.

ఇంకొందరు అభిమానులు మాత్రం అమితాబ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, “సార్.. దయచేసి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోండి”, “త్వరగా కోలుకోవాలి” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అమితాబ్ బచ్చన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల ప్రేమ మరోసారి ఈ ఘటనతో స్పష్టమైంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లు, ట్వీట్లు, వ్యక్తిగత అభిప్రాయాలతో అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటారు. ఆయన చేసే ప్రతి పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం కూడా ఆయన పోస్టులపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే, గత ఏడాది ‘వెట్టయాన్’, ‘కల్కి 2898 AD’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అమితాబ్ బచ్చన్, ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ సీక్వెల్ షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. అలాగే భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జటాయువు పాత్రకు అమితాబ్ తన గాత్రాన్ని అందిస్తున్నట్లు సమాచారం.

వయస్సు పెరిగినా తన పని పట్ల అదే క్రమశిక్షణ, అదే ఎనర్జీతో ముందుకు సాగుతున్న అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంగా ఉండాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.