ఏపీలో సినీ రంగానికి కొత్త బోర్డు.. భరత్ భూషణ్ బాధ్యతలు
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) నూతన చైర్మన్గా పి. భరత్ భూషణ్, వైస్ చైర్మన్గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
నూతన చైర్మన్ పి. భరత్ భూషణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో సినిమా, టెలివిజన్, నాటక రంగాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో కళలు, సినిమా, నాటక రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కళల పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించామని చెప్పారు. నిలిచిపోయిన నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఒకప్పుడు విజయవాడ సినిమా పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా నిలిచిందని గుర్తుచేశారు. ఇప్పటికీ తెలుగు సినిమాల ఆదాయంలో 65 నుంచి 70 శాతం వరకు ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందన్నారు. షూటింగ్ అనుమతులు, పోలీస్ ప్రొటెక్షన్ వంటి అన్ని సేవలు ఒకేచోట లభించేలా “సింగిల్ విండో సిస్టమ్” అవసరమని సూచించారు.
డైరెక్టర్గా నియమితులైన హీరో సుమన్ తల్వార్ మాట్లాడుతూ.. విశాఖపట్నం, అరకు, నెల్లూరు వంటి ప్రాంతాలు షూటింగ్లకు ఎంతో అనుకూలమన్నారు. తెలుగు చిత్రాలతో పాటు ఇతర భాషల సినిమాలను కూడా ఏపీకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నటి ఝాన్సీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ను సినిమా రంగానికి “బాక్సాఫీస్ అన్నపూర్ణ”గా అభివర్ణించారు. అభిమానులు, థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అధికంగా ఏపీలోనే ఉన్నారని పేర్కొన్నారు.
సినీ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్త కార్యాచరణ రూపొందిస్తోందని, రాష్ట్రంలో స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ సదుపాయాల ఏర్పాటుకు సినీ ప్రముఖులు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.