ఏపీలో ఎండలు, మరోవైపు పిడుగులతో వర్షాల సూచన

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వచ్చే మూడు రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు. బయటకు వెళ్లే వారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకెళ్లాలని తెలిపారు.

ఆదివారం రాష్ట్రంలో ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, పశ్చిమగోదావరి జిల్లా తణుకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 47.3 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47.1 డిగ్రీలు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. మొత్తం 17 జిల్లాల పరిధిలోని 174 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఎండ ఉధృతి అధికంగా ఉందన్నారు.

సోమవారం 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. మంగళవారం పరిస్థితి మరింత తీవ్రమై 50 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 205 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.

మే 25న కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఎండ తీవ్రత దృష్ట్యా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని, గుండె, బీపీ, షుగర్ సమస్యలున్న వారు ఎండలో తిరగవద్దని హెచ్చరించారు.