ఇవేం సర్వేలు…!
ఎన్నికలకు మరో ఆరేడు నెలలు మాత్రమే సమయం ఉన్ననేపధ్యంలో రాజకీయపార్టీల్లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని టిడిపి, అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని అధికార వైకాపా విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా అన్ని రకాల యత్నాలను ఆయా పార్టీల అధినేతలు చేస్తున్నారు. అధికార వైకాపా తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, తాము అమలు చేసిన సంక్షేమపథకాలు తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. అయితే..వైకాపా సంక్షేమమంతా డొల్ల అని, వారిని రాష్ట్ర ప్రజలు తరిమికొడతారని ప్రతిపక్ష తెలుగుదేశం భావిస్తోంది. ఎన్నికల హోరు మొదలు కావడంతో రాజకీయపార్టీలు ప్రజలు ఏమనుకుంటున్నారు..? అనేదానిపై సర్వేలు చేయించుకుంటున్నాయి.
అన్ని రాజకీయపార్టీలు ఈ సర్వేలను ఆసరాగా చేసుకుని వ్యూహాలను రచించుకుంటున్నాయి. అయితే..ఇటీవల అధికారపార్టీ చేయించిన సర్వే రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలను అధికారవైకాపా కైవసం చేసుకుంటుందని ఆ సర్వే చెబుతోంది. దీనిపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. సొమ్ములు ఇచ్చి అధికారపార్టీ సర్వే చేయించుకుందని, దాన్ని ప్రజలు నమ్మడం లేదని ఆరోపిస్తోంది. వందల కోట్లు ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చి ఈ సర్వేలను అధికారపార్టీ వదులుతోందని, దీని వల్ల అధికారపార్టీకి ఒరిగేదేమీ లేదని వారు అంటున్నారు. మొత్తం మీద డబ్బులు తీసుకుని చేస్తోన్న సర్వేలను సగటు ఓటరు కూడా గుర్తిస్తున్నాడు. ఈ సర్వే ఎవరిది..? ఎవరు చేయించారు..? చేసిన వారి చరిత్ర అంతా వారు తెలుసుకుని నిజానిజాలు బేరీజు వేసుకుంటున్నారు.