చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన...!
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. చంద్రబాబు జైలుకు వెళ్లి దాదాపు 35 రోజులు గడవడంతో అక్కడ ఉన్న పరిస్థితులను తట్టుకోలేక అనారోగ్యానికి గురువుతున్నారనే వార్తలు పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత రాత్రి ఆయనకు అలర్జీ వచ్చిందని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఆయనకు ప్రభుత్వ డాక్టర్లు వైద్య చికిత్స చేస్తున్నారని ప్రకటించారు. అయితే ఈ రోజు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి, ఆయన కోడలు నారా బ్రాహ్మణిలు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటికే 5 కేజీలు బరువు తగ్గిపోయారని, ఇలా మరికొంత బరువును కోల్పొతే ఆయన కిడ్నీస్ దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు జైలులో సరైన చికిత్స అందించడం లేదని ఆయన భార్య నారా భువనేశ్వరి ఆరోపించారు. ప్రభుత్వం ఆయనకు మెరుగైన చికిత్సను అందించాలని ఆమె కోరారు. జైలులో అపరిశుభ్రమైన వాతావరణం ఉందని, దాని వల్ల చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతింటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా చంద్రబాబుకు ఈ రోజు అంగళ్ల కేసులో ముందస్తు బెయిల్ వచ్చింది. తనపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని చంద్రబాబు వేసిన పిటీషన్‌ను ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే ఈ కేసులో మూడు సార్లు వాదోపవాదనలు జరిగాయి. చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై నేడు మరోసారి వాదోపవాదనలు జరగనున్నాయి.