ఆ సర్వే ఫలితాలు వస్తేనే..తెలంగాణలో కింగ్ ఎవరో తేలేది...?
ఈరోజు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు ప్రకటించాయి. పోలింగ్ ముగిసిన తరువాత పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి. ఇలా విడుదల చేసిన సంస్థల్లో ఒకటి తప్ప అన్ని సంస్థలు కాంగ్రెసే గెలుస్తుందని తెలిపాయి. మరికొన్ని సంస్థలు మాత్రం హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. చాణక్య, ఆరా, జనకీబాత్, పీపుల్స్ ప్లస్, రేస్, సిఎన్ఎన్, పోల్‌స్టార్ట్, స్మార్ట్ పోల్, రిపబ్లిక్ టివి వంటి సంస్థలు కాంగ్రెస్ సాధారణ మెజార్టీ సాధిస్తుందని ప్రకటించాయి. కాంగ్రెస్‌కు 60-65 సీట్లు వస్తాయని అంచనా వేయగా, అధికార భారత రాష్ట్ర సమితికి 40 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. అయితే..విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందిన, అంచనాలను తప్పకుండా వచ్చే మైయాక్సిస్ సంస్థ దాని ఎగ్జిట్ ఫలితాలను మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఈ సంస్థ సర్వే అత్యంత ప్రమాణికం కనుక..వీళ్ల సర్వే కోసం తెలంగాణలో ఎదురుచూపులు మొదలయ్యాయి. దాని అద్భుతమైన ట్రాక్ రికార్డే ఎదురుచూపులకు కారణం. దాదాపు 10 సంస్థలు కాంగ్రెస్‌దే విజయమని చెప్పినా... MyAxis ఫలితాల కోసం తెలంగాణతో పాటు తెలుగు వారంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సంస్థ తాము తెలంగాణ ఎగ్జిట్ ఫలితాలను రేపు ప్రకటిస్తామని తెలిపింది. ఓటర్లు ఎవరికి ఓటు వేశారనే దానిపై ఇంకా విచారణ చేస్తున్నామని, 5.30 గంటల తరువాత ఇంకా లక్షల మంది క్యూలైన్లలో ఉన్నారని, వారంతా ఓటు వేసిన తరువాతే..తమ ఫలితాలను విడుదల చేస్తామని ఈ సంస్థ తెలిపింది. కాంగ్రెస్ గెలుపు లేదా హంగ్ సూచనలు ఉన్న పరిస్థితుల్లో MyAxis సంస్థ సర్వే ఫలితాలు వాటిలో ఏదో ఒకదానిని దృవీకరిస్తే..అదే ఆదివారం నాడు వచ్చే తుది ఫలితాలకు అనుగుణంగా ఉంటుందన్న భావన పెక్కుమందిలో ఉంది. ఆ సంస్థ రేపు తన ఫలితాలను విడుదల చేసిన తరువాతే..తెలంగాణ కింగ్ ఎవరో దాదాపుగా తేలిపోతుంది.