మద్యం విధానంపై సామాన్యుల్లో అసంతృప్తి...!
అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వం వారి అంచనాలను అందుకోలేకపోతోందన్న భావన వివిధ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇసుక, మద్యం విధానాల్లో ప్రభుత్వం ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేయలేకపోతోంది. ముఖ్యంగా మద్యం విషయంలో వినియోగదారులు చాలా అంచానాలు పెట్టుకున్నారు. అయితే..వారు ఆశించిన విధంగా నూతన మద్యం విధానం లేదని, ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం చేయలేకపోతుందని వారు విమర్శిస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం నాసిరకమైన మద్యాన్ని ఎక్కువరేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుందని, ఆన్‌లైన్ పేమెంట్ లేకుండా చేసిందని, పేదల రక్తాన్ని తాగుతున్నారని అప్పట్లో జగన్‌పై విమర్శలు, పలు ఆరోపణలు వచ్చాయి. జగన్ ప్రభుత్వంపై ముఖ్యంగా మద్యాన్ని వినియోగించేవారిలో తీవ్ర అసంతృప్తి ఉండేది. వారి అసంతృప్తిని వారు ఎన్నికల్లో గట్టిగానే చూపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే..మద్యాన్ని తక్కువ రేటుకు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదే విధంగా నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని కూడా ప్రకటించారు. అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలు అయినా..మద్యం విషయంలో ఇంకా పాతవిధానాలనే కొనసాగిస్తోంది.
ప్రవేట్ వ్యక్తులకు మద్యంషాపులను ఇవ్వడంతో అన్ని రకాల బ్రాండ్‌లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. అయితే..చంద్రబాబు హామీ ఇచ్చినట్లు మద్యం రేట్లు మాత్రం తగ్గడం లేదు. జగన్ ప్రభుత్వ హయాంలో ఉన్న రేట్లే ఇప్పుడూ అమలవుతున్నాయని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా రూ.99కే ఇస్తామన్న మద్యం షాపుల్లో విరివిగా లభించడం లేదు. దీంతో చంద్రబాబు తమకు కొత్తగా చేసింది ఏముందని మద్యం వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సామాన్య వినియోగదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారు వినియోగించే చీఫ్‌క్వాలిటీ మద్యం దొరకడం లేదనే ఆవేదన వారిలో ఉంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలను సవరిస్తామని చెప్పిన చంద్రబాబు ఇంత వరకూ దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇంకెప్పుడు ఆయన తీసుకుంటారో తెలియదని, ఇదంతా కాలక్షేపం వ్యవహారమన్నట్లు మద్యం వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వారు ఆశించిన విధంగా మద్యం రేట్లను తగ్గించడం, అదే సమయంలో రూ.99/- కే ఇస్తామన్న మద్యాన్ని విరివిగా లభ్యమైయ్యే విధంగా చర్యలుతీసుకుంటే వారిలో నెలకొన్న అసంతృప్తి తగ్గడానికి అవకాశం ఉంది. కాగా మధ్యతరగతి, ఎగువమధ్యతరగతి, ధనవంతులు మాత్రం మద్యం విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు ఆశించిన విధంగా క్వాలిటీ, బ్రాండెట్ మద్యం దొరకడంపై వారు ఆనందంగానే ఉన్నారు. గతంలో వీరంతా నాణ్యమైన మద్యం కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా వంటి రాష్ట్రాల నుంచి తెచ్చుకునేవారు. ఇప్పుడు వారికా బాధ లేదు. నాణ్యమైన మద్యం ఇక్కడే దొరుకుతుండడంతో..వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.