లేటెస్ట్

‘బాబు’ చేతికి బ్రహ్మాస్త్రం...!

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మరో పదిరోజులు మాత్రమే సమయం ఉన్న పరిస్థితిల్లో టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడి’ చేతికి బ్రహ్మాస్త్రం దొరికింది. మొన్నటికి మొన్న ఎన్నికల మేనిఫెస్టోతో అధికార వైకాపాకు చుక్కలు చూపించిన ‘చంద్రబాబు’కు ఇప్పుడు ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ అస్త్రం చిక్కింది. ఎప్పుడో 2019లో చేసిన ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ ఇప్పుడు డైనమేట్‌లాగా పేలుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా..దీనిపైనే చర్చ జరుగుతోంది. ప్రజల ఆస్తులకు సంబంధించి వైకాపా ప్రభుత్వం అమలులోకి తెచ్చిన చట్టంతో..ప్రజల భూములన్నీ ప్రభుత్వ చేతిలోకి వెళతాయని, ప్రజల భూములపై కానీ, ఆస్తులపై కానీ వారికి ఎటువంటి హక్కులు ఉండవని, ప్రభుత్వం నియమించిన మధ్యవర్తిత్వంతో భూముల వివాదాలను పరిష్కరించుకోవాలని, కోర్టులకు వెళ్లడానికి అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బొమ్మలను పట్టాదారు పాస్‌ పుస్తకాలపై ముద్రించడంతో..ఇక ఆ భూములన్నీ ‘జగన్‌’కే చెందుతాయని జరుగుతోన్న ప్రచారం ‘టిడిపి’ అధినేత ‘చంద్రబాబు’ చేతికి బ్రహ్మాస్త్రంలా చిక్కింది. ‘జగన్‌’ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటారనే ప్రచారానికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ సాగుతోంది.


వాస్తవానికి ‘జగన్‌’ ప్రభుత్వం ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ను ఎప్పటి నుంచో అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ప్రవేట్‌ భూములను కొలిచి సరిహద్దు రాళ్లు పాతించింది. సరిహద్దు రాళ్లపై కూడా ‘జగన్‌’ బొమ్మ వేసుకున్నారు. అదే విధంగా నూతనంగా ఇస్తోన్న పాస్‌పుస్తకాలపై ‘జగన్‌’ ఫోటోను ముద్రించి ఇస్తున్నారు. దీనిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా..‘జగన్‌’ భయంతో నోరు మెదపలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ‘కడప’లో ప్రచారం చేస్తోన్న ముఖ్యమంత్రి సతీమణి ‘భారతి’ ఆ ప్రాంతానికి చెందిన వైకాపా రైతు నిలదీయడంతో..ఒక్కసారిగా ఇది ఎన్నికల అంశంగా మారిపోయింది. ‘మా భూములపై మీ ఆయన ఫోటోలు ఏమిటి..? తరతరాలుగా మాపెద్దల నుంచి వస్తోన్న ఆస్తులపై మీ ఫోటోలు ఏమిటని ఆ రైతు అడిగిన ప్రశ్నతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. ఆయన ప్రశ్నించిన తరువాత ప్రతి ఊరిలో దీనిపై చర్చ సాగుతోంది. మన ఆస్తులపై అతని ఫోటో ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులపై ‘జగన్‌’ ఫోటో ఏమిటని కొందరు ప్రశ్నిస్తుండగా, కొత్తగా అమలులోకి వచ్చిన ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ వల్ల ఇకపై ఆస్తులు స్టాంఫ్‌ పేపర్లపై కాకుండా జిరాక్స్‌లు ఇస్తారని చెబుతుండడం ప్రజల్లో ఆందోళనకు కారణమైంది.


నిన్నమొన్నటి దాకా..దీనిపై పెద్దగా చర్చ లేదు కనుక..వైకాపా కూడా దీన్ని పట్టించుకోలేదు. ఎప్పుడైతే..దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొందో..నష్టనివారణకు వైకాపా ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే..ఒక్కసారిగా..వైకాపా ఈ విషయంలో ఆత్మరక్షణలో పడడంతో టిడిపి అధినేత ‘చంద్రబాబు’ దీన్ని అందిపుచ్చుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ను రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టేశారు. అంతే కాకుండా ఎన్నికల ప్రచారంలో దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ‘జగన్‌’ అధికారంలోకి వస్తే మీ ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండదని ప్రచారం చేస్తున్నారు. టిడిపి సోషల్‌ మీడియా కూడా దీన్ని అందిపుచ్చుకుని దీనిపై సోషల్‌ మీడియాను హోరెత్తిస్తోంది. దీంతో పోలింగ్‌కు ముందు వైకాపా ఆత్మరక్షణలో పడిపోయింది. నిన్న మొన్నటి వరకు అర్బన్‌ ప్రాంతాల్లో టిడిపికి పైచేయి ఉంటుందని, రూరల్‌ ఏరియాలో తమకు పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని, దాంతో స్వల్ప మెజార్టీతోనైనా అధికారంలోకి వస్తామనే ధీమా కొంత మంది వైకాపా పెద్దల్లో ఉండేది. అయితే..ఇప్పుడు ఈ ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’తో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ‘జగన్‌’పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఎకరం, రెండు లేక మూడు నాలుగైదు ఎకరాలు ఉన్న గ్రామీణ రైతులు, రైతుకూలీలు..దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆస్తులు లేకపోయినా..ఆత్మగౌరవంతో బతికే వీరు..తమ భూములు, ఆస్తులపై ‘జగన్‌’ ఫోటోలు ఏమిటని నిర్భయంగా ప్రశ్నిస్తూ ‘జగన్‌’ను ఎండగడుతున్నారు. దీన్ని ‘చంద్రబాబు’ బ్రహ్మాస్త్రంలా వాడు కుంటున్నారు. నిన్న మొన్నటి దాకా గెలుపుపై ఎంతో కొంత ఆశలు పెట్టుకున్న ‘వైకాపా’ నాయకుల ఆశలపై ‘జగన్‌’ బొమ్మ నీళ్లు జల్లింది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ