లేటెస్ట్

కాంగ్రెస్ గెలిచింది..కానీ...!

ఎగ్జిట్ పోల్ అంచ‌నాల ప్ర‌కార‌మే తెలంగాణాలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. మెజార్టీ మార్కును సునాయాసంగానే దాటింది. తెలంగాణ‌లోని రూర‌ల్ ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటూ..కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్ప‌జెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల‌ను వారు గ‌ట్టిగానే న‌మ్మారు. దాంతో..గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు ఎదురేలేకుండా పోయింది. అయితే హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలో మాత్రం ఆ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక‌పోవ‌డం ప‌రిశీల‌కుల‌ను ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌ను చేస్తోంది. ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఖ‌మ్మం వంటి జిల్లాల్లో దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసిన కాంగ్రెస్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్రాంతంలో పూర్తిగా చ‌తికిల‌ప‌డింది. ఒక్క‌టంటే ఒక్క సీటు ఆ పార్టీకి ఈ ప్రాంతంలో రాలేదంటే..ఆ పార్టీ ప‌రిస్థితి ఈ ప్రాంతంలో ఎలా ఉందో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇప్పుడు పార్టీ బ‌లా బ‌లా గురించి మాట్లాడినా ఉప‌యోగం ఏమీ ఉండ‌దు. అధికారానికి స‌రిప‌డా బ‌లాన్ని  ఆ పార్టీ సాధించింది. రేపు ముఖ్య‌మంత్రిగా పిసిసి అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. ఆ త‌రువాత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ, ఇత‌ర ప‌ద‌వుల పంప‌కాలు ఉంటాయి. అందంతా రొటీన్ వ్య‌వ‌హారం. అయితే..బొటా బొటి మెజార్టీ ఉన్న కాంగ్రెస్ ఐదేళ్ల ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌క‌ల‌దా..?  బిఆర్ ఎస్‌, బిజెపి,ఎంఐఎం వంటి పార్టీలు..కాంగ్రెస్‌ను అధికారంలో ఉండ‌డాన్ని స‌హిస్తాయా..? ఎందుకంటే..రాజ‌ధాని ప్రాంతమైన హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతంలో రాజ‌కీయంగా బ‌లంగా లేని కాంగ్రెస్ ఈ పార్టీల‌ను ఎన్ని ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురి చేస్తాయో..?  కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు రాజ‌కీయాలు, ముఖ్యమంత్రి ప‌ద‌విపై ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కుల ఆశ‌లు ఆ పార్టీని పూర్తి కాలం అధికారంలో ఉండేట‌ట్లు చేస్తాయా..? అంటే స‌మాధానం చెప్ప‌లేం. ఎందుకంటే ఇప్ప‌టికే భ‌ట్టి విక్ర‌మార్క‌, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌, మాజీ పిసిసి అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి వంటి వారు సిఎం ప‌ద‌వి కోసం కాచుకూర్చున్నారు. వీరిలో ఎవ‌రైనా క‌నీసం ఐదుగురు ఎమ్మెల్యేల‌ను త‌మ వైపు తిప్పుకొని తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్ నుంచి అధికారం వేరొక‌రిచేతికి మారిపోతుంది. 


అదే విధంగా రాజ‌కీయంగా అసెంబ్లీలో బిఆర్ ఎస్ వైపు నుంచి మ‌హామ‌హులు ఉన్నారు. హ‌రీష్‌రావు, కెటిఆర్‌, త‌ల‌సాని, దానం నాగేంద‌ర్‌, ప‌ద్మారావు,సునీతా ల‌క్ష్మారెడ్డి, స‌బితా, క‌డియం శ్రీ‌హ‌రి, జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి, వేముల ప్ర‌శాంత్‌రెడ్డి వంటి మ‌హామ‌హుల‌తో, అనుభ‌వ‌జ్ఞులు అసెంబ్లీలో అధికార‌పార్టీకి చుక్క‌లు చూపిస్తారు. నిజానికి అధికారంలో కంటే..ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే బిఆర్ ఎస్ దూకుడుగా పోరాడుతుంది. ఆ విధంగా చూసుకుంటే..పెద్ద‌గా అనుభ‌వం లేని వారితో ఏర్పాటు కానున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వీరితో చికాకులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఇదంతా ఒకెత్తు అయితే..కాంగ్రెస్‌లోని అసంతృప్తుల‌ను బుజ్జ‌గించ‌డం, వారిని బిఆర్ ఎస్ వ‌ల‌లోకి పోకుండా చూసుకోవ‌డం, గ‌ద్ద కోడిపిల్ల‌ల‌ను ఎత్తుకుపోకుండా ఎలా కావ‌లి కాస్తారో..అలా కాంగ్రెస్ ఎమ్మెల‌కు కాపాలా కాయాల్సి ఉంటుంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో పాల‌నా వ్య‌వ‌హారాల్లో చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌డం, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డం క‌ష్ట సాధ్య‌మైన ప‌నులే..ముందే అప‌శ‌కునాల‌ని కాకుండా వ‌చ్చే స‌మ‌స్య‌లు ఇవ‌ని చెప్ప‌డ‌మే ఇక్క‌డ ఉద్దేశ్యం. అంతే కాకుండా గ‌త తొమ్మిదిన్న‌ర సంవ‌త్స‌రాల కెసిఆర్ పాల‌న‌లో రాష్ట్ర ఆర్ధిక‌ప‌రిస్థితిపూర్తిగా క్షీణించింది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో మిగులు బ‌డ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్ప‌గా మారింది. ఈ ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల‌ను నెర‌వేర్చ‌డం, దాని కోసం ఆర్థిక వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చుకోవ‌డం ఇబ్బందిక‌ర‌మైన విష‌య‌మే. ఇదే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నుంచి ఎటువంటి ఆర్థిక స‌హాయం అందేప‌రిస్థితి కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఉండ‌దు. మొత్తం మీద‌..ఒక వైపు రాజ‌కీయ దాడులు, మ‌రో వైపు ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన బిఆర్ ఎస్ చేసే దాడుల‌ను ఎదుర్కొని పాల‌న చేయ‌డం కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి శ‌క్తికి మించిన ప‌నే. చూద్దాం..కాంగ్రెస్ ఏమి చేస్తుందో..? 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ