లేటెస్ట్

ఐ&పిఆర్‌ అధికారుల్లో వణుకు...!

అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా..ప్రవర్తించిన అధికారులు ఇప్పుడు వణికిపోతున్నారు. ప్రజా ధనాన్ని అప్పణంగా కొందరికి దోచిపెట్టడంలో ప్రముఖ పాత్రపోషించిన అధికారులు..ఇప్పుడు ఏమవుతుందోనన్న బెంగతో, ఎవరు రక్షిస్తారో..అంటూ దారులు వెతుక్కుంటున్నారు. అధికార పార్టీకి కార్యకర్తల్లా పనిచేసిన కొందరు సమాచారశాఖ అధికారులు వందల కోట్ల ప్రజాధనాన్ని అనర్హులకు ధారాదత్తం చేయడంపై అధికారంలోకి వచ్చిన పార్టీ విచారణ జరిపిస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. తెలంగాణ సమాచారశాఖలో గత తొమ్మిదన్నరేళ్ల నుంచి కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పత్రికలకు ప్రకటనలు విడుదల చేయడంలోనూ, యాడ్‌ ఏజెన్సీలకు, అవుట్‌డోర్‌ సంస్థలకు యాడ్‌ విడుదల చేయడంలో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, నాటి అధికారపార్టీకి చెందిన వారు..ఏమి చెబితే..అది చేశారని, అది ఇప్పుడు వారి నెత్తికి చుట్టుకుంటుందనే భయం వారిలో నెలకొంది. అదే విధంగా నిబంధలకు తూట్లు పొడిచి..దేశంలో మనుగడలో లేని వారపత్రికలు, ఆంగ్ల పత్రికలకు వేలం వెర్రిగా యాడ్స్‌ విడుదల చేశారు. కెసిఆర్‌ ప్రభుత్వంలో దాదాపుగా 2వేల కోట్ల రూపాయలకు పైగా ప్రకటనలు, అవుట్‌డోర్‌ యాడ్‌లు, ఇంకా ఇతరత్రా విడుదల చేసినట్లు స్పష్టం అవుతోంది. దీనిపై అప్పట్లోనే..కాంగ్రెస్‌ విచారణ జరిపిస్తామని ప్రకటించింది. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో..తమపై విచారణ జరిపిస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కంటే..తెలంగాణ ప్రభుత్వం యాడ్స్‌ విడుదలలో మెరుగ్గానే వ్యవహరించింది. అయితే..కొన్ని సంస్థలకు గంపగుత్తగా ప్రజాధనాన్ని ధారబోసిందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ సమాచారశాఖ కమీషనర్‌గా సుధీర్ఘకాలం పనిచేసిన ఐఏఎస్‌ అధికారిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయనే కాకుండా కింది స్థాయి అధికారులపై కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని కొందరు పాత్రికేయులు కోరుతున్నారు. అధికారాంతాన చూడాలి అయ్యవారి..అగచాట్లు అన్నట్లు ఇప్పుడు..అధికారులు తమ తలకు ఎక్కడ చుట్టుకుంటుందో అన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ