లేటెస్ట్

వైకాపాలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు...తిరిగి టిడిపిలోకి...!?

టిడిపి త‌రుపున గెలిచి చంద్ర‌బాబును దూషించి, వైకాపాలోకి వెళ్లిన టిడిపి ఎమ్మెల్యేలు మ‌ళ్లీ టిడిపి వైపు చూస్తున్నార‌ట‌. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టిడిపి ఘోర ఓట‌మి పాల‌యింది. ఆ పార్టీ కేవ‌లం 23 ఎమ్మెల్యే స్ధానాల‌ను మాత్ర‌మే గెలుచుకుంది. అయితే వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు అధికార వైకాపాకు మ‌ద్ద‌తు ప‌లికారు. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి, గుంటూరు-2 ఎమ్మెల్యే మ‌ద్దాల గిరి, విశాఖ‌ప‌ట్నం ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ లు వైకాపాకు మ‌ద్ద‌తు ప‌లికారు. వీరు కాకుండా మ‌రి కొంత మంది టిడిపి ఎమ్మెల్యేలు గ‌త‌ రెండేళ్ల నుంచి వైకాపాలోకి వెళ‌తార‌ని ప్ర‌చారం జ‌రిగినా చివ‌ర‌కు ఈ న‌లుగురు మాత్ర‌మే వైకాపాలోకి వెళ్లారు. అయితే ఇలా వెళ్లిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మళ్లీ టిడిపిలోకి రావాల‌ని ప్ర‌యత్నాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టిడిపి నుంచి వైకాపాలోకి వెళ్లిన వారి గురించి వైకాపా అధినేత జ‌గ‌న్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని, చేరిన రోజు మాత్ర‌మే ప‌లుక‌రించార‌ని, ఆ త‌రువాత అస‌లు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలోని వైకాపా నేత‌ల‌తో ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధినేత వారిని వారించ‌లేద‌ని, వారి నుంచి ఎన్నో అవ‌మానాలు ఎదురైనా ప‌ట్టించుకోలేద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు కావ‌డం లేద‌నే భావ‌న‌తో వారు..మ‌ళ్లీ స్వంత పార్టీ వైపు చూస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.  


ప్ర‌స్తుతం జ‌రుతుత‌న్న ప్ర‌చారం ప్ర‌కారం గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంలు మ‌ళ్లీ టిడిపిలోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌న్న‌వ‌రం శాస‌న‌స‌భ్యుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ తిరిగి టిడిపిలోకి రావ‌డానికి ప్ర‌యత్నాలు చేస్తున్నార‌ట‌. ఆయ‌న విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ రావుతో క‌లిశార‌ని, త‌న‌ను టిడిపిలోకి తీసుకోవాల‌ని, ఈ మేర‌కు టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడుతో మాట్లాడాల‌ని కోరిన‌ట్లు స‌మాచారం. అంతే కాకుండా గ‌న్న‌వ‌రం టిడిపి కార్య‌క‌ర్త‌ల‌ను క‌లిసి చ‌ర్చిస్తున్నార‌ట‌. తాను తెలియ‌క కొన్ని త‌ప్పులుచేశాన‌ని, పార్టీ మారి త‌ప్పు చేశాన‌ని, ఇప్పుడు మ‌ళ్లీ టిడిపిలోకి వ‌స్తాన‌ని, త‌న రాక‌కు అభ్యంత‌రం చెప్ప‌వ‌ద్ద‌ని వారిని కోరార‌ని తెలుస్తోంది. టిడిపి ఓడిపోయిన త‌రువాత వైకాపాలోకి వెళ్లిన తొలి ఎమ్మెల్యే వంశీ. ఆయ‌న పార్టీ మారిన‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో పెత్తనం ఇస్తామ‌ని, ఇన్ ఛార్జ్ ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పార‌ని, కానీ అవేవీ జ‌ర‌గ‌లేద‌ని, పైగా గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌పై పోటీ చేసి ఓడిపోయిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, దుట్టా వ‌ర్గాలు త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నా పార్టీ పెద్ద‌లు వారించ‌లేద‌ని వంశీ అసంతృప్తితో ఉన్నార‌ట‌. వైకాపా అధినేత‌లు త‌నపై వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు నిర‌స‌న‌గా, మ‌ళ్లీ స్వంత‌గూటికి చేరుకోవాల‌ని వంశీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వంశీతో పాటు క‌ర‌ణం కూడా పున‌రాలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. త‌న కుమారుడి రాజ‌కీయ భ‌వితవ్యంపై చంద్ర‌బాబు హామీ ఇస్తే ఆయ‌న కూడా వెన‌క్కువ‌స్తార‌ని అంటున్నారు. ఇక వాసుప‌ల్లి, మ‌ద్దాల‌గిరిలు మాత్రం వైకాపాతోనే కొన‌సాగాల‌ని భావిస్తున్నార‌ట‌. మొత్తం మీద టిడిపి నుంచి గెలిచి వైకాపాకు మ‌ద్ద‌తు ఇచ్చిన టిడిపి ఎమ్మెల్యేలు అధికార‌పార్టీపై ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న అసంతృప్తిని ముందే గ‌మ‌నించి మునిగిపోయే ప‌డ‌వ నుంచి దూకాల‌నుకుంటున్నార‌ట‌. అయితే వీరు మ‌ళ్లీ స్వంత గూటికి వ‌స్తే టిడిపి కార్య‌క‌ర్త‌లు సానుకూలంగా స్పందించ‌ర‌ని, వారిపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తార‌నే మాట టిడిపి వ‌ర్గాల ద్వారా వినిపిస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ