లేటెస్ట్

‘గల్లా’ స్థానంలో ‘లగడపాటి’...!

గుంటూరు పార్లమెంట్‌ సభ్యుడు ‘గల్లా జయదేవ్‌’ క్రియాశీలక రాజకీయాలకు గుడ్‌బై చెప్పనుండడంతో..ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్నలు టిడిపి కార్యకర్తల్లో, పార్టీ సానుభూతిపరుల్లో వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, ప్రధాని మోడీ కక్షపూరిత రాజకీయాలకు ‘గల్లా’ బలయ్యారనే భావన టిడిపిలో ఉంది. సుధీర్ఘ చరిత్ర కలిగిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ‘గల్లా’ రాజకీయజీవితం కక్ష రాజకీయాలకు బలి కావడం నిజంగా విషాదమే. సౌమ్యుడిగా, రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే, పేద ప్రజలకు సేవ చేయాలనే అంకుఠిత దీక్ష గలిగిన ‘గల్లా జయదేవ్‌’ ప్రస్తుత కక్షపూరిత రాజకీయాల్లో నిలవలేనని తెలిసి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని టిడిపి అధినేత ‘చంద్రబాబు’కు చెప్పారని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ‘గుంటూరు’ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. టిడిపి ఆవిర్భవించిన దగ్గర నుంచి ఇక్కడ పలుసార్లు టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. తొలి నుంచి కాంగ్రెస్‌కు పెట్టని కోటవలే ఉండే ఈ నియోజకవర్గంలో 1991లో టిడిపి తరుపున మైనార్టీ అభ్యర్థి ‘లాల్‌జాన్‌భాషా’ విజయం సాధించారు. ఆ తరువాత 1999లో ‘యంపర్ల వెంకటేశ్వరరావు’, 2014, 2019ల్లో ‘గల్లా జయదేవ్‌’లు గెలుపొందారు. అంతకు ముందు ఇక్కడ నుంచి ‘రాయపాటి సాంబశివరావు’ 1996,1998, 2004, 2009లో విజయం సాధించారు. నాలుగుసార్లు ‘రాయపాటి’, మూడుసార్లు ఆచార్య ఎన్‌.జి.రంగా, ఐదుసార్లు ‘కొత్త రఘురామయ్య’లు ఇక్కడ నుంచి గెలుపొందారు. 1957 నుంచి ఇక్కడ నుంచి (1991 తప్ప) ఏ పార్టీ తరుపున అయినా ‘కమ్మ’ సామాజికవర్గానికి చెందిన వారు మాత్రమే విజయం సాధించారు. ‘కమ్మ’ సామాజికవర్గానికి మంచి పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో మళ్లీ అదే సామాజికవర్గానికి చెందిన వారికే టిక్కెట్‌ వస్తుందనే భావన రాజకీయపరిశీలకుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టిడిపి తరుపున పలువురు పోటీ పడుతున్నారు. పలువురు రేసులో ఉన్నా ‘విజయవాడ’ మాజీ ఎంపి ‘లగడపాటి రాజగోపాల్‌’ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2014లో రాష్ట్ర విభజన తరువాత తాను క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన ‘లగడపాటి’ అన్నట్లే గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. అదే విధంగా రాజకీయాల్లోజోక్యం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని, గుంటూరు టిడిపి టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు. గత పదేళ్ల నుంచి ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికలప్పుడు మాత్రం సర్వేల పేరుతో హడావుడి చేశారు. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో ‘టిడిపి’ గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే ఆయన జోస్యం ఘోరంగా తారుమారైంది. ఇక అప్పటి నుంచి ఆయన రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన ‘గల్లా’ స్థానంలో ‘గుంటూరు’లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజం అవుతుందో త్వరలోనే తేలుతుంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ