లేటెస్ట్

‘నగరి’ వైకాపా అభ్యర్థి ‘చక్రపాణిరెడ్డి’...!?

ఇది నిజంగా సంచలన విషయమే...! మంత్రి రోజాకు టిక్కెట్‌ నిరాకరించి, పార్టీలో ఆమె ప్రత్యర్థి, శ్రీశైలం దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌ ‘రెడ్డివారి చక్రపాణిరెడ్డి’కి ఖాయమైందనే వార్తలు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నిజమైతే..నిజంగా ‘రోజా’ షాక్‌ తగిలిందనే చెప్పాలి. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, వారిలో కొందరికి సీటు నిరాకరించి, మరికొందరిని మరోచోటకు మారుస్తూ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల 11మందిని మార్చి సంచలనానికి తెరతీసిన, ఆయన మరో 65 మందికి స్థాన చలనం కానీ, లేక వారిలో కొందరికి సీటు నిరాకరించడం కానీ చేస్తారని ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది. అయితే..ఈ 65 మందిలో మంత్రి రోజా ఉన్నారని, ఆమెకు సీటు లేదని, ఆమె స్థానంలో ‘రెడ్డివారి చక్రపాణిరెడ్డి’ని అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మంత్రి రోజాకు వ్యతిరేకంగా ‘నగరి’లో ‘చక్రపాణిరెడ్డి’ ఒక గ్రూపు కట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి అండ ఉంది. మంత్రి రోజాకు వ్యతిరేకంగా ఆయనను ‘పెద్దిరెడ్డే’ ప్రోత్సహిస్తున్నారని, ఆయనను అడ్డుకోవాలని ‘రోజా’ పలుసార్లు ముఖ్యమంత్రి జగన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఫిర్యాదును ‘జగన్‌’ అసలు పట్టించుకోలేదు. దీంతో ఎంత అసంతృప్తి ఉన్నా ‘రోజా’ మౌనంగానే భరాయిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తన సీటుకే ఎసరు పెట్టడంతో ఆమె ఏమి చేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమెకు సీటు నిరాకరిస్తే ఆమె దారి ఎటు..వైపు..అనే ప్రశ్నలు ఆమె అనూయుల్లో నెలకొంది. వైకాపా సీటు నిరాకరిస్తే ఆమె రాజకీయంగా ఏటూ వెళ్లలేరని, ఆమె రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఆమెను టిడిపి కానీ జనసేన కానీ దగ్గరకు రానీయదని, గతంలో ఆయా పార్టీ అధినేతలపై, వారి కుటుంబ సభ్యులపై ‘రోజా’ ఇష్టారీతిన చేసిన వ్యాఖ్యలు ఆమెకు ఇప్పుడు ఏ దారీ లేకుండా చేశాయంటున్నారు.


వాస్తవానికి ఆమె టిడిపితోనే రాజకీయాల్లోకి అరంగ్రేటం చేశారు. సినీ హీరోయిన్‌గా ఆమె గ్లామర్‌ రాజకీయంగా ఆమెకు ప్లస్‌పాయింట్‌ అయింది. అంతే కాకుండా మంచి వాగ్ధాటి కలిగి ఉండడం, మొండిగా పోరాడటంతో రాజకీయంగా ఆమెకు మేలు చేసింది. అయితే..టిడిపిలో ఉండగా ఆమె రెండుసార్లు పోటీ చేసినా విజయం సాధించలేకపోయింది. దీంతో 2009కి ముందు కాంగ్రెస్‌లోకి వెళ్లాలని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరడానికి  సన్నాహాలు చేసుకుంది. అంతలోనే వై.ఎస్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంతో..ఆమె కాంగ్రెస్‌లో చేరిక ఆగిపోయింది. తరువాత జరిగిన పరిణామాల్లో   ‘జగన్‌’ పార్టీలో చేరింది. 2014లో ‘జగన్‌’ ఆమెను ‘నగరి’ నుంచి పోటీకి నిలబెట్టారు. అప్పట్లో టిడిపి సీనియర్‌ నేత ‘గాలి ముద్దుకృష్ణమనాయుడు’ చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఆమె అతి స్పల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆఖరి ఫలితం వచ్చే వరకూ ఆమెకు ఆమె గెలుపుపై నమ్మకం లేదు. చివరగా స్వల్ప ఓట్ల తేడాతో ఆమె నెగ్గిందని వార్తలు వచ్చిన వెంటనే..ఆమె భోరున విలపించారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె ఎప్పుడూ వివాదాలు చుట్టూనే తిరిగారు. ఆమె చేసిన కొన్ని అసందర్భ వ్యాఖ్యలపై అప్పటి సభాపతి ‘కోడెల శివప్రసాదరావు’ ఆమెను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. దీనిపై ఆమె కోర్టుకు వెళ్లినా ఆమెకు ఓదార్పు లభించలేదు. 2019లో వచ్చిన వైకాపా గాలిలో ఆమె ‘గాలి’ తనయుడు ‘భానుప్రకాష్‌’పై గెలుపొందారు.రెండోసారి గెలుపొందిన తరువాత మంత్రి పదవి వస్తుందని ఆమె ఆశించారు. అయితే...ఆమెకు మంత్రి పదవి రానీయకుండా ‘పెద్దిరెడ్డి’ అడ్డుపడడంతో కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవిని ‘జగన్‌’ ఇచ్చారు. ఆ తరువాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి దక్కిందనే ఆనందంతో ఆమె టిడిపి అధినేత ‘చంద్రబాబు’ ఆయన తనయుడు ‘లోకేష్‌’, జనసేన అధినేత ‘పవన్‌కళ్యాణ్‌’లపై అభ్యంతరకర విమర్శలు చేశారు. ఆమె చేసిన విమర్శలకు ఆయా పార్టీలు ప్రతివిమర్శలు చేయడం, నిత్యం దూషించుకోవడం నిత్యకృత్యమైంది. నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకుండా జబర్ధస్త్‌ ప్రోగ్రామ్‌లకు వెళ్లడం..ఆమె పట్ల ప్రజల్లో విమర్శలకు కారణమైంది. మొత్తం మీద..పదేళ్లపాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ‘రోజా’ రాజకీయ జీవితం, ఇప్పుడు టిక్కెట్‌ రాకపోతే..ముగిసిపోతుందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ