లేటెస్ట్

వైకాపా...నుంచి ‘అంబటి’ జంప్‌...!

మునిగిపోయే పడవ నుంచి ఒక్కొక్కరు జంప్‌ అవుతున్నారు. వాస్తవాలు తెలియని వారు వాస్తవాలు తెలుసుకుని జంప్‌ అవుతున్నారు. వైకాపా నుంచి జంపింగ్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా వారం రోజుల క్రితం పార్టీలో చేరిన క్రికెటర్‌ ‘అంబటి రాయుడు’ వైకాపాకు రాజీనామా చేశారు. వారమంటే వారం క్రితం వైకాపాలో చేరిన క్రికెటర్‌ ‘అంబటి’కి వాస్తవాలు ఏమిటో బోధపడ్డాయి. ఇక్కడ ఉంటే డకౌట్‌ తప్పదని...వైకాపా వద్దూ..రాజకీయాలు వద్దూ అంటూ కాడి కిందపడేశాడు. గత కొంత కాలంగా ‘అంబటి’వైకాపాలో చేరతారని, ఆయన గుంటూరు పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే..ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ‘ఆడుదాం..ఆంధ్రా’ కార్యక్రమం సందర్భంగా ఆయన వైకాపాలో చేరారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి  ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చూసేవారికి ఇదంతా రొటీన్‌ వ్యవహారంలానే అనిపించింది. ఎందుకంటే..ఎప్పుడో నిర్ణహించిన కార్యక్రమం..పైగా అందరూ ఊహించిందే..కనుక...! అయితే..ఎవరూ ఊహించని విధంగా ‘అంబటి’ రాజీనామాను ప్రకటించడం...అదీ పార్టీలో చేరిన వారం రోజులకే..అవడం..వైకాపా వర్గాలను నివ్వెరపరుస్తోంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా క్రికెటర్‌గా తెలిసిన ‘అంబటి రాయుడు’ వైకాపాను ఎంచుకోవడం ఆయన అభిమానుల్లో ఎక్కువ మందికి నచ్చలేదు. మంచి పేరున్న వ్యక్తి..అవినీతి మలికి అంటిన ‘జగన్‌’ను ఎందుకు ఎంచుకున్నారా..? అనే భావన వారిలో ఉంది. అయితే..అది ‘అంబటి’ వ్యక్తిగత నిర్ణయం కనుక...వారేమీ అనలేకపోయారు. అయితే..‘జగన్‌’ మాత్రం ‘అంబటి’ని ఎంచుకోవడం వెనుక కుల రాజకీయాలు చేయాలనే భావనే ఉందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.


‘జగన్‌’ ‘అంబటి’కు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారనే దానిపై ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. అప్పట్లో  బీసీసీఐ సెలెక్టర్‌గా ఉన్న ‘ఎంఎస్‌కె ప్రసాద్‌’ 2019 వన్డే వరల్డ్‌కప్‌కు ‘అంబటి’ని ఎంపిక చేయలేదు. ‘అంబటి’ కాపు కులానికి చెందిన వాడు కనుకనే..ఆయనను ‘కమ్మ’ కులానికి చెందిన ‘ఎంఎస్‌కె ప్రసాద్‌’ ఎంపిక చేయలేదనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌ఛల్‌ చేశాయి. దీన్ని వైకాపాకు చెందిన వారే..ప్రచారం చేశారు. కావాలనే..కాపులకు..కమ్మలకు మధ్య చిచ్చుపెట్టాలనే ధ్యేయంతో ఆ వర్గాలు అప్పట్లో దాని భారీగా ప్రచారం చేశాయి. చాలా మంది ఈ అందమైన అబద్దాన్ని నమ్మారు. దీనిపై అప్పట్లో ‘రాయుడు’కూడా..నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. దీంతో..అది నిజమేననే భావన చాలా మందిలో వ్యక్తం అయింది. ‘కమ్మ, కాపుల మధ్య వైరం సృష్టించే వార్తలను క్యాష్‌ చేసుకోవడంలో సిద్ధహస్తులైన వైకాపా అప్పటి నుంచి ‘అంబటి’ దువ్వుతూనే..ఉంది. అవసరం ఉన్నా..లేకున్నా ముఖ్యమంత్రిని ‘అంబటి’తో పొగిడిరచే కార్యక్రమం చేసుకుంటూ..ఆయనను అప్పుడప్పుడు కలిపిస్తూ...వైకాపాకు మరింత దగ్గరకు చేర్చి చివరకు పార్టీలో చేర్చింది. గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో టిడిపి ‘కమ్మ’ను నిలబెడుతుంది..కనుక..తాను ‘కాపు’ను నిలబెట్టి..గతంలో తాము ప్రచారం చేసిన..‘ఎంఎస్‌కె ప్రసాద్‌..అంబటి’ స్టోరీని మరోసారి కాపులకు గుర్తు చేసి..వారి ఓట్లను గంపగుత్తగా పొందాలనే ఆలోచనతో..‘అంబటి’ని దించారు. అంతా అనుకున్న విధంగా జరుగుతూన్న పరిస్థితుల్లో..ఇప్పుడు ఎన్నికల ఖర్చు వ్యవహారం..తెరమీదకు రావడం..ఒక్కో ఎంపి అభ్యర్థి వంద నుంచి నూటయాభై కోట్లు ఖర్చు పెట్టాలనే షరతు వైకాపా పెద్దలు విధించడంతో..‘అంబటి’ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ‘అంబటి’ అంత పెత్తమొత్తం ఇవ్వడానికి వెనుకా ముందాడుతుండడంతో..వైకాపా పెద్దలు ‘నర్సరావుపేట’ ఎంపి ‘కృష్ణదేవరాయల’ను రంగంలోకి దించారు. దీంతో..‘అంబటి’కి చిర్రెత్తి...రాజీనామా చేస్తున్నాని ప్రకటించేశారు. ఇదే కాక గత మూడు నెలల నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తోన్న ‘అంబటి’కి వైకాపా పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత అర్థమైంది. దీంతో..అరంగ్రేటంలోనే ఘోరంగా ఓడిపోవడమెందుకని...ముందే...పార్టీ నుంచి రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లు ప్రకటించారు. మొత్తం మీద..క్రికెట్‌లో ఎంతో..ప్రతిభ ఉన్న..‘రాయుడు’ కొన్ని అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుని (అప్పట్లో ఆయన ఐసిఎల్‌లో పాల్గొని..బిసీసిఐ అనర్హతకు గురయ్యారు..తరువాత..బీసీసీఐ అనర్హతను ఎత్తేసింది) ..క్రికెట్‌లో..రావాల్సిన పేరు రాకుండా చేసుకున్నారు. తరువాత తప్పులు దిద్దుకున్నా..అప్పటికే..జరగాల్సిన నష్టం ఆయనకు జరిగిపోయింది. అయితే..క్రికెట్‌లో చేసిన తప్పులను రాజకీయాల్లో చేస్తున్నారేమో..అని అనిపించినా..ఇప్పుడు తెలివిగా..తప్పుకుని..రాజకీయంగా..భారీగా నష్టపోకుండా..తనను తాను కాపాడుకున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ