లక్ష ఓట్లు కొంటే..విజయం మనదే...!
రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే....సొమ్ముల పంపిణీ జరుగుతోంది. అధికార వైకాపా ఈ విషయంలో ముందుంది. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసే వైకాపా అభ్యర్ధులు ఇంటికింత అని ముందుగా టోకెన్ అడ్వాన్స్ పంచుతున్నారు. ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో ఈ పంచుడు కార్యక్రమం మొదలైంది. ముందుగా ఒక్కో ఇంటికి రూ.10వేల చొప్పున పంచుకుంటూ పోతున్నారు. ముందుగా తమకు అనుకూలంగా ఓటు వేస్తారని భావిస్తున్నవారికి సొమ్ములు పంచుతున్నారు. కొందరికి రూ.15వేల రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్లు, మరి కొందరికి అదే విలువ చేసే ఇంటి పరికరాలు అందచేస్తున్నారు. ముందుగా వాలంటీర్ల చేత..ఎవరు మనకు అనుకూలం..అనే లిస్టు తెప్పించుకుని వారి ద్వారానే పంపకాల కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని ఆ ఇంటిలో ఎన్ని ఓట్లు ఉన్నాయో..తెల్చుకుని వారికి నగదు రూపేణా పంపకాలు చేపడుతున్నారు. నగదు వద్దన్న వారికి అదే విలువ కలిగిన వస్తువులను పంపిణీ చేస్తున్నారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, గుంటూరు-2, వినుకొండ, నర్సరావుపేట, మాచర్ల, తదితర నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి కుట్టు మిషన్లు పంచుతామని ప్రచారం ప్రారంభించారు. దీనిలోభాగంగా వాలంటీర్ల చేత ఆయా ఇళ్లలోని మహిళల ఆధార్ కార్డులను తీసుకుంటున్నారు. వారికి ప్రభుత్వం కుట్టు మిషన్లు ఇస్తుందని, తీసుకోవాలని కోరుతున్నారు. కాగా మరికొన్ని ప్రాంతాల్లో ఓట్లు ఎక్కువగా ఉన్న ఇళ్లలోని వారికి ఏసీలు ఇస్తామని చెబుతున్నారు. ఇంటికి ఐదు కానీ ఆరు కానీ ఓట్లు ఉంటే..ఏసీలు ఇస్తామంటూ ఊరిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద..ఇదే విధంగా పంపిణీ కార్యక్రమాలు జోరందుకున్నాయి.
గరిష్టంగా ఓటుకు ఐదువేలు...!
ఒక్కో ఓటుకు గరిష్టంగా ఐదువేల చొప్పున ఇవ్వాలని అధికారపార్టీ నిర్ణయించుకుని ఆమేరకు పంపకాలు చేపడుతోంది. తమ భవిష్యత్ ఈ ఎన్నికలపై ఆధాపడి ఉందని, ఒకవేళ ఓడిపోతే రాజకీయంగా, వ్యక్తిగతంగా గడ్డు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భావనతో ఎంత సొమ్ము అయినా వెచ్చించడానికి వీరు సిద్ధపడుతున్నారు. నియోజకవర్గానికి సగటున 2 లక్షలు ఓట్లు ఉంటాయి. వాటిలో కనీసం లక్ష ఓట్లను ముందుగానే కొనుగోలు చేయాలని వీరు ఆరాటపడుతున్నారు. లక్ష ఓట్లకు ఐదువేల చొప్పున రూ.25కోట్లు ముందుగా ఖర్చుపెడుతున్నారు. ముందుగా చెల్లించిన సొమ్మే కాకుండా పోలింగ్ రోజున మరికొంత చెల్లిస్తామని వీరు..ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఇలా ఓటర్లకు నేరుగా ఈ సొమ్ము పంచాలని పార్టీ పెద్దల నుంచి వారికి ఆదేశాలు వచ్చాయి. ఎన్నికల్లో గెలవాలంటే నియోజకవర్గానికి కనీసం రూ.100కోట్లు ఖర్చుపెట్టాలని , గత ఐదేళ్లలో సంపాదించిన సొమ్ములో ఇది కనీసం 5శాతానికి మించదని, దీన్ని ఖర్చు చేయాలని అధిష్టానం ఖరాఖండిగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదో విధంగా మరోసారి గెలిస్తే, ఇప్పుడు ఖర్చు చేసిన దాన్ని నెలరోజుల్లో సంపాదించుకోవచ్చు అనే భావన వారిలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఈ ఓట్ల కొనుగోలు పథకం జోరుగా సాగుతోంది. అధికారపక్షం చేస్తోన్న ఖర్చు చూసి ప్రతిపక్ష కూటమి కళ్లు తేలేస్తోంది. ముఖ్యంగా జనసేన నుంచి పోటీ చేసేవారు..ఈ ఖర్చును చూసి ముందుగానే బెదిరిపోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉన్నా ఓటర్లకు డబ్బు పంచకపోతే తాము వెనుకబడిపోతామన్న భావనతో ప్రతిపక్ష టిడిపి కూడా సొమ్ములు ఖర్చు చేయడానికి ముందుకు వస్తోంది. మొత్తం మీద..ఐదేళ్ల పాలనపై కాకుండా సొమ్ములు, దౌర్జన్యాలతో గెలవాలని అధికారపార్టీ నిర్ణయించుకుంది.