ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలులో ‘మెఘా’ టాప్...!
వైకాపా, బిఆర్ ఎస్‌లకే ఎక్కువ లబ్ది రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన కంపెనీల్లో ‘మెఘా ఇంజనీరింగ్’ కంపెనీ దేశవ్యాప్తంగా రెండోస్థానంలో ఉన్నది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంస్థ వివిధ పార్టీలకు దాదాపు రూ.980కోట్లు ఇచ్చినట్లు ఎస్‌బీఐ సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన వివరాలను నేడు ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీని ప్రకారం..ఎవరు ఎన్ని బాండ్లు కొనుగోలు చేశారు..ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే దాన్ని ఎస్‌బీఐ తెలియచేసింది. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల్లో ‘ప్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ (లాటరీ మార్టిన్) రూ.1368కోట్లతో అందరి కన్నా ముందుంది. దీని తరువాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ‘మెఘా’ కంపెనీ రెండోస్థానాన్ని ఆక్రమించింది. తెలుగు రాష్ట్రాల్లో పలు కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను ఈ సంస్థ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం, తెలంగాణలోని ‘కాళేశ్వరం’ ప్రాజెక్టులను ఈ సంస్థ ఆధ్వర్యంలో జరిగాయి. 2019 ఎన్నికలకు ముందు ఈ సంస్థ నుంచి అప్పటి అధికారపార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి భారీగా ఎలక్టోరల్‌బాండ్ల రూపంలో నిధులు వచ్చాయి. అదే విధంగా తెలంగాణలోని అప్పటి అధికారపార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా నిధులను భారీగా ఈ సంస్థ ఇచ్చింది. ఈ సంస్థ చేపట్టిన పనుల్లో నాణ్యత లేదని, ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు అప్పచెప్పి ఈ సంస్థ పలు పనులను సాధించుకుందనే ఆరోపణలు అప్పట్లో భారీగా వచ్చాయి. 2019 ఏప్రిల్, మే నెలల్లో ఈ సంస్థ భారీగా ఎలక్ట్రోలర్ బాండ్లను వివిధ పార్టీల నుంచి కొనుగోలు చేసింది. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తరువాత కూడా ఈ సంస్థ భారీగా బాండ్లను కొనుగోలు చేసింది. 2021 ఏప్రిల్‌లో అంటే ‘జగన్’ ప్రభుత్వం ‘పోలవరం’ రివర్స్ టెండరింగ్‌చేపట్టిన సమయంలో ‘మెఘా’ బాండ్ల కొనుగోలు చేసింది. ఆ తరువాత 5 అక్టోబర్ 2021న రూ.22 కోట్లు, 6 అక్టోబర్ 2021న రూ.24 కోట్లు, అదే సంవత్సరం అక్టోబర్ 8న మరో రూ.50కోట్లకు బాండ్లు కొనుగోలు చేసింది. జనవరి7, 2022న ఈ సంస్థ రూ.75కోట్లు విలువగల బాండ్లను కొనుగోలు చేసింది. 7 ఏప్రిల్ 2022న మరో రూ.22కోట్లు, జూలై5 2022న మరో రూ.25కోట్లు, 8 జూలై, 2022న మరో రూ.25కోట్లు, అదే సంవత్సరం 10అక్టోబర్‌న రూ.10కోట్లు విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. 12 డిసెంబర్ 2022న రూ.60కోట్లు నిధులను వివిధ రాజకీయపార్టీలకు ఇచ్చింది. అదే విధంగా 2023 జనవరి 27న ఈ సంస్థ మరో రూ.45కోట్లు, అదే సంవత్సరం 11 ఏప్రిల్ 2023న రూ.120కోట్లు, అదే సంవత్సరం జూలై 12న రూ.70కోట్లు, 11 అక్టోబర్ 2023న మరో రూ.50కోట్లు, 12 అక్టోబర్‌న మరో రూ.100కోట్లు విలువైన బాండ్లను ‘మెఘా’ సంస్థ వివిధ రాజకీయపార్టీల నుంచి కొనుగోలు చేసింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రోర్ బాండ్లను ఈ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సంస్థ కొనుగోలు చేసిన బాండ్లల్లో ఎక్కువ శాతం వైకాపా అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అటు తెలంగాణలో ‘కెసిఆర్’ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ‘జగన్’ ప్రభుత్వాల్లో వివిధ పనులు చేసిన ఈ సంస్థ దానికి ప్రతిఫలంగా ఆయా రాజకీయ పార్టీలకు భారీగా నిధులను సమకూర్చినట్లు ఈ నివేదిక ద్వారా స్పష్టం అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సంస్థ ఆ పార్టీకి భారీగా నిధులను ఇచ్చింది. అయితే ‘కెసిఆర్, జగన్, బిజెపి’ పార్టీలకు భారీ మొత్తం నిధులను సమకూర్చి, తనకు కావాల్సిన కాంట్రాక్టులను ఈ సంస్థ దక్కించుకుంది.