టిడిపిలో ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహం…!
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్టు పరిణామాలు తెలుగుదేశం పార్టీలో తీవ్రకలకలం సృష్టించింది. ఎటువంటి మచ్చలేని తమ నేతను ఎవరూ ఏమీ చేయలేరని వారు మొదటి నుంచి నమ్ముతూ వచ్చారు. గత నాలుగున్నరేళ్ల నుంచి ఆయనను అటు కేంద్రపెద్దలు కానీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ ఏమీ చేయకపోవడంతో, ఆయనను వారేమీ చేయలేరని భావించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని, అలా చేసి ఉంటే, జగన్ ఏప్పుడో ఆయనను జైలుకు పంపించేవారనే అభిప్రాయంతో వారు ఉన్నారు. చంద్రబాబు అరెస్టుకు ముందు తనను అరెస్టు చేస్తారని చంద్రబాబే బయటకు చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వం అటువంటి పనిచేయలేదని ఎక్కువ మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు భావించారు. అయితే చంద్రబాబు అరెస్టు తరువాత జరుగుతోన్న పరిణామాలపై వారు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును అర్థరాత్రి పూట అక్రమంగా అరెస్టు చేయడం దగ్గర నుంచి, ఆయనకు రిమాండ్ విధించడం, తరువాత ఏసీబీ కోర్టు, హైకోర్టుల్లో వేసిన క్వాష్ పిటీషన్లు కొట్టివేయడంతో వారంతా ఒక్కసారిగా దిగాలు చెందారు. మొదట ఆయనను అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరిలించినప్పుడు ఆయనపై కేసు అక్రమమని, దాన్ని ఏసీబీ న్యాయమూర్తి కొట్టివేస్తారని, ఆయనపై కేసులకు ఎటువంటి ఆధారాలు లేవని వారు విశ్వసించారు. అయితే వారి విశ్వసాలను వమ్ము చేస్తూ న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధించారు. దీంతో వారు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. ఎటువంటి నేతకు ఎటువంటి పరిస్థితి వచ్చిందని తల్లడిల్లిపోయారు. రిమాండ్ తరువాత హైకోర్టులో కేసును క్వాష్ చేస్తారని, ఎంతో లబ్ధప్రతిష్టులైన సుప్రీంకోర్టు న్యాయవాదులు, అంతర్జాతీయ స్థాయి న్యాయవాది ఆయన తరుపున హైకోర్టులో వాదించారని, హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశించారు. అయితే వారి ఆశలపై హైకోర్టు నీళ్లు గుమ్మరించింది. దీంతో తమ నేతను ఏదో చేయాలనే భావనతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కుట్రపన్నుతున్నారనే ఆక్రోశం వారి నుంచి వ్యక్తం అవుతోంది.
అవినీతి చేశాడనే దానిపై ఎటువంటి ఆధారాలు లేకపోయినా, ఇటువంటి వేధింపులు ఏమటనే బాధ వారిలో ఉంది. ఒకవైపు బాబాయి హత్య కేసులో రెడ్‌హ్యండ్‌గా దొరికిన వారిని కనీసం అరెస్టు చేయలేదని, వారు రొమ్ము విరుచుకుని తిరుగుతుంటే తమ నేతపై ఈ వేధింపులు ఏమిటని వారు ఒకొరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. ఏ ఇద్దరు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుని ఆవేదనను, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది..కక్ష సాధింపు చర్యలు ఇంత ఘోరంగా ఉంటాయా..? వ్యవస్థలు ఇంత ఘోరంగా పతనమవుతాయా..? అంటూ ఆవేదన చెందుతున్నారు. గత 14 రోజుల నుంచి వారి ధ్యాసంతా అధినేతపైనే ఉంది. జైలులో ఆయన ఎలా ఉన్నారో..? ఆయన ప్రాణాలకు ముప్పు ఎక్కడ వాటిల్లితుందో అనే బెంగ వారిలో ఉంది. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతున్నా కేంద్రంలోని పెద్దలు మౌనం పాటిస్తున్నారని, ఇదంతా వారికి తెలిసే, వారి కనసన్నల్లోనే జరుగుతోందన్న ఆగ్రహం వారిలో వ్యక్తం అవుతోంది. ఎటువంటి సాక్ష్యాధారాలు లేని కేసులో చంద్రబాబు వంటి నేతకే ఇలా జరిగితే భవిష్యత్తులో సామాన్య ప్రజల పరిస్థితేమిటని వారిలో వారు ప్రశ్నించుకుంటున్నారు. మోడీ, అమిత్‌షాలు ఒక వ్యూహం ప్రకారం తెలుగుదేశాన్ని దెబ్బతీయిస్తున్నారని, టిడిపి దెబ్బతింటే ఆ ఖాళీలో వారు చేరిపోవచ్చనే వ్యూహంలో భాగంగానే ఈ విధంగా వార వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారు టిడిపిని ఎంత ఇబ్బంది పెట్టినా..టిడిపికి ఏమీ కాదని, ఈ కష్టాలు కొన్నాళ్లేనని, భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కుదటపడుతాయని, దీని కోసం కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు ఐక్యంగా ఉండాలనే భావన వారిలో వ్యక్తం అవుతోంది. మొత్తం మీద గత 14 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు టిడిపిలో నైతికస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తున్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.