అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న ట్రావెలర్‌.. 23 మంది మృతి

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

గువాహటి: అసోంలోని కాజీరంగా జాతీయ పార్కు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెలర్‌ వాహనం ఎదురుగా వస్తున్న కంటైనర్‌ ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది యువకులు, కళాశాల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కోహోరా పరిధిలోని హతికులి టీ ఎస్టేట్‌ సమీపంలో జాతీయ రహదారి-715పై ఈ ప్రమాదం జరిగింది. గోలాఘాట్‌ నుంచి నగావ్‌ వైపు వెళ్తున్న ట్రావెలర్‌.. అప్పర్‌ అసోం దిశగా వెళ్తున్న కంటైనర్‌ ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ట్రావెలర్‌ వాహనం తీవ్రంగా దెబ్బతినడంతో పలువురు ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. స్థానికులు, పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీశారు.

ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు

ప్రమాదంలో గాయపడిన వారిని తొలుత కోహోరా మోడల్‌ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని బొకాఖాట్‌, గోలాఘాట్‌ ఆసుపత్రులతో పాటు జోర్హాట్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌కు పంపించారు. ప్రమాద సమయంలో ట్రావెలర్‌లో ఎంతమంది ఉన్నారన్నది వెంటనే తెలియరాలేదు. అయితే 35 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాల బాధను ఏ మాటలూ తగ్గించలేవని, ఈ కష్ట సమయంలో అసోం ప్రజలంతా వారికి అండగా ఉంటారని సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి అతుల్‌ బోరా ప్రమాద స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

అతివేగమే ప్రమాదానికి కారణమా?

కాజీరంగా జాతీయ పార్కు పరిసరాల్లో వాహనాల వేగంపై ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ ట్రావెలర్‌ అత్యంత వేగంగా ప్రయాణిస్తోందని, డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతోనే ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు గోలాఘాట్‌ జిల్లా అధికారులు తెలిపారు. రెండు వాహనాల వేగం, ప్రయాణికుల సంఖ్య, వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించారా? అనే అంశాలతో పాటు ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అన్న కోణాల్లో దర్యాప్తు చేయనున్నారు.

మృతదేహాలకు గోలాఘాట్‌లోని స్వాహిద్‌ కుశాల్‌ కోన్వర్‌ సివిల్‌ ఆసుపత్రిలో రాత్రి పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రత్యేక లైటింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు అదనపు జిల్లా కలెక్టర్‌ జింటు బోరా తెలిపారు.