ఏలూరు పోలీసుల సరికొత్త రికార్డు.. నెలలో 200 మొబైల్ ఫోన్లు రికవరీ
ఏలూరు: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు తిరిగి అప్పగించడంలో ఏలూరు జిల్లా పోలీసులు మరోసారి తమ సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకున్నారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు సైబర్ సెల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి గత నెలలోనే 200 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు.
రూ.50 లక్షల విలువైన ఫోన్లు రికవరీ
ఏలూరు సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ దాసు, సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించారు. తాజాగా రికవరీ చేసిన 200 ఫోన్ల మార్కెట్ విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను మంగళవారం సంబంధిత బాధితులకు పోలీసు అధికారులు అందజేస్తున్నారు. దీంతో తమ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటివరకు 4,563 ఫోన్లు రికవరీ
ఏలూరు జిల్లా పోలీస్ శాఖ మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 4,563 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.11.40 కోట్లు ఉంటుందని తెలిపారు.
ఫోన్ పోయిందని ఆందోళన చెందొద్దు
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పోలీసులు భరోసా ఇచ్చారు. బాధితులు అందించే ఫిర్యాదుల ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోగొట్టుకున్న ఫోన్లను వీలైనంత త్వరగా ట్రేస్ చేసి వారికి అప్పగించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.